జూన్ రెండున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడనున్నందున ఇప్పుడే కొత్త న్యాయమూర్తుల భర్తీ చేపట్టరాదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తాకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం ఒక లేఖను వ్రాశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్తగా జడ్జిలను నియమించరాదని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. హైకోర్టులో 32మంది న్యాయమూర్తులు ఉండగా అందులో 24 మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారని, కేవలం 8మంది మాత్రమే తెలంగాణకు చెందినవారని ఆయన పేర్కొన్నారు. 13మంది కిందికోర్టు జడ్జీలు కాగా, పదోన్నతితో హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయని, అందులో 11మంది సీమాంధ్ర వారుకాగా, కేవలం ఇద్దరు మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందినవారని పేర్కొన్నారు. వాటా ప్రకారం తెలంగాణ ప్రాంత న్యాయమూర్తుల సంఖ్య 14గా ఉండాలని, కేవలం 8మంది మాత్రమే ఉన్నారని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త న్యాయమూర్తుల నియామకం జరిపితే తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని, రెండు హైకోర్టులు ఏర్పడ్డాక ఇప్పుడున్న జడ్జీలనే రెండు హైకోర్టులకు విభజిస్తారని, అందువల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుందని మరోసారి స్పష్టం చేశారు.
