కేసీఆర్ పాలనలో మాజీ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ హయాంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం) సత్ఫలితాలనిస్తుంది.
2020లో హైదరాబాద్‌లో వరదలు వచ్చిన నేపథ్యంలో భారీ వర్షాల సమయంలో లోతట్టు ప్రాంతాలను సురక్షితంగా ఉంచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలాల అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఏండ్లగా అస్తవ్యస్తంగా ఉన్న నాలాలతో నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా.. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. ఇండ్లలోకి వరద నీరు ముంచెత్తేది. ఇక భారీ వర్షాలు పడ్డాయంటే.. ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉండేవి. ఈ దుస్థితికి కారణం వరద ప్రవాహ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే.
కానీ.. గత ఏడాది, ఈ ఏడాది హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసినా.. అలాంటి పరిస్థితి ఎక్కడా ఏర్పడలేదు. ఎస్‌ఎన్‌డీపీ చాలా ప్రాంతాల్లో వరద కష్టాలను శాశ్వతంగా తీర్చింది.
నగరవ్యాప్తంగా చేపట్టిన 36 నాలాల అభివృద్ధి పనుల్లో గత ఏడాదే 30 పనులు పూర్తయ్యాయి. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పథకం కింద కొత్త నాలాల నిర్మాణం, పాత నాలాల పునరుద్ధరణ పనులతో అనేక చోట్ల ముంపు బాధలు తప్పాయి.
ఎస్‌ఎన్‌డీపీ పనులు చేపట్టిన ప్రాంతాల్లో గత ఏడాది ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినా.. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలువలేదు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి కనిపించింది.
గత 2-3 రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నా.. ఎక్కడా కూడా లోతట్టు ప్రాంతాలు నీట మునగలేదు.. వరద నీరు నిలవలేదు. పునరుద్ధరించబడిన నాలాల వల్ల వాన ఆగిన కొద్దిసేపటికే కాలనీలు, రోడ్లు శుభ్రమయ్యాయి.
ఇవన్నీ మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ అభివృద్ధి ఫలాలే.