mt_logo

సర్వే నివేదిక ఆధారంగానే సంక్షేమ కార్యక్రమాలు – కేటీఆర్

బుధవారం మెట్రో పొలిస్ సదస్సులో జరిగిన రీడిఫైనింగ్ అర్బన్ ఎజెండా-బిగ్ డేటా- బిగ్ ఐడియాస్-బిగ్ చాలెంజెస్ అనే అంశంపై ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా, విశ్వనగరంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, పారదర్శకతతో మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, తమది కొత్త యువ రాష్ట్రమైనందున ఇక్కడి ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి డాటాబేస్ ఎంతో ఉపయోగపడుతుందని, కొత్త రాష్ట్రంలో సరికొత్త ప్రణాళికలు రూపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి కుటుంబాల్లో ఒకే రోజు 3.6 కోట్ల జనాభాకు సంబంధించి సర్వే నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు సర్వే నివేదిక ఆధారంగానే చేపట్టనున్నట్లు, అప్పుడే అర్హులకు లబ్ధి కలుగుతుందన్నారు. సర్వే నుంచి పొందిన డాటా ఆధారంగానే వచ్చే బడ్జెట్ లో నిధుల కేటాయింపు జరుపుతామని, సమగ్ర కుటుంబ సర్వే డాటాబేస్ లో ఎలాంటి రహస్యం లేదని, సమాచారాన్ని రాబట్టేందుకు సమాచార హక్కు చట్టం వంటి అత్యంత ప్రతిభావంతమైన చట్టాలున్నాయని మంత్రి పేర్కొన్నారు.

2017 నాటికల్లా 72 కిలోమీటర్ల మేరకు మెట్రో రైలు ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తుందని, మరో 15 ఏళ్లలో దాన్ని 200 కిలోమీటర్లకు విస్తరిస్తామని తెలిపారు. ప్రభుత్వం డిజిటల్ తెలంగాణను, డిజిటల్ హైదరాబాద్ ను రూపొందించాలని పట్టుదలతో ఉందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వివిధ శాఖలు పూర్తి సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *