స్వైన్ ఫ్లూ వ్యాధిని అరికట్టేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. వచ్చే ఐదేళ్లకు సరిపడా మందులు సమకూర్చుకోవడం, వ్యాధిన పడ్డ రోగులకు ఉచితంగా వైద్యం అందించడం గొప్ప విషయమని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన స్వైన్ ఫ్లూ వ్యాధిని తగ్గించడానికి ఇక్కడి రాష్ట్రం తీసుకున్న చర్యలు బాగా ఉపయోగపడ్డాయని బృందం పేర్కొంది. రెండు రోజులుగా గాంధీ, ఉస్మానియా, ఫీవర్ హాస్పిటళ్ళలో సందర్శించి అక్కడ స్వైన్ ఫ్లూ రోగులకు అందిస్తున్న చికిత్స, నివారణకు తీసుకుంటున్న చర్యలను ఈ బృందం పరిశీలించింది. అనంతరం శుక్రవారం సీఎం కేసీఆర్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకుని స్వైన్ ఫ్లూ వ్యాధిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎంతో చర్చించారు.
ఆరోగ్యశ్రీలో స్వైన్ ఫ్లూను చేర్చడం వల్ల పేదలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందుతుందని, స్వైన్ ఫ్లూపై యుద్ధం ప్రకటించి రాష్ట్ర రాజధాని సహా అన్ని ఏరియా ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచడం తమ దృష్టికి వచ్చిదని కేంద్ర బృందం ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ అశోక్ కుమార్ సీఎంతో అన్నారు. స్వైన్ ఫ్లూ ప్రభావం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఉందని, ఈ వ్యాధిపై అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం కల్పించిందని వారు అన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎదుర్కొనేలా వైద్య ఆరోగ్య శాఖను పటిష్ఠంగా తీర్చిదిద్దుతామని, వేసవిలో కొన్ని, వర్షాకాలంలో కొన్ని, శీతాకాలంలో కొన్ని వ్యాధులు ప్రజల్ని ఇబ్బంది పెడతాయని, ఆ సమయంలో హడావిడి చేయడం కన్నా ముందే ప్రజలకు అవగాహన కల్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కువ బడ్జెట్, ఎక్కువ సిబ్బంది వైద్య, ఆరోగ్య శాఖకే ఉన్నట్లు, రోగ నిర్ధారణకు అవసరమయ్యే యంత్రాలు కూడా ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచుతామని సీఎం కేసీఆర్ చెప్పారు.