సీమాంధ్రకు చెందిన విజ్ఞులు చెబుతున్న ప్రకారం- అక్కడ రాజధాని నిర్మాణానికి అటూఇటూగా రెండేండ్లు పడుతుంది. స్వాభిమానం గల పౌరులు కొందరు తమ రాష్ట్రంలోనే ఏదో ఒక చోట తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసుకుని జూన్ రెండున తొలి ప్రభుత్వాన్ని అక్కడే ప్రారంభించాలని కోరుతున్నారు. సీమాంధ్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఉండేది తాత్కాలికమే కనుక వారికి తాత్కాలిక వసతులు కల్పిస్తే సరిపోతుంది.
జూన్ రెండు నుంచి తెలంగాణ రాష్ట్రం తమ సొంత రాజధానిలో సొంత వసతులను అనుభవించవలసిందే. సీమాంధ్ర కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకునేలోగా కొంత కాలం హైదరాబాద్‌లో వసతులు కల్పించాలె. కానీ అసెంబ్లీ, సచివాలయం, ఇతర కార్యాలయ భవనాలను కేటాయించే ముందు ఈ వాస్తవికతను దృష్టిలో పెట్టుకుంటున్నట్టు లేదు. సీమాంధ్ర ప్రభుత్వమే ఇక్కడ శాశ్వతంగా ఉంటుందన్నట్టుగా, తెలంగాణ వారే సర్దుకోవాలనే విధంగా సదుపాయాలు కల్పించడం హేతు విరుద్ధమే కాదు, తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తుంది. భవిష్యత్తులో వివాదాలకు తావిస్తుంది. సీమాంధ్ర వలస పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం రావడానికి గల కారణాలలో వనరుల దోపిడీ ఒకటైతే, చరిత్ర సంస్కృతులను తొక్కిపెట్టి అవమానించడం మరొకటి. అందుకే తెలంగాణ పోరాటం స్వాభిమాన ఉద్యమంగా ముందుకు వచ్చింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తమ సొంత భవనాలలో, సొంత పరిపాలన సాగించడం తెలంగాణ వారికి గర్వదాయకంగా ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణం చరిత్రాత్మకమైనది. అసెంబ్లీ కోసం మొదట ఉపయోగించిన భవనాన్ని 1913లో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ హయాంలో నిర్మించారు. రాజస్థాన్‌లోని రాజభవనాల సౌందర్యానికి ముగ్ధుడైన నిజాం ఈ భవనాన్ని రాజస్థానీ, పర్షియన్ వాస్తురీతుల సమ్మేళనంతో నిర్మింపచేశాడు. హైదరాబాద్ నగరవాస్తు నిర్మాణాలలో దీనిని కలికితురాయిగా చెప్పుకుంటారు. ఆ పక్కన పబ్లిక్ గార్డెన్స్ కూడా తెలంగాణ ఘన చరిత్రకు చిహ్నమే. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ కొత్త భవనానికి పునాదిరాయి వేసినా, గుర్తుపట్టరానంతగా పాత భవనం మాదిరిగానే నిర్మించాలని నిర్ణయించారు. ఈ కొత్త భవనం లోపల నేటి అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ భవన ప్రాంగణం నుంచి తమ పాలన సాగాలని ఇక్కడి ప్రజలు కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇటీవలి వార్తల ప్రకారం- అన్ని వసతులు గల కొత్త అసెంబ్లీ భవనాన్ని సీమాంధ్రకు కేటాయిస్తారట. పాత మండలి భవనంలో తెలంగాణ అసెంబ్లీ సర్దుకోవాలట. ఇప్పుడున్న మండలి భవనాన్ని తెలంగాణ రాష్ట్రం వాడుకుంటే సీమాంధ్ర మండలి కోసం కొత్త భవనాన్ని నిర్మించి పెడతారట! ఒకే అసెంబ్లీ భవనాన్ని రెండు రాష్ట్రాలు రొటేషన్ పద్ధతిలో వాడుకోవాలనే మరో ప్రతిపాదన పెడుతున్నారు. ఇదీ మరీ హాస్యాస్పదంగా ఉన్నది. వెనుకటి కాలంలో తెలంగాణలో ఖానిక్‌బడులను కూడా ఇట్లా నడపకపోయేవారు. సచివాలయ భవనాలైతే మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో 1888లో నిర్మించారు. పాతభవనాల స్థానంలో కొత్తవి నిర్మించినప్పటికీ తెలంగాణ మనోభావాలతో ముడిపడిన భవనప్రాంగణమిది. దీనిని అడ్డంగా గోడ లేదా కంచె పెట్టి పంచుతారట! లుంబిని ఉద్యానవనం వైపు ఉన్న అందమైన ప్రవేశ ద్వారాన్ని సీమాంధ్రకు కేటాయిస్తారట.
ఎప్పుడో మూత పడిన పక్కగేటును తెలంగాణ రాష్ట్రం వాడుకోవాలట. ఈ వైపున ఇప్పటికే ఫ్లెఓవర్ నిర్మాణమై ఇరుకిరుకుగా మారింది. ఈ భవనాలలో దాదాపుగా సీమాంధ్రకు అరవై శాతం, తెలంగాణకు నలభై శాతం కేటాయిస్తారట! ఒక సచివాలయమే కాదు, డైరెక్టరేట్లు, కమిషనరేట్లు అన్నీ ఇదే విధంగా విభజనకు గురవుతాయట.
విద్యుత్ సౌధ, జలసౌధ, బీఆర్కె భవన్, మాసాబ్‌టాంక్‌లోని సంక్షేమ భవనం, బషీర్‌బాగ్ పరిశ్రమల భవనం- ఇట్లా అన్ని భవనాలలో దాదాపు అరవై శాతం వసతులు సీమాంధ్ర వారు అల్లుండ్ల లెక్క అనుభవిస్తారట. మిగతా నలభై శాతం తెలంగాణ రాష్ట్రానికి! ఇదంతా చూస్తుంటే అర్థమవుతున్నదేమిటి? సీమాంధ్రవారే సొంత రాజధానిలో ఉన్నట్టు. తెలంగాణవారు పరాయిఇంట్లో ఉన్నట్టు. ఊరికి పోయేవాడిని వదిలి పెట్టి…. ఇంకెటో పోయేటోడికి సద్ది కట్టడం అంటే ఇదేనేమో!
సీమాంధ్రకు చెందిన విజ్ఞులు చెబుతున్న ప్రకారం- అక్కడ రాజధాని నిర్మాణానికి అటూఇటూగా రెండేండ్లు పడుతుంది. స్వాభిమానం గల పౌరులు కొందరు తమ రాష్ట్రంలోనే ఏదో ఒకచోట తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసుకుని జూన్ రెండున తొలి ప్రభుత్వాన్ని అక్కడే ప్రారంభించాలని కోరుతున్నారు. సీమాంధ్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఉండేది తాత్కాలికమే కనుక వారికి తాత్కాలిక వసతులు కల్పిస్తే సరిపోతుంది. వారు కూడా సర్దుకోవలసిందే.
భవనాలన్నీ లెక్క ప్రకారం పంచాలనడానికి ఇదేమీ పాలోళ్ళ పంపకం కాదు. సీమాంధ్ర అసెంబ్లీ, సచివాలయం, ఇతర కార్యాలయాల కోసం ప్రత్యామ్నాయ వసతులు లేక కాదు. చరిత్రాత్మకమైన హైదరాబాద్‌లో వసతులకు కొరత లేదు. గతంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ భవనాన్ని ఉపయోగించుకోవాలనే ప్రతిపాదన వచ్చింది. ఇందులో ఏకంగా అసెంబ్లీ నడుపుకోవచ్చు. సరూర్‌నగర్‌లోని విక్టోరియా హోం కూడా అనువైనదే.
ఆధునిక నిర్మాణాలు కావాలంటే, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం విశాలమైనది, వసతులు గలది. ఇక్కడ భద్రతకు కూడా లోటు లేదు. ఇందులో అసెంబ్లీ మొదలుకొని సీమాంధ్ర కార్యాలయాలన్నీ నడుపుకోవచ్చు. ఇవన్నీ ఉండగా తెలంగాణ రాష్ట్ర వసతులనే ఉపయోగించుకుంటూ పొత్తుల సంసారం చేయాలని చూడడం పాలకుల మనోవికారాన్ని సూచిస్తున్నది.
Courtesy: నమస్తే తెలంగాణ సంపాదకీయం