mt_logo

స్వామి కాదు.. సేవకుడు

By: కిషన్ భాగ్గారి

పుట్టింది పేదింట్లో అయినా పోరాటానికి మాత్రం పెద్దబిడ్డ స్వామిగౌడ్! 69 ఉద్యమంలో తూటా దెబ్బతిని..
మలిదశ ఉద్యమంలో కీలకమైన సకలజనుల సమ్మెకు నాయకత్వం వహించిన ఆయన జీవితంలో ఎన్నో ఉత్థానపతనాలను చూసిండు! పంచాయతీ సేవక్.. పాఠశాల చెప్రాసీ నుంచి టీఎన్జీవో నాయకుడిగా.. అటుపై ఎమ్మెల్సీ.. ఇప్పుడు మండలి చైర్మన్‌గా తలపడుతున్నడు! ఇదంతా ప్రజాస్వామ్యం గొప్పతనమే అంటున్న నిండైన మనిషి స్వామిగౌడ్‌తో ములాఖాత్..

అది 1977వ సంవత్సరం.. రాజేంద్రనగర్ పంచాయతీ సమితిలో సేవక్ ఉద్యోగంలో చేరిన. 120 గ్రామాల్లోని సర్పంచ్‌లకు ఉత్తరాలు బట్వాడా చేయడం నా పని. సైకిల్‌మీదే ప్రయాణం. అప్పటికే నేను స్వామి వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ నైట్ కాలేజ్‌లో బీఏ చదువుతుంటి. డే టైమ్‌లో ఖాళీగా ఉండటం ఇష్టం లేకుండె. ఒకసారి వట్టినాగులపల్లి పరిధిలో రోడ్డుకు గుంతలు పూడ్చే సమయంలో దాని ముందు ఒక బోర్డుపెట్టి గ్యాంగ్‌మెన్ అన్నం తినడానికి ఇంటికి పోయిండు. ఈ విషయాన్ని సమితి చైర్మన్ రాంరెడ్డి గమనించి.. గ్రామ అభివృద్ధి అధికారికి చీటీ రాసి నాకిచ్చి పంపిచ్చిండు. తిరుగుట్లో ఆ చీటీ సంగతి మర్చిపోయిన. ఆ కారణంగా నాతోపాటు ముగ్గురు గ్యాంగ్‌మెన్‌లను సస్పెండ్ చేసిన్రు. నిరాహార దీక్ష చేసి మా ఉద్యోగాలు మాకొచ్చేటట్టు చేసుకున్నం. ఆరోజే తెలిసింది నాకు.. పోరాటం ద్వారానే హక్కులు సాధించుకోవాలని! ఆ తరువాత గ్యాంగ్‌మెన్, సేవక్ యూనియన్‌గా ఏర్పడ్డం.

ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయించుకున్నం! ఇవేవీ గిట్టని కొందరు నామీద కోపం పెంచుకున్నరు. పాలమాకుల అనే గ్రామంలోని పాఠశాలకు సేవక్‌గా బదిలీ చేసిన్రు. అయినాసరే నాకు మంచే జరిగింది. స్కూల్ ఊడ్వడం అయిపోయినంక పుస్తకాలు చదివేది. టీచర్ల కొరతను గుర్తించిన గ్రామపెద్దలంతా కలిసి నా దగ్గరికొచ్చి చదువుకున్నవాడివేకదా.. నువ్వూ పిల్లలకు పాఠాలు చెప్పు అని అడిగిన్రు. అప్పటి నుంచి ఏ సార్ స్కూల్‌కు రాకపోయిన ఆ క్లాస్ నేనే తీసుకునేటోణ్ణి. సేవక్ అయిఉండి విద్యార్థులకు పాఠాలు చెప్పుడేందని మళ్లీ నన్ను సస్పెండ్ చేసిన్రు. ఇగ లాభంలేదని న్యాయపోరాటానికి దిగిన. సుభాషణ్‌రెడ్డి నాకు లాయర్. కోర్టులో కొట్లాడి ఉద్యోగం మళ్లీ సంపాదించుకున్నా!

ఎన్‌సీసీతో కలిసొచ్చింది
అప్పటి రాష్ట్రపతి వీవీగిరికి సెల్యూట్ కోరం కోసం నన్ను సెలక్టు చేశారు. కారణం 1969లోనే నేను ఎన్‌సీసీలో క్యాండేట్‌గా శిక్షణ తీసుకున్నా. రాష్ట్రపతి సెల్యూట్ కోరంలో నేను కూడా ఢిల్లీకి పోయిన. ఢిల్లీ ఎన్‌సీసీ హెడ్ సిన్హా మా దగ్గరికి వచ్చి వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వాళ్లు ఎంప్లాయిమెంట్ ఎక్స్చేన్జీలో పేర్లు నమోదు చేసుకోవాలని చెబితే నేను కూడా నమోదు చేసుకున్నా. ఆ తరువాత ఇక్కడున్న ఫుడ్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ ఐపీఎస్ థామస్ ఎన్‌సీసీ, స్కౌట్స్‌లో శిక్షణ కలిగిన వాళ్లు ఎవరైనా అటెండర్‌గా వస్తే బాగుంటుందని ఆయన ఢిల్లీకి రాశారు. ఎన్‌సీసీ, స్కౌట్సే ఎందుకు కావాలంటే వాళ్లకు క్రమశిక్షణ ఎక్కువ ఉంటుందని. నేను పేరు నమోదు చేసుకున్నా కనుక నాకు కూడా పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూకు పోతే 65 మంది వచ్చారు.

వారిలో నేను సెలక్ట్ అయిన. 1977లో దివిసీమ ఉప్పెనలో వేలాది ప్రాణనష్టం జరిగింది. అప్పుడు థామస్ మా కార్యాలయంలో ఒక మీటింగ్ పెట్టి ఎవరైనా నాతో దివిసీమకు వస్తారా… అంటే నేను, పరంజ్యోతి ఇద్దరం చేతులెత్తినం. ఇద్దరమూ తెలంగాణవాళ్లమే. అక్కడ ఒకచోట.. చిన్నపిల్ల ఏడుపువిని ఒకదిక్కు ఉరికినం. చూస్తే.. ఉప్పెనలో కొట్టుకొచ్చిన ఒకామె తాటిచెట్టుమీద చిక్కుకొని, బిడ్డను కని ప్రాణం వదిలేసింది. నేర్పుగా తల్లిపేగును తెంపి ఆ పసిబిడ్డని కిందికిదించిండు పరంజ్యోతి! వైద్యసహాయంకోసం రెండు కిలోమీటర్లు పరిగెత్తినం. ఇట్లా చెప్పనలవికాని వందలాది మందికి సేవలు అందించినం. థామస్‌లాంటి వ్యక్తి దగ్గర పనిచేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. దివిసీమ నుంచి తిరిగొచ్చిన తరువాత మా అందరినీ సన్మానించిండాయన! సరే గౌరవించిండు కదాని ఉద్యోగుల పట్ల కఠినంగా ఉంటేమాత్రం ఊరుకోలే. ఆయనతో కలిసి పనిచేసిన నేను థామస్ గో బ్యాక్ అనే పరిస్థితి వచ్చింది. ఉద్యోగుల పట్ల ఆయన తీరుతెన్నులు నచ్చక యూనియన్ ద్వారా గోబ్యాక్ నినాదం చేసింది నేనే!

సమయపాలనలో భేష్
నేను ఎన్‌సీసీ క్యాండేట్‌ని కాబట్టి సమయపాలనను ఎప్పుడూ ఉల్లంఘించలేదనే చెప్పాలి. టీఎన్జీవోలో నాయకుడినే అయినా పనిచేస్తున్న డిపార్ట్‌మెంట్ తరువాతే యూనియన్ కార్యక్రమాలు చేసేది. కాశీవిశ్వనాథ్ అని ఏపీఎన్జీవో సంఘం నాయకుడు ఉంటుండె. ప్రమోషన్ విషయంలో ఆయనొక తప్పుడు లెటర్ ఇవ్వడంతో నాకు కోపమొచ్చింది. ఇట్లకాదు.. ఏఏ డిపార్ట్‌మెంట్లలో ఎంత మంది ఆంధ్రోళ్లున్నారనేదానిపై స్వయంగా ఎంక్వైరీ మొదలు పెట్టిన. అది చూసి అప్పటి టీఎన్జీవో అధ్యక్షుడు స్వామినాథం నన్ను హైదరాబాద్ కేంద్రానికి పట్టుకొచ్చిండు. అప్పట్లో సంఘం ఉండేది కానీ ఏ డైరెక్టరేట్ మీదా టీఎన్జీవో జెండా ఎగురవేయలే! ఉద్యోగులు ఒక్కరున్నా.. ఇద్దరున్నా.. కమిటీలు వేసుకుంటూ ముందుకు పోయినం. ఇవాళ తెలంగాణ జెండా లేని కార్యాలయం లేదు. టీఎన్జీవోకు 8 సంవత్సరాలు అధ్యక్ష, కార్యదర్శిగా పనిచేసిన. అన్ని యూనియన్లను, ఉపాధ్యాయ సంఘాలను కలపడంలో ఎలాంటి భేషజాలకు పోలేదు. ఉద్యోగుల హక్కుల కోసం అవసరమైతే ఆంధ్రా సంఘాలతో కూడా కలిసి పనిచేసిన.

69గాయం ఇంకా వెంటాడుతూనేఉంది!
సిటీ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో.. ఒక సమావేశానికి జయశంకర్, మరొకదానికి కేశవరావుజాదవ్, మల్లికార్జున్ వస్తున్రని తెలిసింది. నేను వీవీ కాలేజీకి పోయిన. బయట పోలీస్‌స్టేషన్‌ను తగులబెట్టడంతో పోలీసులు మాపై కాల్పులు జరిపిన్రు. ఇద్దరు యువకులు అక్కడికక్కడే కుప్పకూలిన్రు.

నేను మొజంజాహీ మార్కెట్ దిక్కు ఉరికిన. కొద్దిసేపటి తర్వాత చూసుకుంటే నా చేతికి బుల్లెట్ తగిలిన సంగతి అర్థమయింది! రక్తం కారుతుంటే అట్లనే ఇంటికి పోయిన. గాయానికి కారం అద్ది రక్తం కారకుండా కట్టుకట్టింది అమ్మ. ఈ సంగతి తెలిసి ఓల్డ్‌సిటీ కాంగ్రెస్ నాయకుడు ఆలీపాషా, సీపీఐ నాయకుడు వెంకట్రావు ఇంటికొచ్చిన్రు. ఆరోజు మాకు ఒక్కటే తెలుసు తెలంగాణ కావాలని. కానీ ఎందుకు కావాల్నో మాత్రం తెల్వదు! మలిదశ ఉద్యమంతో పోల్చుకుంటే 69 ఉద్యమం హింసాయుతంగా సాగిందనే చెప్పాలి. ఎటుచూసినా విద్యార్థులు.. వాళ్లని తరిమే పోలీసులు.. తూటాలు, శవాలు.. తగులబడే వాహనాలు..! వీటన్నింటికి భిన్నంగా అహింసాపద్ధతులద్వారా కేసీఆర్ సాగించిన ఉద్యమం చివరికి గమ్యాన్ని ముద్దాడింది! కొట్టుడు, గుద్దుడు, చంపుడు లాంటివి చేస్తే పోలీసులు ఉద్యమాన్ని అణిచివేస్తారని కేసీఆర్ మొదటినుంచి చెబుతూనేఉన్నడు. 69 పోరాటం తరువాత ఇక తెలంగాణ రాదని చాలామంది నిరాశనిస్పృహలకు గురయిన్రు. మళ్లీ అందర్నీ తట్టిలేపింది కేసీఆర్ ఒక్కడే! వచ్చిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. మేం ఎంత కాన్ఫిడెంట్‌గా ప్రజలకు చెప్పినమో అంతే కాన్ఫిడెన్స్‌తో వాళ్లు మావైపు చూస్తున్నరు. బంగారు తెలంగాణను నిర్మించి చూపించాల్సిన బాధ్యతను ఎప్పటికీ మర్చిపోం.

ఆ పేరు సూచించింది నేనే
సకలజనుల సమ్మెకు ఆ పేరును సూచించింది నేనే. సకలజనులకు సంబంధించినది కనుక ఆ పేరైతే బాగుంటుందని అన్నా. జేఏసీ కూడా అందుకు ఓకే అన్నది. ఒకానొక సందర్భంలో జయశంకర్‌సార్ నాతో మాట్లాడుతుంటే సార్.. తెలంగాణ ఉద్యమం చేస్తున్నం కదా….ఆంధ్రోళ్లు దోపిడీదారులైతే తెలంగాణవాళ్లంతా సత్యహరిశ్చంద్రులన్నట్టేనా? అని అడిగిన. దానికి సమాధానంగా ఆయన ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యూ వరకు కలిసి ఉద్యమిస్తేనే తెలంగాణ వస్తుందని అన్నడు. ఇంకా.. మనదగ్గర కూడా దోపిడీదారులుంటారు.

ఒక విషయం గుర్తుపెట్టుకో…. పక్కూరినుంచి వచ్చి మనూళ్లే చిటీలు వేసేవాళ్లు వాళ్ల ఊరి గణపతికే పెద్ద చందా ఇస్తారు. అదే మనూరోళ్లే మనూళ్లే చిటీలేస్తే మనూరి వినాయకుడికే పెద్ద చందా ఇస్తారు. అంటే దోపిడీదారులు మనోళ్లు అయితే మనదగ్గరే డబ్బు ఉంటది కదా అని అన్నడు. ఆయనతో ఉన్న అనుబంధం నాకు రోజు గుర్తుకొస్తనే ఉంటది. మొదట్లో తెలంగాణ ఉద్యమానికి, టీఎన్జీవోలకు సంబంధం లేకుండేది. రానురానూ టీఎన్జీవోల ఉద్యమమే తెలంగాణ ఉద్యమంగా మారింది. చాలా మందికి తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోలు భాగమని అనుకుంటారు. ఆంధ్రాతో తెలంగాణ కలవగానే నష్టపోయింది జయశంకర్‌సార్. ఉపాధ్యాయుడిగా తెలంగాణలో సెలక్ట్ అయితే ఆంధ్రాలో ఉద్యోగంలో చేరిండు. టీఎన్జీవో ఉద్యమాన్ని సపోర్టు చేసింది హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రామానంద తీర్థ. ఆయన ఉద్యోగుల ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ర్యాలీ తీసిండు. అప్పుడు టీఎన్‌జీవో, ఎస్‌టీయూ రెండే ఉండేవి. 610, ఫ్రీజోన్ వంటివి వాటిపై పోరాడింది ఉద్యోగులే. ఆ తర్వాతే దీనిని రాజకీయనాయకులు టీఆర్‌ఎస్‌లోకి వస్తాననుకోలేదు.

నేను టీఆర్‌ఎస్‌పార్టీలో చేరుతానని ఏనాడూ అనుకోలే. కేసీఆర్‌ సార్ గనుక నన్ను టీఆర్‌ఎస్‌లోకి పిలవకపోయి ఉంటే జేఏసీలోనే ఉంటూ పనిచేసేవాడిని. పార్టీలోకి వచ్చిన తరువాత నన్ను నేను మార్చుకున్నా. ఉద్యోగుల సంఘంలో నేనే నాయకుడిని. కానీ పార్టీలో అట్లాకాదు.. లక్షలాది కార్యకర్తలు, వందలమంది నాయకులు.. ఇదొక వ్యవస్థలా ఉంటుంది. కొన్ని నిర్ణయాలు మనకు నచ్చొచ్చు… నచ్చకపోవచ్చు! అమ్మగారి ఇంటినుంచి అత్తగారింటికి పోయిన విధంగానే ఉంటుంది. అమ్మగారిల్లులాంటి ఉద్యోగ సంఘంలో ఎన్నో ఉంటాయి. కానీ అత్తగారింట్లో అందరినీ గౌరవిస్తూ పార్టీకి అనుగుణంగా పనిచేయాలి. నేను ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాననే అనుకుంటున్నా! బడుగు, బలహీన వర్గాలు క్యాబినెట్‌లోకి రావడం.. రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడం మంచి పరిణామం. ప్రజాస్వామ్యం ఎంత గొప్పదంటే.. చెప్రాసీకి కూడా చైర్మన్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తది! పార్టీలో చాలా కంఫర్ట్‌గా ఉన్నా. ఏదో అయిపోదామని ఇక్కడికి రాలేదు. అందుకే తెలంగాణ ప్రజలకు సేవచేసే ఎలాంటి అవకాశం వచ్చినా సంతోషంగా స్వీకరిస్తా!

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *