mt_logo

సోషల్ మీడియా ఉద్యమం!

By: Manohar Chimmani

2004 లో, సరిగ్గా పదేళ్ల క్రితం ఫేస్‌బుక్‌ను రూపొందిస్తున్నప్పుడు, మార్క్ జుకెర్‌బర్గ్ దాని సక్సెస్‌ను బహుశా ఈ రేంజ్‌లో ఊహించి ఉండడు.

ఆ తర్వాత కేవలం మూడంటే మూడేళ్లలో, 2007 లో, జుకెర్‌బర్గ్ ను ఒక బిలియనేర్‌ను చేసింది ఫేస్‌బుక్ సక్సెస్. అప్పుడు అతని వయసు 23 సంవత్సరాలు!

ఒక మిలియన్ యుఎస్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇప్పుడు సుమారు 6 కోట్లు. అలాంటి మిలియన్లు 1000 సంపాదించినవాడు బిలియనేర్‌. ఇక లెక్క మీరే వేసుకోండి ..

డబ్బు విషయం అలా వదిలేద్దాం.

కట్ టూ మన ఉద్యమం –

ఫేస్‌బుక్‌ను క్రియేట్ చేస్తున్నప్పుడు – నిజంగా అది ఏ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లోకి, వారి జీవితాల్లోకి చొచ్చుకుపోగలిగి, ఎలాంటి అద్భుత ఫలితాలు రావడానికి కారణమవుతుందో కూడా ఆనాడు ఊహించి ఉండడు జుకెర్‌బర్గ్.

దీనికి ది బెస్ట్ ఉదాహరణ తెలంగాణ ఉద్యమమే!

బహుశా, ఫేస్‌బుక్ వెలుగులోకి వచ్చిన 2004 సంవత్సరం నుంచి ఇప్పటివరకూ, ప్రపంచంలో ఏ ఇతర రాజకీయ ఉద్యమమూ దాన్ని ఈ స్థాయిలో ఉపయోగించుకొని ఉండదు.

ఫోటోలు, కొటేషన్లు, ఉత్తుత్తి లైక్‌లు, కామెంట్‌లకే కాదు.. న్యాయపరమైన హక్కులకోసం పోరాడే ఉద్యమ విజయాలకు కూడా ఫేస్‌బుక్ ఉపయోగపడగలదన్నదానికి తెలంగాణ ఉద్యమమే ఓ పెద్ద ఉదాహరణ.

ఈ ఒక్క టాపిక్ మీదే, అప్పుడే .. పొలిటికల్ సైన్స్, సోషియాలజీ వంటి సబ్జెక్టుల్లో ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీ స్థాయిలో పరిశోధనలు ప్రారంభమయ్యాయంటే దీని ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.

లక్షలాదిమంది తెలంగాణ ఫేస్‌బుక్ యూజర్‌లు ఉద్యమం కోసం పోస్ట్ చెయ్యని రోజు లేదు! ఎవరి టైమ్‌లైన్ చూసినా తెలంగాణకు సంబంధించిన పోస్టులు, షేరింగ్‌లే! ఎవరు రోజుకు ఎన్ని లైక్‌లు చేసినా .. అందులో కనీసం ఒక్కటయినా తెలంగాణకు, ఉద్యమానికి సంబంధించిందే!

అంతేనా?!

ఎన్ని వందల ఫేస్‌బుక్ పేజ్‌లు .. ఎన్ని వందల ఫేస్‌బుక్ గ్రూప్‌లు .. అన్నీ తెలంగాణ ఉద్యమాన్ని ప్రమోట్ చేసేవే!

ఇవన్నీ చేయడానికి ఏ రాజకీయ పార్టీనో, ఏ రాజకీయ నాయకుడో, ఏ తెలంగాణ ధనవంతుడో, ఏ దాతనో .. లక్షలు, కోట్లు కుమ్మరించలేదు. ఎవరూ ఇలాచేయండని “ఫేస్‌బుక్ మార్కెటింగ్” టెక్నిక్స్ వారికి చెప్పలేదు. అన్నీ తెలంగాణ ప్రజలు ఎవరికివారే స్వచ్చందంగా చేశారు. అన్ని మెలకువలూ వాటికవే వచ్చాయి.

దీనంతటి ప్రభావం తెలంగాణ ఉద్యమం పైన, ఇటీవలి ఎన్నికల పైనా చాలా ఉంది.

మార్క్ జుకెర్‌బర్గే స్వయంగా ఆశ్చర్యపోయే స్థాయిలో .. అసలు ఇంత సహజంగా, ఇదంతా ఎలా సాధ్యమైంది?

దీనికి సమాధానం – ఒక్కటే పదం.

తెలంగాణ!

తెలంగాణ కోసం ఉద్యమించిన వందలాది నాయకులు, వేలాది సంఘాలు, కోట్లాది ప్రజలు ..

వీళ్లందరిలో అగ్గి రగిల్చి, దాన్ని ఆరిపోకుండా జ్వలింపజేసి, తన జీవితాన్నే ఫణంగా పెట్టి .. ఉద్యమాన్ని ఉరకలెత్తించిన ఒక వ్యక్తి కూడా ఉన్నారు.

ఆ వ్యక్తి, ఉద్యమ శక్తి ..

కేసీఆర్!

ఓకే. తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇంతటితో ఫేస్‌బుక్ పని అయిపోయినట్టేనా? సోషల్ మీడియా పని అయిపోయినట్టేనా?

కానే కాదు. అసలు ఉద్యమం ముందుంది.

అది .. ప్రతి తెలంగాణ బిడ్డ కోరుకొంటున్న, కేసీఆర్ కలగన్న ‘బంగారు తెలంగాణ’ సాధన.

దీనికోసం కూడా కోట్లాది తెలంగాణ ఫేస్‌బుక్ యూజర్‌లు, ట్విట్టర్ యూజర్‌లు, బ్లాగర్‌లు, వందలాది ఎఫ్ బి పేజ్‌లు, గ్రూప్‌లు .. ఎవరి స్థాయిలో వాళ్లు రెట్టించిన ఉత్సాహంతో కృషి చేస్తున్నారు.

అంతకుముందు ఎన్నడూ లేనివిధంగా – మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు, వారు వీరు అనిలేకుండా .. అంతా కూడా .. ఇప్పుడు సోషల్ మీడియా దుమ్ముదులిపేస్తున్నారు.

జుకెర్‌బర్గ్ ఊహించని సోషల్ మీడియాని అతనికి చూపిస్తున్నారు.

ఎంపి కల్వకుంట్ల కవిత, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు, ఐటి మినిస్టర్ కేటీఆర్ ల యాక్టివ్ ట్వీట్స్ గురించి కూడా ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సిన అవసరముంది. ప్రభుత్వం చేస్తున్న పనులగురించి, తీసుకొంటున్న నిర్ణయాల గురించి, ఇతర ఎన్నో యాక్టివిటీస్ గురించి ఎప్పటికప్పుడు ట్వీట్స్ రూపంలో వీరు పెడుతున్న అప్‌డేట్స్, ఫోటోలు ప్రధానంగా యువతను, మొత్తంగా తెలంగాణ నెటిజెన్స్‌ను బాగా ఉత్సాహపరుస్తున్నాయి.

అలాగే – డిప్యూటి సీఎం, హెల్త్ మినిస్టర్ రాజయ్య, హోమ్ మినిస్టర్ నాయని నరసింహరెడ్డి, ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజెందర్, వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖ.. దాదాపు ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఫేస్‌బుక్ ను, ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్నారంటే సోషల్ మీడియా పవర్‌ని అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవలే ఈ వైపు కూడా ఎంటరయి .. సీఎంవో, పోలీస్ శాఖలతో ప్రారంభించి, దాదాపు అన్ని శాఖల సమాచారంతో సోషల్ మీడియాలో పిచ్చి స్పీడ్‌తో ముందుకు దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే, ఈ బ్లాగ్ రాస్తున్న సమయానికి – తెలంగాణ సీఎంవో పేజ్‌కి 70,460 లైక్స్, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) పేజ్‌కి 90,222 లైక్స్ ఉన్నాయి. ఈ అంకె త్వరలోనే లక్ష దాటుతుంది. మిలియన్‌ను కూడా చేరుకుంటుంది. కోటిని తాకినా ఆశ్చర్యం లేదు.

సోషల్ మీడియా అంటే ఏదో టైమ్‌పాస్‌కు పోస్ట్ చేసే ఉత్తుత్తి ఫోటోలు, కొటేషన్లు, లైక్‌లు, కామెంట్లు మాత్రమే కాదు. ఉపయోగిస్తే అదొక ఉద్యమం కూడా!

Source: Nagnachitram.blogspot.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *