తెలంగాణ అంశాన్ని ఈ సమావేశాల్లోనే తేల్చేస్తే మంచిదని, 14వ లోక్‌సభలో ఆమోదం పొందకపోతే 15వ లోక్‌సభలో ఇదే అంశం ఉంటుందని, అప్పుడూ తేలకపోతే 16వ లోక్‌సభలో కూడా ఉంటుందని ఆర్ధిక మంత్రి చిదంబరం సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్నారు. అందువలన బిల్లును ఓడించడమో, ఆమోదించడమో వెంటనే జరిగిపోవాలి అని ఆయన స్పష్టం చేశారు. బిల్లు ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరిగిందని, రాష్ట్ర శాసనసభ వ్యతిరేకించినా పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని ఏ రాజకీయ పార్టీలు అడ్డుకోలేవని చిదంబరం వ్యాఖ్యానించారు. తర్వాతి లోక్‌సభలో కూడా అన్ని పార్టీల ఎంపీలు తెలంగాణ నుండి 17, సీమాంధ్ర నుండి 25 మంది ఉంటారని, సమస్య ఇలాగే ఉంటుంది కాబట్టి తెలంగాణ బిల్లును ఎప్పటికీ అడ్డుకోలేరని హెచ్చరించారు. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కేంద్ర ప్రభుత్వ అజెండాలో అత్యధిక ప్రాధాన్యం ఉన్న అంశమని, ఓటు ద్వారా కాకుండా సభను అడ్డుకుని సమావేశాలు జరగకుండా ఆటంకపరిచే వారిపై కఠిన చర్యలు తప్పవని కమల్ నాథ్ హెచ్చరించారు. సభను అడ్డుకునే ఎంపీలపై చర్యలు తీసుకోమని స్పీకర్ ను కోరుతామన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందకూడదని ఎవరైనా భావిస్తే వారు వ్యతిరేకంగా ఓటు వేయొచ్చుగానీ, సభను మాత్రం అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ, తెలంగాణ బిల్లుతో పాటు ఇతర అన్ని బిల్లులకూ తాము మద్దతు తెలుపుతామని, సభను అడ్డుకోకుండా చూసే బాధ్యత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని సూచించారు.