తెలంగాణ బిల్లుపై బుధవారం నుండి అసెంబ్లీలో చర్చ జరిపేందుకు బీఏసీ అనుమతి ఇచ్చింది. దీంతో తెలంగాణ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఎలాగైనా చర్చ జరక్కుండా ఆపుదామని సీమాంధ్ర ఎమ్మెల్యేలు అడ్డుకున్నప్పటికీ, తెలంగాణ నేతల ఒత్తిడికి బీఏసీ తలొంచక తప్పలేదు.
రేపటినుంచి బిల్లుపై చర్చ జరుగుతుందని స్పీకర్ చెప్పినట్లు టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు, మోత్కుపల్లి తెలిపారు. ఒకవేళ సమయం సరిపోకపోతే జనవరిలో మరోసారి సమావేశమై బిల్లుపై చర్చించనున్నట్లు సమాచారం. రేపటితో ప్రస్తుత సమావేశాలు ముగించి జనవరి 2 లేదా ౩ నుండి బిల్లుపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేద్దామన్న సీమాంధ్ర మంత్రుల ఎత్తుగడను డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా వ్యతిరేకించారు. రేపటినుండే బిల్లుపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
రేపటి నుండి ప్రశ్నోత్తరాలు రద్దయ్యే అవకాశముంది. ఉదయం 9 గంటలనుండే తెలంగాణ బిల్లుపై చర్చజరగనుంది. ప్రతి క్లాజ్ పై అందరు సభ్యులు మాట్లాడే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.