ఆదివారం మెదక్ జిల్లా ఎరవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకనుండి మాటలు చెప్పడం ఉండదు.. చేతలే ఉంటాయని, నాలుగున్నరేండ్లలో కరువు భూతాన్ని తరుముదాం అని సీఎం చెప్పారు. గజ్వేల్ కు అధికారులనే తీసుకొచ్చి అభివృద్ధిపై మాట్లాడుతానని చెప్పా.. తీసుకుని వచ్చానని, విద్యుత్ సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గంలో మరో మూడు 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లను మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు.
గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని రోడ్లు పూర్తిగా ధ్వంసం కావడానికి గత పాలకులు నిధులు ఇవ్వకపోవడమే కారణమని, ఇందుకు రూ. 411 కోట్లు కేటాయించామని చెప్పారు. అంతేకాకుండా నియోజకవర్గ పరిధిలో సమస్యల పరిష్కారానికి పవర్ డే పెట్టుకోవాలని, ఆరోజు జిల్లా స్థాయి విద్యుత్ అధికారులంతా అన్ని గ్రామాలకు వెళ్లి వేలాడుతున్న విద్యుత్ తీగలను, వంగిన స్థంబాలను సరిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ఉద్యమరూపంలో జరగాలని, ఆరోజు తాను కూడా వస్తానని, ఏదైనా ఒక ఊరిలో వంగిన విద్యుత్ స్థంబాన్ని సరిచేస్తానని కేసీఆర్ అన్నారు.
ఇకపై రైతుల జాతకాలే మారతాయని, మిషన్ కాకతీయలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులను పునరుద్ధరించి తెలంగాణలో కరువు భూతాన్ని తరిమేద్దామని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని సీఎం పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి పనులకోసం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తన ఎంపీ కోటా నుండి రూ, 2 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి కూడా తన ఎమ్మెల్సీ కోటా నుండి రూ. 50 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.