సోమవారంనాడు మొదలైన చర్చ…పలుమార్లు వాయిదా…
ఎందరో పోరాటయోధుల ఉద్యమ స్ఫూర్తితో సాకారమైన తెలంగాణా స్వప్నం బిల్లు రూపాన్ని సంతరించుకుని అసెంబ్లీలోదర్శనమిచ్చింది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, బిల్లుప్రతులను కాల్చేసినా, చించేసినా దర్జాగా తలెత్తుకొని నుంచుంది. 60 ఏళ్లుగా సాగుతున్న దోపిడీ నుండి తనను తాను రక్షించుకునేందుకు తెలంగాణా బిడ్డల ఉక్కుపిడికిలే రక్షణ కవచంలా ముందుకు సాగింది.
స్పీకర్ ప్రభుత్వ నిభంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనబిల్లును అసెంబ్లీలో ప్రవేశబెట్టగానే చర్చ జరుగుతున్న సమయంలో సహించలేని సీమాంధ్ర నాయకులు స్పీకర్ పోడియం చుట్టూ చేరి సభను అడ్డుకోగానే తప్పనిసరి పరిస్థితుల్లో సభ వాయిదా పడింది. అయినా సీమాంధ్ర ఎమ్మెల్యేలు తమ నీచరాజకీయాలను వదలకుండా సభవెలుపలా బిల్లుప్రతులను చించేసి, కాల్చేసి తమ అహాన్ని ప్రదర్శించారు. ఉదయం 10గంటలకు తిరిగి ప్రారంభమైన సభలో స్పీకర్ తరపున అసెంబ్లీ సెక్రటరీ రాజా సదారాం బిల్లు ముసాయిదాను సభ్యులకు వినిపించారు. డ్రాఫ్ట్ చదువుతున్నంతసేపూ సెక్రటరీ చుట్టూ తెలంగాణ ఎమ్మెల్యేలు రక్షణ కవచంగా నుంచున్నారు. ఎర్రబెల్లి ఈ పర్యవేక్షణ బాధ్యతను స్వీకరించారు. తర్వాత స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు. మళ్ళీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు బయటికొచ్చి బిల్లుప్రతులను కాల్చి, చించివేసి వికృతచేష్టలకు పాల్పడ్డారు. దీనిని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ గండ్ర తీవ్రంగా అడ్డుకున్నారు.
తెలంగాణ రాజకీయ చరిత్రలోనే సోమవారంనాటి సభ వెలిగిపోయింది. అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు ఒక్కటిగా చేరి సీమాంధ్రుల కుటిల ప్రయత్నాలను తిప్పి కొట్టారు. స్వంత ప్రయోజనాలకంటే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు ముఖ్యమని చాటారు. బిల్లు అసెంబ్లీకి వచ్చే సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్రమత్తతతో వ్యవహరించి సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టడంలో చాతుర్యత ప్రదర్శించారు. అన్ని పార్టీల టీ నేతలతో కలిసికట్టుగా ఉండి బిల్లుప్రక్రియ పూర్తవడంలో సహకరించారు. స్పీకర్ సీమాంధ్రకు చెందినవారు ఐనప్పటికీ, ఏమాత్రం సీమాంధ్ర ఒత్తిళ్లకు లొంగకుండా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి విభజన బిల్లుపై చర్చ జరిపారు.
సభ మళ్ళీ నాలుగు గంటలపాటు వాయిదా పడ్డప్పటికీ స్పీకర్ చర్చ మొదలుపెట్టే అవకాశాన్ని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్కకు అప్పగించారు. రాష్ట్ర విభజనపై చర్చను ప్రారంభించేందుకు డిప్యూటీ స్పీకర్ తనకు అవకాశమిచ్చారని, తర్వాత మాట్లాడాలని ప్రతిపక్ష నేతను కూడా కోరారని కేంద్ర మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశబెట్టడంలో జానారెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు గట్టిప్రయత్నాలు చేసారు. సీఎం సభకు రాకపోయినా సీమాంధ్ర ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడుతూ బిల్లును అడ్డుకోవడానికి కుట్రలు చేశారని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు.