సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా సీఎం కేసీఆర్ ను నియమిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956లోని సెక్షన్ 16కింద ఈ జోనల్ కౌన్సిళ్ళు ఏర్పాటు అవుతుండగా, కౌన్సిల్ చైర్మన్ గా కేంద్ర హోంమంత్రులనే రాష్ట్రపతి నియమిస్తారు. తెలంగాణ ఏర్పడిన కొద్ది రోజులకే తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఈ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా నియమించడం విశేషం. ఈ మండలిలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి సభ్య రాష్ట్రాలుగా ఉంటాయి.
కౌన్సిల్ 25వ సమావేశం 2012 నవంబర్ 16న బెంగుళూరులో అప్పటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన జరిగింది. 26వ దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశం కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన త్వరలో హైదరాబాద్ లో జరగనుంది. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి సమస్యలు, విద్యుత్ ఒప్పందాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, నదులు, జాతీయ రహదారులు, తీరప్రాంతాల సమస్యలు, మత్స్యకారుల సమస్యలు, అంతర్ రాష్ట్రాల పోలీసులతోపాటు కేంద్రం కేటాయించే నిధులు, సహకారం విషయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.