గుజరాత్‌లోని మోర్బీలో వంతెన కూలిన ఘటనపై ఈ నెల 14న సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేసేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంలో న్యాయవాది విశాల్ తివారి పిటిషన్‌ను దాఖలు చేశారు. వంతెన కూలిన ఘటనలో వందకుపైగా ప్రాణాలు కోల్పోయారని, ఇందులో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, పూర్తి వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోందని పిటషనర్ ఆరోపించారు.
గత దశాబ్దం నుంచి దేశంలో వివిధ సంఘటనలు జరిగాయని, వీటిలో నిర్వహణ లోపం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, లోపాల కారణంగా భారీగా ప్రాణనష్టం సంభవించిన సందర్భాలున్నాయని, వీటిని నివారించవచ్చని పేర్కొన్నారు. సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ ఎదుట మంగళవారం న్యాయవాది విశాల్ తివారి వాదనలు విపించారు. పిటిషన్‌పై ప్రార్థన ఏంటని? సీజేఐ జస్టిస్ లలిత్ న్యాయవాదిని ప్రశ్నించగా.. తివారి స్పందిస్తూ న్యాయ విచారణ కమిషన్‌ను కోరుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 14న పిటిషన్ జాబితా చేయాలని ఆదేశించారు.
ఈ నెల 30న మోర్బీలో మచ్చు నదిపై వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 141 మంది ప్రాణాలు కోల్పోయారు. 140 సంవత్సరాలకుపైగా చరిత్ర ఉన్న తీగల వంతెనను కొద్ది రోజుల కిందట మరమ్మతుల నేపథ్యంలో మూసివేశారు. ఈ బాధ్యతలను ఒరేవా గ్రూప్‌కు అప్పగించారు. గతవారంలో వంతెనను తిరిగి ప్రారంభించగా.. ఆదివారం సాయంత్రం నదిలో కుప్ప కూలిపోయింది. అయితే వంతెనను తిరిగి ప్రారంభించిన సమయంలో ప్రైవేట్ ఆపరేటర్ అధికారుల నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోలేదని, అధికారుల పర్యవేక్షణ కొరవడిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. భద్రతపై ఎలాంటి శ్రద్ధ చూపడం లేదని, ఇది భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘననని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో తివారి ఆరోపించారు.
భవిష్యత్‌లో ఇలా ప్రాణనష్టం జరుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, పురాతన, ప్రమాదకర స్మారక చిహ్నాలు, వంతెనలు తదితర వాటి వద్ద ప్రమాదాన్ని అంచనా వేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అలాగే ఇలాంటి కేసులలో సత్వర దర్యాప్తు కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.