mt_logo

స్వల్ప మార్పులతో టీఎస్‌పీఎస్సీ..

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ద్వారా జారీ అయ్యే ఉద్యోగాలకు సంబంధించి జరిగే పరీక్షలలో ఎలాంటి మార్పులు ఉండబోవని, సిలబస్ లో కూడా స్వల్ప మార్పులే చేస్తున్నామని కమిషన్ నిపుణుల కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ పరీక్షల ప్రణాళిక, పాఠ్యాంశాల రూపకల్పన పై 25 మంది సభ్యులతో ఏర్పాటుచేసిన కమిటీ సమావేశం ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో శుక్రవారం తొలి భేటీ జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు సీ విఠల్, మతీనుద్దీన్ ఖాద్రీ, చంద్రావతి, ప్రొఫెసర్ కోదండరాం, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యతో పాటు నిపుణుల కమిటీ సభ్యులంతా హాజరయ్యారు.

సమావేశం అనంతరం ప్రొఫెసర్ హరగోపాల్ సమావేశ వివరాలను మీడియాకు వివరించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ రాత పరీక్షల్లో ఏపీ చరిత్రకు స్వస్తి పలుకుతున్నట్లు, తెలంగాణ రాష్ట్ర చరిత్ర, భౌగోళిక పరిస్థితులు ప్రధానాంశాలుగా ఉంటాయని తెలిపారు. సాధారణంగా ఐదు నుండి పది సంవత్సరాల కోసం పరీక్షల ప్రణాళిక, సిలబస్ పై సమీక్ష, సిలబస్ లో మార్పులు, చేర్పులు జరగడం ఆనవాయితీ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైన నేపథ్యంలో మన రాష్ట్రంలో మన పాఠాలు ఉండాలని ప్రభుత్వం భావించిందని, అందుకే ఉద్యోగ పాఠ్యాంశాలలో పూర్తి స్థాయి మార్పులు చేస్తామని, సిలబస్ లో ఎలాంటి భారీ మార్పులు ఉండబోవని దీనిపై ఎలాంటి అపోహలకు గురికావొద్దని సూచించారు.

సాధ్యమైనంత త్వరలో సిలబస్ పై పూర్తి నివేదిక అందిస్తామని, తమ కమిటీ సిలబస్ లోని మార్పులను మాత్రమే సూచిస్తుంది తప్ప ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోదని స్పష్టం చేశారు. పరీక్షల పాఠ్యాంశాలకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ కి సూచనలు చేయడం మాత్రమే తమ బాధ్యత అని, దానిపై తుది నిర్ణయం మాత్రం సర్వీస్ కమిషన్ దేనని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *