బీజేపీకి కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దాసోజు శ్రవణ్ బీజేపీని వీడిన కొద్ది గంటల్లోనే శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కూడా ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి తన రాజీనామా లేఖ రాశారు. కాగా అనేక ఆశలు ఆశయాలతో బీజేపీలో చేరిన తనకు సరైన గౌరవం దక్కగపోగా.. అవమానాల పాలయ్యానని ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీలో ఉన్న ధనవంతులకు, బడా కాంట్రాక్టర్లకు మాత్రమే ప్రాతినిధ్యం పెంచుతున్నారని… నిబద్దతతో, నిజాయితీగా పనిచేస్తున్న బడుగు, బలహీన వర్గాల నాయకులూ, కార్యకర్తల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇన్ని అవమానాలు పడుతూ…కలత చెందుతూ పార్టీలో కొనసాగలేక రాజీనామా చేస్తున్నానని స్వామి గౌడ్ లేఖలో వెల్లడించారు.
అయితే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ మునుగోడు అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తీరు వల్లే ముఖ్యనేతలు రాజీనామా బాట పడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే స్వామిగౌడ్ ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశం అయ్యారు. దాసోజు శ్రవణ్ తోపాటు, స్వామిగౌడ్ కూడా టీఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖాయం అయింది. ఇక బీజేపీ ముఖ్యనేతల రాజీనామాల గురించి నెట్టింట్లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. మరింతమంది బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరతారని నెటిజన్లు చర్చిస్తున్నారు.