హైదరాబాద్ ను సురక్షిత నగరంగా మార్చనున్నట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఈరోజు ఆయన సాయుధ గస్తీ వాహనాలను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగం వల్లే నేరాల శాతం పెరుగుతుందని, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను చేపట్టనున్నట్లు నాయిని పేర్కొన్నారు.
నగరంలో కొత్తగా ప్రారంభించనున్న ఈ పద్దతి ద్వారా దోపిడీ ముఠాలు, కరడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాద దాడులు జరిగినా తిప్పికొట్టేలా ఆయుధాలతో కూడిన ఇన్నోవా వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. సుశిక్షితులైన సాయుధ సిబ్బంది నగరంలోని 17 ప్రధాన కూడళ్ళలో ఈ వాహనాల్లో గస్తీ చేపట్టనునారు. మొత్తం 45 సాయుధ గస్తీ బృందాలు అందుబాటులోకి రానున్నాయని తెలిసింది.