-సమాజ హితానికే ఈ గణన.. వివరాలు చెప్తే ప్రజలకే మేలు
-ప్రజలకు భరోసానిస్తున్న అధికారులు
-దుష్ప్రచారాలు నమ్మొద్దని సూచన
-బ్యాంకు ఖాతాలేమీ రహస్యం కాదు
-సిబిల్ వద్ద సకల లావాదేవీల వివరాలు
-యజమాని సరైన వివరాలిస్తే చాలు
-సంక్షేమ పథకాల సక్రమ అమలుకే సర్వే
సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్
సర్వే చేసే ఎన్యూమరేటర్లు వంటగదిలోకి కూడా వచ్చేస్తారా? అణువణువూ సోదాలు చేస్తారా? సర్వే జరిగే రోజు కుటుంబసభ్యుల్లో ఎవరు అందుబాటులో లేకపోయినా వారికి సంక్షేమ పథకాలు అందనట్లేనా? బ్యాంకు ఖాతాల వివరాలు అందజేస్తే ఏదన్నా ముప్పు వస్తుందా? ఆదాయంపన్ను అధికారులు దాడులు చేస్తారా? ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇంటింటి సమగ్ర సర్వేపై మీడియా, రాజకీయ పార్టీలు సృష్టిస్తున్న గందరగోళం నేపథ్యంలో ప్రజల్లో తలెత్తుతున్న సందేహాలివి! అయితే ఇలాంటి సందేహాలను అధికారులు పటాపంచలు చేస్తున్నారు. సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్లు పూర్తి స్నేహభావంతో మెలుగుతూ వివరాలు నమోదు చేసుకోవడమే కాకుండా.. వారికి వచ్చే అపోహలు కూడా తొలగిస్తారని భరోసానిస్తున్నారు.
ఈ మేరకు ఎన్యూమరేటర్లకు శిక్షణ కూడా ఇస్తున్నారు. బాధ్యతగా మెలగాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం కలగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణానికి అవసరమైన గణాంకాలు సేకరించి.. వాటి ఆధారంగా నిధుల కేటాయింపు, సంక్షేమ పథకాలు చేపట్టడం వంటి అంశాల కోసమే సమగ్ర సర్వేను ఉద్దేశించినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. సర్వే విషయంలో తలెత్తుతున్న సందేహాలను పూర్వపక్షం చేస్తూ తెలంగాణ అడ్వకేట్ జనరల్ కే రామకృష్ణారెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. సర్వేలో పాల్గొనడం ఐచ్ఛికం మాత్రమేనని, ఎవరిపైనా బలవంతం లేదని కూడా ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వం వివిధ సర్వేలు చేపట్టినదని గుర్తు చేసిన అడ్వకేట్ జనరల్.. గతంలో వివిధ పథకాల్లో భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగినందునే వాటిని ఈ సారి నివారించేందుకు సమగ్ర ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో సర్వేపై స్టే కోరుతూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
బ్యాంకు ఖాతాల నంబర్లు ఇస్తే ప్రమాదమా?
సర్వేలో పేర్కొన్న అంశాల్లో బ్యాంకు ఖాతాల నంబర్ల సేకరణ కూడా ఉంది. దీనిపైనా నానా రగడ చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లను, ఇతర పొదుపు వివరాలను వెల్లడించడం ద్వారా ఎలాంటి నష్టం ఉండదని అధికారులు వివరిస్తున్నారు. నిజానికి దేశంలోని అన్ని బ్యాంకులలో ఖాతాలు ఉన్న అందరు పౌరుల వివరాలు, వారి లావాదేవీలు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (సిబిల్) అనే సంస్థ దగ్గర ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సిబిల్ అనేది ఒక ప్రైవేటు కంపెనీ. ప్రజలందరి, అన్ని రకాల లావాదేవీలు ఏకకాలంలో తెలుసుకుని, క్రోడీకరించి, ఆయా వ్యక్తులు, సంస్థల పరపతి రేటింగ్‌ను ఈ సంస్థ నిర్ణయిస్తుంది. మీకు ఎవరైనా అప్పు ఇవ్వాలో లేదో సర్టిఫై చేస్తుంది.
ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. ఈ కంపెనీ డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ అండ్ ట్రాన్స్ యూనియన్ అనే విదేశీ సంస్థలతో కలిసి పనిచేస్తున్నది. మీకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం కావాలంటే.. ప్రభుత్వం కూడా లావాదేవీల వివరాల కోసం ఈ సంస్థపై ఆధారపడుతుంది! ఒక ప్రైవేటు కంపెనీకి దేశంలోని బ్యాంకు ఖాతాలన్నీ తెలుసుకునే అధికారం ఉన్నప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతా నంబర్లు తెలుసుకోవడం ఎలా తప్పవుతుంది? ఇది ప్రజల్లో లేని పోని భయాలు కల్పించడంకోసం కొన్ని పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారమేనని ఆర్థిక నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. పారదర్శకత గురించి మాట్లాడేవాళ్లు సైతం ఇప్పుడు రహస్యానికి రక్షణగా మాట్లాడటంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబసభ్యులందరూ ఉండాల్సిన అవసరం లేదు
సామాజిక సర్వే సందర్భంగా కుటుంబ సభ్యులందరూ ఇంట్లో అందుబాటులో లేకున్నా, కుటుంబ యజమాని తమ ఇంట్లో సభ్యుల వివరాలను ఎన్యూమరేటర్లకు సక్రమంగా అందజేస్తే సరిపోతుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జే రేమండ్ పీటర్ వివరణ ఇచ్చారు. సర్వేపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలపై ఆయన గురువారం స్పష్టత ఇచ్చారు. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తుల వివరాలకు సంబంధించిన ఆధారాలను సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్‌కు చూపిస్తే సరిపోతుందని చెప్పారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రజలందరకీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సామాజిక సమగ్ర సర్వేను నిర్వహిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. ఈ సర్వే ఐచ్ఛికమైనదేనని తెలిపారు. సర్వేకు చట్టబద్ధత ఉండదని, దేశంలో సర్వే నిర్వహించడానికి ప్రభుత్వానికి కూడా చట్టబద్ధత ఉండదని అన్నారు. చట్టబద్ధమైన సర్వేను కొన్ని సంస్థలు నిర్వహిస్తాయని తెలిపారు.
అందుకే ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా స్వేచ్ఛగా సర్వేలో పాల్గొని వివరాలు తెలియజేయాలని కోరారు. వ్యక్తిగత వివరాలు చెప్పాలని ఎవరినీ బలవంత పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఖచ్చితమైన, నమ్మకమైన సమాచారం ప్రజల నుంచి నేరుగా స్వీకరించడానికే ప్రభుత్వం ఈ సర్వే నిర్వహిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం కొత్తగా రూపొందించి అమలు చేసే పథకాల అమలుకు అవసరమైన బడ్జెట్ అంచనా వేయడానికే ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు రేమండ్ పీటర్ చెప్పారు. సర్వేలో ప్రభుత్వానికి అందే వివరాలు.. ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పారు. సర్వేపై ప్రజలెవరూ భయాందోళనలకు గురికావల్సిన అవసరం ఆయన విస్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలెవరికీ నష్టం చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు.
వాస్తవ వివరాలు చెపితే ప్రజలకే ఉపయోగమని అన్నారు. ప్రజల నుంచి సేకరించిన డేటాను ఈనెల 21 నుంచి మండల స్థాయిలో కంప్యూటరీకరిస్తారని పీటర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 19న 90లక్షల ఇండ్లలో 3.75లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సర్వే నిర్వహిస్తారని తెలిపారు. సర్వేకు ఉపయోగించిన సిబ్బందిలో ఎవరూ ప్రైవేటు వ్యక్తులు లేరని ఆయన స్పష్టం చేశారు. సర్వేలను నిర్వహించడం రాష్ట్రంలో కొత్త కాదన్నారు. గతంలో కూడా రాష్ట్రంలో రామారావు హయాంలో మల్టిపర్పస్ హౌజ్ సర్వే చేశారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ జనాభాపై సర్వే, బీపీఎల్ కుటుంబాల సర్వే, ఆధార్ సర్వే జరిగిన విషయాలను ఆయన గుర్తు చేశారు.
సంక్షేమ పథకాల కోసమే సర్వే
బస్తీ లేదా గ్రామం, లేదా కాలనీలలోని గణన వివరాలలో పౌరులుగా నమోదు కావాలంటే, ప్రభుత్వ పథకాలు, ఇతర సౌకర్యాలు సమకూరాలంటే సర్వేలో పాల్గొనాల్సిందే. ఒక ఒంట్లో ఎన్ని కుటుంబాలుంటున్నాయనే విషయాన్ని గ్యాస్, లేదా కట్టెల పొయ్యిని బట్టి నిర్ధారించాలని నిర్ణయించారు. ఉమ్మడి కుటుంబాలు విడిపోయి ఒక గృహంలో రెండు లేదా మూడు కుటుంబాలు కాపురం ఉంటే ఎలా గుర్తించాలనే దానికి వంటపొయ్యిని ఆధారంగా చేసుకుంటే సరిపోతుందని అధికారులు ఎన్యూమరేటర్లకు శిక్షణ సందర్భంగా సూచించారు. ఇంట్లో ఎన్ని పొయ్యిలుంటే అన్ని కుటుంబాలున్నట్లు లెక్క వేస్తారు. సమాచారమిచ్చే ఇంటి యజమానులను కసురుకోవడం కానీ విసుక్కోవడవం కానీ చేయవద్దని, బెదిరింపు ధోరణి అసలే వద్దని ఎన్యుమరేటర్లకు తేల్చి చెబుతున్నారు. కానీ ఇంటి యజమాని లేదా ఇంటి వారు ఇచ్చిన సమాచారం పూర్తిగా వాస్తవమైనదంటూ సదరు వ్యక్తులతో దైవసాక్షిగా లేదా మనస్సాక్షిగా సంతకం లేదా వేలిముద్రలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తప్పులుంటే చట్టపరమైన చర్యలకు అర్హులవుతారని కూడా సర్వే ఫారంలో ఉంటుంది. సర్వేలో ఇది ఒక అఫిడవిట్‌లా పనిచేస్తుందని భావిస్తున్నారు. మరోవైపు సమాచారం పూర్తి స్థాయిలో రాబట్టినట్లు ఎన్యూమరేటర్లు కూడా ఫారంపై సంతకం చేయాల్సి ఉంటుంది.
సర్వేలో తొలుత దాదాపు 90 అంశాలు చేర్చగా.. అందులో వివాదాస్పదంగా భావించిన కొన్నింటిని తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఒక ఎన్యూమరేటర్ పరిధిలో దాదాపు 250 నుంచి 300 ఇళ్లు ఉంటాయి. ఆ ఎన్యూమరేటర్ 15మంది సహాయ గణకులను నియమించుకోవాలి. ఎక్కువ శాతం విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులను, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను అసిస్టెంట్ ఎన్యూమరేటర్లుగా ఎంపిక చేస్తున్నారు. ఎన్యుమరేటర్లపై నోడల్ అధికారులు, క్లస్టర్ ఇన్‌చార్జిల పర్యవేక్షణ ఉంటుంది. అంటే 28 నుంచి 30 ఇళ్లకు ఒక సహాయక ఎన్యూమరేటర్ ఉంటారు. గ్రామాలలో, పట్టణాలలో ఎన్యూమరేషన్ ఫార్మాట్ తెలుగులో ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంగ్లీష్, తెలుగు రెండు భాషలలో ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాలలో ఉర్దూలో కూడా ఫార్మాట్ ఉండాలనే డిమాండ్ ఊపందుకుంది.
[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]