BY: కట్టా శేఖర్‌రెడ్డి
తెలంగాణలో ఇవ్వాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, విద్యుత్ కొరత కారణంగానే పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతున్నారని చెబుతున్న టీడీపీ నేతలు, శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఆపేయాలని చెబుతున్న చంద్రబాబును ఒక్క మాట ఎందుకు అనడం లేదు? తెలంగాణ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నది వ్యవసాయం కోసమే కదా? రైతాంగం కోసమే కదా? ఆ మాట చంద్రబాబుకు ఎందుకు చెప్పరు? శ్రీశైలం కొల్లగొట్టబడుతుంటే రాజశేఖర్‌రెడ్డి ముందు చేతులు కట్టుకుని చెంచాగిరి చేసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏమి ముఖం పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు?
ఆక్రమణలను క్రమబద్ధీకరించుకోవడంలో సీమాంధ్ర నాయకత్వానికి ఉన్న తెలివితేటలు అన్నీ ఇన్నీ కాదు. శ్రీశైలం రిజర్వాయర్‌ది ఒక ఆక్రమణ కథ. శ్రీశైలం రిజర్వాయర్‌ను విద్యుదుత్పత్తి కోసం నిర్మించారని అందరికీ తెలుసు. కానీ దానిని క్రమంగా సాగునీటి ప్రాజెక్టుకిందకు మార్చిన విధానం, ఇప్పుడు మాట్లాతున్న తీరు చూస్తే విస్మయం కలుగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రాయలసీమకు తాగునీరు, సాగునీరు ఇచ్చే అంశం ఏనాడూ ఎజెండాలో లేదు. అయితే అది పూర్తయ్యే నాటికి అంత పెద్ద రిజర్వాయర్ నుంచి ఎంతో కొంత ఉపయోగించుకోకపోతే ఎలా అన్న వాదన వచ్చింది. కరువుతో అలమటిస్తున్న రాయలసీమ ప్రాంతానికి 19 టీఎంసీలు, నల్లగొండ జిల్లాకు 30 టీఎంసీలు ఇవ్వాలని 1980లలో ఆలోచన చేశారు.
ఎన్టీఆర్ వచ్చిన తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టులపై తీర్మానం చేశారు. ఇందుకోసం 11000 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడిగట్టు కాలువ(పోతిరెడ్డిపాడు), ఎడమగట్టు కాలువలు నిర్మించాలని తలపెట్టారు. దీనితోపాటు తమిళనాడుకు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు 29 టీఎంసీల తాగు నీరివ్వడంకోసం తెలుగుగంగ కాలువను తవ్వాలని ఆ తర్వాత మరో తీర్మానం చేశారు. తెలుగుగంగ కాలువ ద్వారా తమిళనాడుకు 15 టీఎంసీల నీరు ఇవ్వాలని అందులో 5 టీఎంసీలు ఆంధ్ర నుంచి, మరో ఐదేసి టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్ర వాటాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. కుడిగట్టు కాలువ, తెలుగుగంగ కాలువ అప్పుడే మొదలుపెట్టి 1995 నాటికే పూర్తి చేశారు. ఎడమగట్టు కాలువ అప్పటికీ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆ తర్వాత కేసీ కాలువకు కూడా 10 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు నుంచే ఇవ్వాలని నిర్ణయించారు. కేసీ కాలువకు తుంగభద్ర నుంచి కేటాయించిన నీరు రావడం లేదని, కర్నూలు జిల్లాకు అన్యాయం జరుగుతున్నదని కొట్లాడి దానిని కూడా పోతిరెడ్డిపాడు కాలువకు తగిలించారు. అప్పట్లో పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించుకునే అవకాశం ఉంది. అప్పట్లో ఎన్ని టీఎంసీలు తీసుకున్నా ఎవరూ అభ్యంతరపెట్టలేదు.
ఎడమగట్టు కాలువను ఈనాటికీ పూర్తి చేయని సీమాంధ్ర నాయకత్వం, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుడిగట్టు కాలువ సామర్థ్యాన్ని ఏకంగా మరో 44000 క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయించారు. అందుకు ఆయన చెప్పిన కారణాలు అనేకం. శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వరద వచ్చే రోజులు కేవలం 30 రోజులు మాత్రమేనని, ఆ 30 రోజుల్లోనే తాము గరిష్ఠంగా వరద నీరు తీసుకోవాల్సి ఉంటుందని, అందుకే కుడిగట్టు కాలువ సామర్థ్యాన్ని పెంచుతున్నామని చెప్పారు.
అదే సమయంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ(టన్నెల్)కు మాత్రం 90 రోజుల పాటు వరద నీరు వస్తుందని జీవోలో పేర్కొన్నారు. ఎడమగట్టు కాలువను, అంటే పోతిరెడ్డిపాడును వెడల్పు, లోతు చేసే పనిని, శ్రీశైలం ఎడమకాలువ టన్నెలు పనిని ఒకేసారి మొదలు పెట్టారు. పోతిరెడ్డిపాడు వెడల్పు చేసే పని మూడేళ్లలోనే పూర్తయింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెలు మాత్రం ఇప్పటికీ కుంటి నడక నడుస్తూనే ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి గత దశాబ్దకాలంగా రోజుకు 3 నుంచి 4 టీఎంసీల నీరు ప్రవహిస్తూనే ఉంది. పోతిరెడ్డిపాడును వెడల్పు చేయడమే కాదు, అప్పటిదాకా ఉన్న జీవోలన్నింటినీ తుంగలో తొక్కి ఏకపక్షంగా 107 జీవోను తీసుకొచ్చారు వైఎస్సార్. 1996 జూన్ 15న చంద్రబాబు జారీ చేసిన జీవో ప్రకారం 834 అడుగుల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అధికారం ఉంది. ఈ ప్రాజెక్టు ప్రాథమిక లక్ష్యం విద్యుదుత్పత్తి కాబట్టి ఆరోజు చంద్రబాబు ఆ జీవో తెచ్చారు. కానీ రాజశేఖర్‌రెడ్డి తన కడప, తన కడుపు నిండితే చాలనుకుని 107 జీవో తెచ్చారు. 854 అడుగుల వద్ద కనీస నీటి మట్టం నిర్వహించాలని ఆయన ఆ జీవోలో పేర్కొన్నారు.
అందులో కూడా అత్యవసర సమయాల్లో ప్రభుత్వం కావాలనుకుంటే అందుకు దిగువనున్న నీటిని కూడా ఉపయోగించుకోవచ్చునని మినహాయింపు ఉంది. ఈ జీవో తెచ్చినప్పుడు ఆంధ్ర తెలుగుదేశం నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ జీవో బేసిన్ నియమాలకు విరుద్ధమని చెప్పారు. కడప, నెల్లూరు జిల్లాలకు కృష్ణా బేసిన్‌కు సంబంధం లేదు. ఆ రెండు జిల్లాలు పూర్తిగా పెన్నా బేసిన్‌లో ఉన్నాయి. ఒక నదీ జలాలను, మరో నదీ ప్రాంతానికి తరలించడం న్యాయ విరుద్ధం. ఆంధ్ర, తెలంగాణ నోళ్లు కొట్టడానికే రాజశేఖర్‌రెడ్డి అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోజు అందరూ దుయ్యబట్టారు. రాజశేఖర్‌రెడ్డిని ఎండగట్టండని చంద్రబాబు ఆరోజు పార్టీ యంత్రాంగాన్ని పురమాయించారు. రాజశేఖర్‌రెడ్డి కడప సీఎంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటి ఆంధ్ర నీటిపారుదల మంత్రి దేవినేని ఉమ నాడు తిట్టిపోశారు. రాజశేఖర్‌రెడ్డి నమ్మకద్రోహానికి పాల్పడుతున్నారని కోడెల శివప్రసాద్ ధ్వజమెత్తారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, జీవన్‌రెడ్డి వంటి రాజశేఖర్‌రెడ్డి మనుషులు మాత్రం ఈ జీవోను సమర్థిస్తూ మాట్లాడారు.
కరువు ప్రాంతానికి గుక్కెడు నీళ్లివ్వాలన్న నినాదంతో మొదలయి ఇప్పుడు మొత్తం రిజర్వాయరే మాది అనేదాకా సమస్య వచ్చింది. శ్రీశైలం రిజర్వాయర్‌పై 19 టీఎంసీలు, 11000 క్యూసెక్కుల కాలువ సామర్థ్యంతో మొదలయిన సీమాంధ్ర ఆక్రమణ, నేడు వందకు పైగా టీఎంసీలు, 55000 క్యూసెక్కుల కాలువల సామర్థ్యానికి విస్తరించింది. తెలుగుగంగ పొడవునా ఈ పక్క ఆ పక్క ఉన్న రిజర్వాయర్లన్నీ శ్రీశైలం రిజర్వాయరుతో సంధానించారు. సోమశిల(73.8), కండలేరు(68), వీరబ్రహ్మేంద్రస్వామి(17.7) రిజర్వాయర్ల సామర్థ్యమే వంద టీఎంసీలకు పైగా ఉంటుంది.
ఇంకా ఎడమకాలువకు సంధానించిన వెలిగోడు(17), అవుకు(2), గోరుకల్లు(12.4) రిజర్వాయర్లలో కొన్ని నిర్మాణం పూర్తిచేసుకుని నీటిని నిలువ చేస్తున్నాయి. ఇవి కాకుండా శ్రీశైలం రిజర్వాయరు వెనుక జలాల నుంచి మరో 30 టీఎంసీల నీటిని తీసుకోవడానికి హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తి చేశారు. పాక్షికంగా నీటిని సరఫరా చేస్తున్నారు. అక్టోబరు 25 నీటిపారుదల శాఖ రికార్డుల ప్రకారం ఇంత కరువు సీజనులో కూడా ఈరోజున సోమశిల రిజర్వాయర్‌లో 44.66 టీఎంసీల నీరు ఉంది. కండలేరులో 24.38 టీఎంసీల నీరు ఉంది. వెలిగోడులో 9.78 టీఎంసీల నీరు ఉంది. ఇవి కాకుండా ఈ సీజనులో ఎంత నీరు ఉపయోగించుకున్నారన్న లెక్కలు లేవు. హంద్రీనీవా నుంచి కూడా నీటిని ఉపయోగించుకుంటున్నారు. ఇవేవీ కృష్ణా బేసిన్‌లో లేవు. కాలం బాగా అయిన సంవత్సరాల్లో కృష్ణానది నీరు వందల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. కరువు జిల్లాలు కాబట్టి వరదలు వచ్చినప్పుడు నీటిని తరలించుకోవడం, ఉపయోగించుకోవడం అర్థం చేసుకోవచ్చు. వరద జలాల కోసం, ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన ప్రాజెక్టులకు మిగులు జలాలను కాజేయాలని చూడడం, తమది కాని రిజర్వాయరుపై హక్కులు కోరడం దుర్మార్గం.
శ్రీశైలం కుడిగట్టు కాలువను ఆలోచించిన నాడే ఎడమగట్టు కాలువ గురించి కూడా ప్రతిపాదించారు. కానీ మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా శ్రీశైలం నుంచి ఒక్క టీఎంసీ నీటిని కూడా వినియోగించుకోలేని దుస్థితిలో ఇవ్వాళ తెలంగాణ ఎందుకున్నది?
శ్రీశైలానికి ఎగువన మహబూబ్‌నగర్, దిగువన నల్లగొండ జిల్లాలు కరువుతో, ఫ్లోరైడు సమస్యతో అలమటిస్తుంటే కళ్లుమూసుకుని రాజ్యం చేసిన వాళ్లు ఎవరు? తెలంగాణలో ఇవ్వాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, విద్యుత్ కొరత కారణంగానే పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతున్నారని చెబుతున్న టీడీపీ నేతలు, శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఆపేయాలని చెబుతున్న చంద్రబాబును ఒక్క మాట ఎందుకు అనడం లేదు? తెలంగాణ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నది వ్యవసాయం కోసమే కదా? రైతాంగం కోసమే కదా? ఆ మాట చంద్రబాబుకు ఎందుకు చెప్పరు? శ్రీశైలం కొల్లగొట్టబడుతుంటే రాజశేఖర్‌రెడ్డి ముందు చేతులు కట్టుకుని చెంచాగిరి చేసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏమి ముఖం పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు? రాజశేఖర్‌రెడ్డి జీవో చెల్లదు. అది బేసిన్ నియమాలకు విరుద్ధం. అది ఏకపక్షంగా కడప, నెల్లూరులకోసం తెచ్చిన జీవో. శ్రీశైలం రిజర్వాయరుపై హక్కులకు సంబంధించి సరికొత్త మార్గదర్శక నియమాలను రూపొందించాలి. నీటి వినియోగానికి సంబంధించి బేసిన్ నియమాలకు అనుగుణంగా కొత్త జీవోలు తీసుకురావాలి. అప్పటిదాకా తెలంగాణ రాజీపడవలసిన పనిలేదు. తెలంగాణ పక్షాన న్యాయం ఉంది.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..