By జె. ఆర్. జనుంపల్లి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన దేశంలో ఏ రాష్ట్ర విభజన విషయంలో జరగనంత రసా బస జరిగి విభజన చోటు చేసుకొంది. తెలంగాణ వాళ్ళు సంతోషంగా ఉంటె, ఆంధ్ర ప్రజలు చాలా అసంతోషంగా ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ నాయకులు, కొందరు మేధావులు విభజన చాలా అన్యాయంగా, అహేతుకంగా, అశాస్త్రీయంగా జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు.
విభజన జరిగి నాలుగేండ్లు అయినా ఆ అభిప్రాయంలో పెద్ద మార్పు రాలేదు. అసలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే, విభజన అన్యాయమని దానికై భారీ ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి నాలుగేండ్ల తర్వాత కూడా నిరసనల కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అసలు విభజనలో ఉన్న అంత అలవి గాని అన్యాయాలు ఏమున్నాయో ఒకసారి ఒక్కొక్క అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా పరిశీలించి చూద్దాం.
విభజన అన్యాయం: 1956లో భాషా ప్రాతిపదికన జరిగిన విలీనాన్ని తిరిగి విడగొట్టడం అన్యాయం, అక్రమం, రాజ్యాంగ విరుద్ధం. అసెంబ్లీలో మెజారిటీ ఇష్టాన్ని కాదని రాష్ట్ర విభజన చేయడం ఇదే మొదటిసారి అది అప్రజాస్వామికం. పార్లమెంటులో తలుపులు మూసి, మూజువాణి ఓటుతో డివిజన్ లేకుండా విభజించడం చట్టబద్దం కాదు. వగైరా.. వగైరా.
భాషా ప్రాతిపదికన విభజన జరిగినప్పటికీ 14 ఒప్పందాలతో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఏ ఒక్క ఒప్పందమూ అమలు కాలేదు. ఉద్యమం, నిరసనల తర్వాత తిరిగి కొత్త ఒప్పందాలు జరిగినవి. అవి కూడా అమలుకు నోచుకోలేదు. తెలుగు జాతి ఒక్కటని చెప్పి కలిసి మీ తెలుగు వేరు, మీ సంస్కృతి వేరు అని తెలంగాణ వాళ్ళను ఎప్పుడూ ఓ మూరెడు దూరంలో ఉంచారు. మా తెలంగాణ మాకు కావాలంటే, లేదు అంతా సమైక్యాంధ్ర, తెలంగాణ అనకూడదు అన్నారు. మరి అప్పుడు కూడా విభజన కావాలనుకోవడం తప్పా, పాపమా?
అసెంబ్లీలో మెజారిటీ ఇష్టంతోనే విభజన జరగాలంటే, ఆర్టికల్ 3 ఉండవలసిన పనే లేదు. దేశంలో జరిగిన 10 – 15 రాష్ట్ర విభజనలు జరిగేవి కావు. ఇంతకు ముందు విభజన జరిగిన కొన్ని రాష్ట్రాలలో మెజారిటీకి విభజన ఇష్టం లేదు – ఉదాహరణకి మద్రాసు, పంజాబు, బీహారు. 1953లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రసక్తి లేనప్పుడు మొట్ట మొదటి సారిగా మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయింది ఆంధ్రానే. అప్పుడు కూడా మెజారిటీకి ఇష్టం లేదు.
అసెంబ్లీ ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా, ఆ విషయం అసెంబ్లీ ముందుకు వస్తే చాలు అని ఉంది రాజ్యాంగంలో. అయితే అక్కడ కేంద్రం విభజనకు నిర్ణయం తీసుకొన్న తర్వాత మన రాజ్యాంగాన్ని గౌరవించి, హుందాగా అసెంబ్లీలో ఆ నిర్ణయానికి తగ్గట్టు తీర్మానాలు చేశారు. ఇక్కడ ఆ హుందాతనం చూపకపోవడం వల్ల విభజన అన్యాయం అని చెప్పడం సరిఅయింది కాదు.
పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిక్లరేషన్ డిసెంబర్ 9, 2009లో జరిగింది, అంతకుముందే డిసెంబర్ 7న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకొన్నాయి. కానీ డిసెంబర్ 9 పార్లమెంటు డిక్లరేషన్ తర్వాత, తిరిగి ఆంధ్రలో అన్ని పార్టీలు ఆ ప్రకటనను వ్యతిరేకించి నాలుగు సంవత్సరాలకు పైగా ఆ ప్రకటను అమలు చెయ్యకుండా ఆపాయి. ఈ మధ్యన రెండు ప్రాంతాల్లో అనేక కష్ట నష్టాలూ, రాజకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. విభజన జరగడం అనివార్యము అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. అది ఒక గోడ మీద రాత లాగా మారిపోయింది.
ఆ పరిస్థితుల్లో అసెంబ్లీ మెజారిటీని ఉపయోగించి విభజన ఆపుదామనుకోవడం మంచి రాజకీయ యత్నం కాదు. అయినా అసెంబ్లీ ద్వారా ఆ ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో కూడా అనవసరపు వ్యతిరేక తీర్మానం చేసారు. పార్లమెంటులో ఇంచు మించు అన్నిపార్టీలు ముఖ్యమైన కాంగ్రెస్, బిజెపిలతో సహా తెలంగాణ రాష్ట్రానికి సుముఖంగా ఉంటె అక్కడ కూడా హేరా పేరీ చేసి చట్టం కాకుండా చేసే ప్రయత్నం జరిగింది.
పెప్పర్ స్ప్రేలు, పార్లమెంటరీ అధికారులను పని చెయ్యకుండా ఆపే దౌర్జన్య కాండ, గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తే టివి ప్రసారాలు ఆపి పార్లమెంటు ప్రొసిడింగ్స్ కానిచ్చారు. అన్ని సంవత్సరాల ఉద్యమం తర్వాత జరగుతున్న విధిలేని విభజనను ఆ విధంగా ఆపేప్రయత్నం చెయ్యడం ప్రజాస్వామ్యమనిపించుకోదు. పైగా అలాంటి దౌర్జన్య పూరిత అలజడి పార్లమెంటులో సృష్టించడం గర్హనీయం. నిజానికి అక్కడ హుందాగా విభజన ప్రొసీడింగ్స్ పూర్తిచెయ్యడం భాద్యతగల పార్లమెంటేరియన్ల కర్తవ్యం. అదీ చాలదన్నట్లు ఒక రాజకీయ మేధావి ఆ చట్టం పార్లమెంటు ప్రొసీజర్ ప్రకారం జరగలేదని అది చట్టంగా పరిగణించకూడదు అని సుప్రీమ్ కోర్టులో కేసు వేశాడు. అసలు విభజనను వ్యతిరేకించే రాజకీయ నాయకుల మేధావుల ఉద్దేశ్యమేమిటి? ఇష్టంలేని తెలంగాణ ప్రజలు తెలంగాణ అని ఉద్యమిస్తే, లేదు సమైక్యాంధ్ర అని ప్రతి ఉద్యమం చేయడంలో అర్థమేముంది. అసలు తెలంగాణ ప్రజలు ఎందుకు వేరుపడుదాము అని అనుకొంటున్నారు అనే విషయం మీద ఏమైనా చర్చ జరిగిందా? ఏకపక్షంగా మీకు ఇష్టమున్న లేకున్నా మా సమైక్యాంధ్రలో కలిసి ఉండాలి అని దాష్టీకం చెయ్యడం ఎంత వరకు న్యాయము, ప్రజాస్వామ్యము?
చివరకు తెలంగాణ వాళ్లకు 58 ఏండ్ల తర్వాత న్యాయం జరిగితే అది ఆంధ్ర వాళ్లకు అన్యాయం ఎట్లా అవుతుంది? అసలు 1956లో కలవడమే ఒక చారిత్రక తప్పిదం. ఆ తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి కొన్ని అవకాశాలు ఏర్పడినా వాటిని ఉపయోగించుకోలేదు. అది జరిగినా పంజాబు, హరియాణా లాగా రెండు రాష్ట్రాలు బాగుపడేవి. ఆంధ్ర రాజకీయ నాయకులు అప్పుడూ ఇప్పుడు చేస్తున్న రాజకీయ తప్పిదాలకు రాష్ట్ర విభజన అన్యాయము అని సాకు వెదుక్కోవడము, విభజన జరగకుండా ఉంటె బాగుండేది అని ప్రజల్లో తప్పుడు ప్రచారం చెయ్యడం తప్పు.
విభజన జరగకుండా ఉండాలంటే, విభజనకు దారి తీసిన సమస్యల పరిష్కారం గురించి క్రమంగా అలోచించి ఉంటె బాగుండేది. అదేమీ చెయ్యకుండా ప్రతిసారీ రాజకీయం చేసి పబ్బం గడిపే ప్రయత్నం ఇంత వరకు తీసుకొచ్చింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవాలనుకొంటే ఏమి ఉపయోగం?
రాష్ట్ర విభజన అహేతుకం?: ఆంధ్ర రాజకీయ నాయకులు, మేధావులు రాష్ట్ర విభజన సహేతుకం కాదు అని కొన్ని వింత వాదనలు లేవదీశారు. రాజధాని లేకుండా విభజన చేశారు. రాజధాని నగరం ఉన్న ప్రాంతం ఎప్పుడూ విడిపోవాలని కోరుకోలేదు. అన్నీ హైదరాబాదులో కేంద్రీకృతం చేశాము, హైదరాబాదును అభివృద్ధి చేశాము. సైబరాబాదు కట్టాము. హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టాము. రాజధాని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా విభజన చేయడం అహేతుకం అనేవి వారి వాదనలు.
నిజానికి 1953లో మద్రాసు రాష్ట్రంనుండి ఆంధ్ర విడిపోవడం, తొందర పాటు చర్య. భాష పేరు మీద వేరు పడాలని, హైదరాబాదు రాజధాని కావాలని అనుకొని ఉంటె 1956 వరకు ఓపిక పట్టాల్సి ఉండేది. లేదా సరిహద్దు మీద ఉన్న మద్రాసు నగరాన్ని, చండీగఢ్ లాగా ఉమ్మడి రాజధానిగా కోరుకొని ఉండాల్సింది. అవేమీ చెయ్యకుండా మొత్తం మదరాసు నగరం కావాలని పొట్టి శ్రీరాములు గారిని త్యాగం చేసి, అది జరగక కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచుకొన్నారు. తిరిగి విశాలాంధ్ర పేరుతో హైదరాబాదు నగరాన్నిరాజధానిగా ఆశించి 1956లో SRC వద్దన్నా, తెలంగాణ ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా రాజకీయ ఒత్తిడితో తెలంగాణతో కలిసి హైదరాబాదుకు మకాం మార్చారు.
అప్పుడు హైదరాబాదు దేశంలోనే నాలుగవ పెద్ద నగరం. నిజాము హైదరాబాదు సంస్థానాన్ని ఒక రాష్ట్రంలా కాకుండా ఒక దేశం లాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేశారు. చాలాకేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఇష్టంతో నైసర్గికంగా హైదరాబాదు దేశానికి మధ్యలో ఉన్న కారణంగా కేంద్ర నిధులతో ఏర్పాటు చెయ్యబడినవి. హైదరాబాదు నగరంలో ఉన్న అనేక ప్రభుత్వ భూములు, కాస్మోపాలిటన్ కల్చర్, మంచి వాతావరణం అన్నీ తోడ్పడ్డాయి. కొన్ని వైజాగ్ ప్రాంతంలో కూడా నెలకొల్పారు. అంతే కానీ ఆంధ్ర ప్రభుత్వం కావాలని తన నిధులు వెచ్చించి ఆ సంస్థలను అక్కడనే పెట్టాలని చేసిన ప్రయత్నం ఏమీ లేదు.
ఇకపోతే IT ఇండస్ట్రీ, సైబరాబాదు, హైదరాబాదును ప్రపంచపటంలో పెట్టడం అవన్నీ వాస్తవాలు కాదు. IT అభివృద్ధి దేశంలో ఉన్న పెద్ద నగరాల్లో ఎలా జరిగిందో హైదరాబాదులో కూడా అలాగే జరిగింది. బెంగళూరు, మద్రాసు IT లో అప్పుడూ ముందుగానే ఉన్నాయి, ఇప్పటికీ ముందుగానే ఉన్నాయి. మరి ఆ నగరాలు అక్కడి ప్రభుత్వాలు మేమే ఆ నగరాలన్నిటినీ ప్రపంచపటంలో పెట్టామని అక్కడ ఎవరూ చెప్పుకోవడం లేదు. 1937 లోనే టైమ్స్ మ్యాగజైన్ కవర్ పేజీ మీద నిజాం ఫోటో వేసి ప్రపంచంలోనే ధనికుడని పేర్కొన్నారు. హైదరాబాదు నగరం దేశంలోని అన్ని మహానగరాలలాగా అభివృద్ధి చెందింది. నిజానికి 1956 లో బెంగళూరు కంటే ముందు ఉన్న హైదరాబాదు 2014లో దానికంటే వెనుక పడిపోయి ఉంది. అది వాస్తవం.
రాజధాని ఉన్న ప్రాంతం వేరు పడలేదు అన్నది కూడా కరెక్టు కాదు. బొంబాయి రాష్ట్రం 1960లో మహారాష్ట్రీయుల కోరిక మీద విడిపోయింది. బొంబాయి నగరం వాళ్ళ ప్రాంతంలో ఉండటం వలన మహారాష్ట్రీయులకుదక్కింది. గుజరాతీలు గాంధి నగర్ అనే రాజధాని కట్టుకొన్నారు. మేఘాలయ 1972లో గ్రేటర్ అస్సాం రాష్ట్రం నుండి విడిపోయింది. మేఘాలయ ప్రాంతంలో ఉన్న అప్పటి అస్సాం రాజధాని షిల్లాంగ్ మేఘాలయకు దక్కింది, అస్సాం డిస్పూర్ అనే కొత్త రాజధాని కట్టుకొంది. అలాగే మధ్యప్రదేశ్ తన రాజధాని నాగపూర్ నగరాన్ని మహారాష్ట్రకు కోల్పోయి భోపాల్ అనే చిన్న పట్టణాన్ని రాజధానిగా చేసుకొంది.
ఇంతకు ముందు విడిపోయిన రాష్ట్రాలకు రాజధాని నగరాల నిర్మాణానికి కేంద్రం ఆర్థికసహాయం కూడా లేదు ఒక్క చత్తీస్ గఢ్ కు తప్ప. అది కూడా చాల తక్కువ. ఇక్కడ ఈ విభజనలో కేంద్రం రాజధాని నిర్మాణంలో ఆర్ధిక సహాయం చేయబూనుకోవడం హర్షించ దగ్గ విషయం. నిజానికి ఆంధ్ర రాష్ట్రం అదే కర్నూలు రాజధానితో కొనసాగి ఇంకొన్ని సంవత్సరాలు ఓపిక పట్టి ఉంటె కర్నూల్ కూడా భోపాల్, భువనేశ్వర్ నగరాల్లాగా వృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికి బాగా స్థిరపడి మిగతా ఫ్రంట్ లైన్ రాష్ట్రాల సరసన చేరిపోయేది. ఆ చారిత్రక తప్పిదం తప్పి ఇప్పుడు ఈ బాధలు ఉండేవి కాదు.
హైదరాబాదులో పెట్టుబడులు పెట్టి నగరాన్ని అభివృద్ధి చేశాము అని అంటారు ఆంధ్రులు. ఆమాట నిజమే. వాటిలో కొన్ని క్రమైనవి, కొన్నిఅక్రమమైనవి కూడా ఉన్నాయి. అయితే అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ అధీనంలోనే ఉన్నాయి. వాళ్ళే అనుభవిస్తున్నారు. వాటి విలువలు బెంగళూరు, చెన్నై నగరాలలోలాగే పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైనా వాళ్ళు ఆంధ్రకు వెళ్ళదలచుకొంటే వాటిని అమ్ముకొని వాటి విలువలు వాళ్ళు పొందవచ్చు లేదా ఇక్కడే ఉంచుకొని అనుభవించవచ్చు. అందులో పెద్ద సమస్య ఏమీలేదు. అక్కడి రెవెన్యూ ఖర్చుపెట్టి వసతులు పొందినారు కాబట్టి వాటి మీద టాక్సులు కడుతూ ఉంటె అక్కడి సర్వీసులు కూడా పొందుతూనే ఉన్నారు. దానితో తెలంగాణకు చెప్పుకొన్నంత పెద్దగా ప్రత్యేకంగా ఒరిగిందేమీలేదు. అయినా ఆంధ్ర ప్రాంతాల్లో నగరాలను అభివృద్ధి చేసుకోకుండా ఎవరూ ఒద్దనలేదు. వాళ్ళందరూ హైదరాబాదులో పెట్టుబడులు పెడితేనే వాటికీ విలువలు పెరుగుతాయనే అక్కడ పెట్టుబడులు పెట్టారు. ఇప్పటికీ చాలామంది ఆంధ్రులకు హైదరాబాదు వాతావరణాన్ని వదిలిపోవడం ఇష్టంలేదు.
ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంగతి: హైదరాబాదు నగరంలో మొదటి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అది ఒక మెగా సిటీ. కాస్మోపాలిటన్ కల్చర్. ప్రభుత్వ భూములు. అందుకే పరిశ్రమలు, ముఖ్యముగా IT పరిశ్రమలు అక్కడికి రావడానికి ఆసక్తి చూపాయి. దానికి తగ్గట్టు ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచవలసిన అవసరం ఏర్పడింది. అది కొంత వైజాగ్ లో కూడా మనం చూడవచ్చు. అదే విజయవాడ ఇతర పట్టణాల్లో అటువంటి పరిస్థితులు లేవు. అందుకే అంతగా సక్సెస్ కాలేదు. అక్కడ కట్టిన IT parks, మేధా టవర్స్ మొన్నటి వరకు ఖాళీగానే ఉన్నాయి. అవన్నీ అలా ఉండగా మేమే కావాలని హైదరాబాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఆంధ్ర ప్రాంతాలను కాదని పెంచాము అని చెప్పడం కరెక్ట్ కాదు.
మరి పై వాటిలో అంత అహేతుకం ఏముందో, వాటి గురించి అక్కడి ప్రభుత్వ పెద్దలు, మేధావులు మాటి మాటికీ ఎందుకు కలవరిస్తూ ఉండాలో అర్థం కావడం లేదు.
రాష్ట్ర విభజన అశాస్త్రీయం: ఆంధ్ర రాజకీయ నాయకులు, మేధావులు ఆంధ్ర ప్రదేశ్ విభజన శాస్త్రీయంగా జరగలేదంటారు. మరి దాంట్లో శాస్త్రీయత ఏమిటో మనకు అర్థం కావటం లేదు. దానికి వాళ్ళు చెప్పేది, రాజధాని లేదు, రాష్ట్రం రెవెన్యూ డెఫిసిట్ లో ఉంది, చాలా జాతీయ సంస్థలు, రాష్ట్ర సంస్థలు హైదరాబాదు లో ఉండిపోయినాయి. మమ్మల్ని కట్టు గుడ్డలతో పంపించి వేశారు, అని. చాలా కొత్త రాష్ట్రాలు రాజధానులు లేకుండానే విడిపోయినాయి. రాజధాని గురించి ఇది వరకే చర్చించుకొన్నాము.
డెఫిసిట్ బడ్జెట్: డిఫిసిట్ బడ్జెట్ విభజన వల్ల కలుగలేదు. అది 1956 నుండి ఆంధ్ర రాష్ట్రం నుండి వస్తున్న వారసత్వం 1955-56నుండి 1967-68వరకు ఆంధ్ర ప్రాంతం డిఫిసిట్ 53.4కోట్లు, తెలంగాణ మిగులు 63.93 కోట్లు. 2014-15 వరకు ఆంధ్ర వరుసగా డిఫిసిట్, తెలంగాణ ప్రతి సంవత్సరం మిగులు. 2015-16లో ఆంధ్ర 742.48 కోట్లు డిఫిసిట్. తెలంగాణ 61 కోట్లు మిగులు. 1956 నుండి 2014వరకు వరుసగా క్రమం తప్పకుండా తెలంగాణ ప్రాంత మిగులుతో ఆంధ్ర ప్రాంత డిఫిసిట్ బాలన్స్ చెయబడింది. 1956 కంటే ముందు నుండి 2014 వరకు తెలంగాణ తలసరి రెవెన్యూ ఆంధ్ర ప్రాంత తలసరి రెవెన్యూ కంటే 35 -40 % ఎక్కువగా ఉంది అదీకాక 1956 నుండి 2014 వరకు వరుసగా ప్రతి సంవత్సరం ఆంధ్ర రెవెన్యూ ఖర్చు ఆ ప్రాంతం రెవెన్యూ ఆదాయం కంటే ఎక్కువ ఉంది. వరుసగా ప్రతి సంవత్సరం తెలంగాణ రెవెన్యూ 7 నుండి 10% ఆంధ్ర రెవెన్యూ ఖర్చు డెఫిసిట్ పూడ్చడానికి ఉపయోగించినారు. వీటికన్నిటికీ పక్కా లెక్కలు ఆధారాలున్నాయి.
కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఆనవాయితీగా జరిగే మొదటి సంవత్సరం 2014-15కు 7000 కోట్లు డిఫిసిట్ కేంద్రము భరిస్తుంది. 2015-16నుండి 2019-20 వరకు 14వ ఫైనాన్స్ కమిషన్ 22,113 కోట్లు ప్రత్యేక డిఫిసిట్ ఎయిడ్ అవార్డు ఆంధ్ర ప్రదేశ్ కు మంజూరు చేసింది. అటువంటిది ఇది వరకు ఏ రాష్ట్ర విభజనలోనూ ఇవ్వలేదు. అదీకాక కేంద్ర పన్నులడే వాల్యూషన్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కలిపి 2015-16 నుండి 2019-20వరకు తెలంగాణ కంటే ఇంచుమించుగా రెట్టింపు సహాయం కేంద్రం నుండి లభించింది. (AP: 2,44.591cr; TS:1,37.941cr) దాంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2018-19 సంవత్సరానికే 5235 కోట్ల మిగులు బడ్జెట్ ప్రపోజ్ చేసింది. ఇంతకంటే డెఫిషిట్ కు ఏమిచేస్తే శాస్త్రీయమనిపించు కొంటుందో ఆ నాయకులు, మేధావులు చెప్పాలి.
కట్టు గుడ్డలతో పంపించారు: ఇది పూర్తిగా అవాస్తవం. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, దానికి కావలసిన అన్ని వసతులు హైదరాబాదులో కల్పించారు. కొత్త రాజధాని ని సూచించడానికి ఒక కేంద్ర కమిటీని వేశారు, రాజధానిలో ప్రభుత్వ భవన సముదాయాన్ని కట్టు కోవడానికి 3500 కోట్లు సమకూర్చారు. ఇటువంటి సదుపాయం ఏ రాష్ట్ర విభజన లోనూ లేదు. ఇది కాక వెనుక బడిన ఏడు జిల్లాలకు స్పెషల్ ప్యాకేజి. వాటన్నిటినీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సరిగ్గా ఉపయోగించుకోకపోవడం అనేది వారి సమస్య. ఇది కాక వారి రాష్ట్ర రెవెన్యూ వాళ్ళ సొంత రెవెన్యూ, కేంద్ర డివాల్యూషన్, గ్రాంట్స్ కలిపి ఒక లక్ష కోట్ల రెవెన్యూ ఆదాయం వాళ్లకు ఉండనే వుంది. అటువంటప్పుడు కట్టుగుడ్డలతో పంపించారు అనే దాంట్లో అర్థమెక్కడుంది?
అడ్డగోలుగా విభజించారు: ఇది వరకు అన్ని రాష్ట్రాలను విభజించి నట్లుగానే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా నిలువుగా విభజించారు, అడ్డగోలుగా ఏమీ విభజించలేదు. ఈ రాష్ట్ర విభజన చట్టం ముసాయిదా రూపొందించిన వారు ఒక ఆంధ్ర ఆఫీసరు మరియు జయ రామ్ రమేష్ ఆంధ్ర రాజ్యసభ ఎంపి. అన్ని రాష్ట్రాలవిభజన చట్టాల సెక్షన్ల ముసాయిదానే ఇక్కడ కూడా ఉపయోగించారు. కేవలం రాష్ట్రాల పేర్లు, రాష్ట్రాలకు సంభందించిన వివరాలు మాత్రం మారతాయి. ఆస్తులు, అప్పులు పంపకాలు కూడా ఇదివరకు విభజన చట్టాలలోని విధి విధానాలే ఉపయోగించారు. ఈ రాష్ట్ర విభజనకు ప్రత్యేక పద్ధతులు అవలంబించే అవకాశమే లేదు. అవి నచ్చక అవసరమున్నా లేకపోయిన లిటిగేషన్ చేసి విభజన సరిగ్గా జరగలేదు అన్యాయం జరిగింది అడ్డగోలుగా చేశారు అని చెప్పుకోవడం అది వాల్ల రాజకీయం. దాంట్లో ఏమాత్రం నిజం లేదు. చట్టం విషయంలో ఏదైనా పక్ష పాతం జరిగిందంటే అది ఆంధ్రకు జరిగింది కానీ తెలంగాణకు జరగలేదు. రాష్ట్రం వచ్చిందే మహా భాగ్యం అని తెలంగాణ ప్రజలు వాళ్లకు వ్యతిరేకంగా జరిగిన పక్షపాతాన్నిపట్టించుకో లేదు.
ఆంధ్ర ప్రదేశ్ విభజనలో ఇది వరకు ఏ రాష్ట్ర విభజనలో లేని ఈ క్రింది అదనపు రాజకీయ పారితోషికాలు ఆంధ్ర ప్రాంతాన్ని సంతృప్తి పరచడానికి ఇవ్వబడినవి.
1. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని వెసులుబాటు. ఇతర విభజనలలో కనీసం ఒక్క సంవత్సరం కూడా అలాంటి వసతి కల్పించబడలేదు. ఆ వసతి ఆచరణలో పెద్దగా ఉపయోగపడే అవసరం లేకున్నా ఆంధ్ర ప్రాంతాన్ని సంతృప్తి పరచడానికి ఇవ్వబడింది. అది అనవసరం అని ఒక్క సంవత్సరంలోనే తేలిపోయింది. నిజానికి ఆ 10 సంవత్సరాల వ్యవధి ఆంధ్రకు రాజధాని ఏర్పాటు విషయంలో ఆలస్యం కావడానికి దారి తీసింది
2. ఎక్కడా ఏ రాష్ట్ర విభజనలో లేని విధంగా ఒక ఆంధ్రుల రక్షణ అంటూ ఒక సెక్షన్ 8 ఏర్పాటు చేశారు. అది అనవసరమని, రాజ్యాంగ పరంగా ఉపయోగం లేని ప్రోవిసన్ అని ఒక్క సంవత్సర కాలంలోనే తేలిపోయింది
3. రాజధాని ఎన్నికకు ఒక కేంద్ర కమిటీ, రాజధాని ఆర్థిక సహాయం అనేవి కూడా అదనపు ప్రొవిజన్లు. అయితే వాటిని ఉపయోగించు కోవటంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా విఫలమై, ఒక అలవి కాని రాజధాని స్కీములో ఇరుక్కొని కొట్టు మిట్టాడుతున్నది
4. పోలవరం ప్రాజెక్టు: ఏ విభజనలో లేని ఒక బహుళార్ధ సాధక ప్రాజెక్టు, 16,000 కోట్లు అది ఇప్పుడు కాస్తా 60,000 కోట్లు అంటున్నారు ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఎన్నో సమస్యలతో, స్పర్తలతో కొట్టు మిట్టాడుతున్నది. అది ఎప్పుడు ఎట్లా పూర్తవుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. అది కేవలం కేంద్ర కోస్తా రాజకీయ నాయకులకు ఇచ్చిన ఒక రాజకీయ బహుమతిగా లెక్కించుకోవచ్చు. ఇస్తే ఇచ్చారు నీటి వసతి సరిగ్గా లేని రాయలసీమ లేదా ఉత్తరాంధ్ర జిల్లాలకు పనికి వచ్చే అలాంటి ప్రాజెక్టు ఇచ్చిఉంటె బాగుండేది. ఇప్పటికే సాగునీటి వసతి అధికంగా ఉన్న కృష్ణా, గోదావరి డెల్టా జిల్లాలకు ఇవ్వడం ఎంతవరకు శాస్త్రీయమో వాళ్లే ఆలోచించుకోవాలి
5. జాతీయ సంస్థలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు: చట్టంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ కు అనేక జాతీయ సంస్థలు కేంద్రం ఖర్చుతో ఏర్పాటు చేయడం, చాలా ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రాజెక్టులు ఇవ్వడం లేదా ఇచ్చే అవకాశం గురించి స్టడీ చెయ్యడం లాంటివి 13th షెడ్యూలు లో ఈ క్రింద ఇచ్చినట్లుగా పొందుపరచబడినవి. వాటిపై కేంద్రం చాలా వాటిలో శాంక్షన్ కూడా ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే వాటికి భూములు ఏర్పాటు చెయ్యడంలో, మిగతా వసతులు, పనులు చెయ్యడంలో తాత్సారం చేస్తున్నది.
1. APRA – 13 th Schedule
Andhra Pradesh:
Sanctioned:
IIT, NIT, IIM, IISER, CU, PU, AU, IIIT, AIIMS, TU (10)
1. National Institute of disaster management, 2. Duggirajapatnam Port (2)
Examine the feasibility:
1. Steel Plant, Cuddapah
2. Crude oil and Petrochemical Refinery
3. Chennai – Vizag industrial corridor
4. Metro Rail VGTM
5. Metro Rail Vizag
6. Expanding Vizag, Vijayawada and Tirupati airports.
7. A railway Zone
8. Rapid rail and road connectivity from new capital to TS. (8)
10+2+8 =20
Telangana:
Sanctioned: TU and HU (2)
Examine the feasibility:
1. Steel Plant in Khammam
2. NTPC 4000 MW power Plant.
3. Road connectivity in the backward areas of TS
4. Rail Coach factory (4)
2+4=6
ఆంధ్ర ప్రదేశ్ కు ఒక పది జాతీయ విద్యా, వైద్య సంస్థలు, విశ్వ విద్యాలయాలు, రెండు ఇతర జాతీయ సంస్థలు శాంక్షన్ చేయబడినవి. ఒక ఎనిమిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఇచ్చే అవకాశం పరిశీలించడానికి ప్రోవిసన్ కల్పించబడినది. తెలంగాణ రాష్ట్రానికి కేవలం ఒక ట్రైబల్ యూనివర్సిటీ, ఒక హార్టీ కల్చర్ యూనివర్సిటీ, నాలుగు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు పరిశీలించడానికి ప్రోవిసన్ కల్పించబడింది. అదీ ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం కథా కమామీషు క్లుప్తంగా.
మరి దాంట్లో ఆంధ్ర ప్రదేశ్ కు ఎక్కడ అన్యాయం, అహేతుకం, అశాస్త్రీయం జరిగిందో ఒక్కసారి తరచి చూసుకొంటె తెలుస్తుంది. ఆ ఆరోపణలన్నీ 58 ఏండ్ల, నిధులు, నియామకాలు, నీళ్ల వివక్షకు గురైన తెలంగాణ చేసినట్లయితే సరిగ్గా అతికినట్లుండేది. కానీ రాష్ట్రం రావడమే గొప్ప మహద్భాగ్యంగా భావించి, అడిగినా ఎవ్వరూ ఇవ్వని పరిస్థితిలో తమ రాష్ట్రం తమకు వచ్చింది, ఇక నుండైనా తమ రెవెన్యూ తమకు దక్కిందని తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ఏ విభజనలోనూ ఇవ్వని బహుమానాలు ఇచ్చినా, చప్పుడు చెయ్యకుండా ఉన్నారు.
కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, ఇప్పటికీ తమకే అన్యాయం జరిగిందని చెయ్యవలసిన పనులు చెయ్యకుండా ఇంకా ఏవేవో గొంతెమ్మ కోరికలు కోరుతూ, అవసరం లేని వృధా ఖర్చులతో కూడుకొన్న కార్యక్రమాలు. నిరసనలు, రాజకీయ ఉద్యమాలు చేస్తూనే ఉన్నది. కనీసం అక్కడి మేధావులైనా ఇందులోని మంచీ, చెడూ విచారించి అక్కడి ప్రజలకు సరిఅయిన సమాచారం అందజేసి కార్యోన్ముఖుల్ని చేస్తారని ఆశిద్దాము. ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వము, ప్రతి పక్షము కలిసి కనీసం తెలంగాణకు ఆ చట్టంలో కల్పించబడిన మినిమమ్ ప్రోవిసన్స్ పూర్తిగా సాధించే ప్రయత్నాలు చేస్తారని కోరుకొందాం.