ట్రాఫిక్ ఫ్రీ సండేనాడు ట్యాంక్ బండ్ మీద సందడి మొదలైంది. అనేక కొత్త ఆకర్షణలతో పిల్లలను, పెద్దలను ఆకట్టుకుంటోంది!
మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఆగస్ట్ 24 నుండి ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఫ్రీ జోన్ ఏర్పాటు చేయగా దానికి రెండు వారాలుగా విశేష స్పందన లభించింది. ఇక ఇవ్వాళటి నుండి ట్యాంక్ బండ్ పరిసరాలను మరింత సుందరంగా ముస్తాబు చేసి, వివిధ కార్యక్రమాలతో ఫన్ జోన్ గా మార్చనున్నారు హెచ్ఎండిఏ అధికారులు. ఈ మేరకు ట్యాంక్ బండ్ పై లేసర్ షోలు, ఫన్ షోలు, శిల్పారామంలోని హస్తకళలు మరియు తెలంగాణ చేనేత వస్త్ర దుకాణాలు, విరివిగా ఫుడ్ ట్రక్స్ ఏర్పాటు చేస్తున్నారు.
వీటితో పాటు సికిందరాబాద్ ఆర్మీ బ్యాగ్ పైపర్ బ్యాండ్, సాంప్రదాయ మరియు జానపద సంగీత కార్యక్రమాలతో పాటు వివిధ షోలు, మ్యాజిక్ షోలు ఏర్పాటు చేసి నగర వాసులకు మరింత ఆనందం పంచాలని మంత్రి కేటీఆర్ సూచన చేశారు. పెద్దలతో పాటు పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి సంబంధించిన ఆటవస్తువులతో గేమ్ జోన్ ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా మొబైల్ పబ్లిక్ టాయిలెట్స్, అంబులెన్స్ లు, రక్షక దళాలను కూడా అందుబాటులో ఉంచి అత్యవసర సేవలు అందించాలన్నారు. ఇప్పటికే హెచ్ఎండిఏ అధికారులు ట్యాంక్ బండ్ పరిసరాలలో మిరుమిట్లు గొలిపే విద్యుత్ అలంకరణల ఏర్పాట్లు, ఫుట్ పాత్ లు గ్రీనరీగా మార్చే పనులు మొదలు పెట్టింది. అంతేకాకుండా ప్రజలు సేదతీరేందుకు వివిధ రకాల పూల మొక్కలతో గార్డెన్స్, వాటర్ ఫౌంటెన్స్ ఏర్పాటు చేస్తోంది.
సో, మరెందుకు ఆలస్యం. ఈరోజే ట్యాంక్ బండ్ బయలుదేరండి!