By: Purushottam Chanda
మూన్నెల్ల పరీక్షలు అయిపొయినయి. అట్టలకు దేవుడి ఫోటోలు పెట్టి అగర్బత్తి ముట్టించి బానేరాసినాం. పరీక్షలు కాంగానె ఇంటిపక్కన లక్ష్మక్క గొబ్బెమ్మలు పేర్సుడు షురు చేసేది. పొద్దుగల్ల పెండ దాషిపెట్టి 4 కాంగానె ఇంత పెండ తీసుకొని చిన్న ముద్దలుచేసి, పూలుపెట్టి గొబ్బెమ్మలు తయరుచేసి ఆడోల్లందరూ బతుకమ్మ ఆడెటోల్లు. అందరిసూపులు మాత్రం గొబ్బెమ్మ పక్కన పుట్నాలపప్పు శక్కరి మీద ఉంటుండె. ఇగ పాటలు కాంగనె గొబ్బెమ్మలు తీసి గోడకు కొట్టి ప్రసాదం తింటుండె. ఒక వారం అయినంక ఇగ పెత్తర అమాస కాంగానె ఆ రోజు అసలు బతుకమ్మ సురు అయితుండె.
ఇగ సూడు ఊరు ఊరంత లొల్లే. పొద్దున్నె గునక పువ్వు, తంగెడు పువ్వు, గడ్డి పువ్వు తెచ్చి బతుకమ్మ తయారు చేసెటోల్లు. మా ఇంటిపక్కన గౌన్లోల్లు, శాలోల్లు, బల్జోల్లు, మా కోమటోల్లు, పటేండ్లు అందరు కలిసి బతుకమ్మ పేర్షి అన్మాల్ల గుడికాడ, బాల్రెడ్డి ఇంటివాకిట్ల బతుకమ్మ ఆడెటోల్లు. ఇగసూడు పోటీ సురు అయ్యేది. మా పెద్దమ్మ ఒక పాట పాడితే ఇంకోల్లు రెండు పాడెటోల్లు. మా అమ్మ కూడ అందుకునేది. ఎవరన్న పాడకపోతె, సక్కగ ఆడకపోతె పెద్దోల్లు తిట్టెటోల్లు. గాల్లు గాడ ఆడుతుంటె మేము గుడి ముంగట లాగులు ఏసుకుని ఆడుకొనెటోల్లం. ఆడుడు కాంగనె అందరు బతుకమ్మ నెత్తిమీద పెట్టుకొని శివుని గుడికిపోయి సెరువుల ఏసెటోల్లు. ఇగ ఇప్పుడు అసలు కత సురూ అయితది. అందరు బాక్సులల్ల టిఫిన్లు, కొండి సెంబుల నీల్లు తెచ్చుకొనెటోల్లం. ఇగ ఒకరి టిఫిన్లు ఇంకొకరు పంచుకుని ఫుల్లుగా తినెటోల్లం. ఇట్ల ఒక 10 రకాలు పూరీలూ, బజ్జీలూ, వడలు రకరకాలు కుమ్మి ఇంటికి పోయెటోల్లం.
రాజుగాడు, ఎంకటిగాడు గిట్ల పోరగాల్లందరు ఈ 10 రోజులు హల్చల్ చేసెటోల్లం. పెద్దగయిన కొద్ది బతుకమ్మలు తక్కువయి ఆడెటోల్లు తక్కువయిండ్రు. అదొక నామోషీ అయింది. వంద మంది పదిమంది అయిండ్రు. ఇప్పుడు ఎంత అయిందో కనుక్కోవాలె.
బతుకమ్మ కాంగనె ఒక్కరోజు బతుకమ్మ అలగనీకి పోతుండె. ఇగ తెల్లారి సద్దుల బతుకమ్మ. ఒక రోజు ముందుగాల రాజుగాడు, ఎంకటిగాడు, నేను అడ్విలకి పోతుండె. కొడ్వలి తీసుకొని అడ్విల గునక పువ్వు, గడ్డిపువ్వు కోసుకుని వస్తుండె. ఆకలయితదని సోగిఅన్నము(మామిడికాయ అన్నము) తీసుకపోతుండె. ఇగ సద్దుల బతుకమ్మ రోజు అసలు పోటీ ఉంటుండె. తంగేడు పువ్వు ఆ రోజే తెంపాల్నాయె. ఒక్కొక్కడు మబ్బుల 3, 4 కిలేశి ఊరవతల ఇస్కుల్కాడ, చింతల సెరువు దగ్గర పోతూండె. అదెందో తంగేడు పువ్వుకు రాజుగాడు పిలవకపోతుండె ఆడికితక్కువైతదని. దొరికింది తీసుకొని ఇంటికొచ్చి తానం చేసి అమ్మ చేసిన సద్దులు తింటుండె.
అమ్మ పులుసు సద్ది, పుట్నాల పప్పు పొడిసద్ది, కొబ్బరిసద్ది, గసాల సద్ది, పెరుగు సద్ది చేస్తుండె. తింటుంటె ఆహ సర్గం కనిపిస్తుండె. ఇంటిపక్క అందరికి కూడ పంచుతుండె. తినుడు కాంగనె బతుకమ్మ పేర్చుడు మొదలు పెడ్తుండె.
దూకండ్లా 2,3 రకాల కలర్లు తెచ్చినీల్లు కలిపి గునకపువ్వు, గడ్డిపువ్వు అద్ది 3, 4 రకాలు చేస్తుండె. అన్నితయారు చేసి పాత తంబాలంల పెద్దగ వర్స పేర్సుతుండె. అట్ల తయారు అయినంక పక్కన మంజక్కఇంట్ల, రాజుగాని ఇంట్ల బతుకమ్మ ఎంత ఎత్తుందోసూస్తొండె. మంజక్కింట్ల బతుకమ్మ మా ఆడకట్టులనె ఎత్తు ఉంటుండె. నాలుగు కాంగనె అమ్మ గోధుమ రొట్టెలు చేసి పిస్కి శక్కరికలిపి మల్లీ దాన్ని ముద్దలు చేసి బతుకమ్మకి నైవేద్యం సూపుతుండె. ఇంట్ల ఒక రెండు సుట్లు తిరిగి డప్పులోల్లు రాంగనె అన్మాల్ల గుడికాడికి తీసుకపోతుండె.
ఆడ ఊర్ల ఉన్నోల్లందరు వచ్చిఆడుతుండె. జర సీకటి కాంగనే నాయిన మాట్లాడిన మనిషి వచ్చి దాన్ని సింతల సెరువు దగ్గరికి తీసుకపోయి ఆడ వదుల్తుండె. ఇంటికొచ్చి పొద్దున మిగిలిన సద్దితిని పడుకుంటుండె. తెల్లార్తె దసరా. అమ్మ పొద్దున్నే లేపి రాత్రి పాలతో చేసిన కోవ తొగరిజలు, ఆలుగడ్డ బిర్యాని, మిరపకాయ బజ్జీలు చేస్తుండె. ఫుల్ తిన్నంక మూడు కాంగనె కుట్టిచ్చిన కొత్త బట్టలేసుకునిపాల పిట్ట సూడనికి రాగట్ల బాయికాడికి పొయ్యి, సూడంగనె 2, 3 వరి పీక్కొచ్చి ఇంట్ల దేవునిముంగట పెట్టి మొక్కుతుండె.
ఆరు అయినంక డప్పులోల్లు రాంగనె అన్మల్ల కాడికి అందరు పోతుండె. ఆడ జెండ ఎగిరేసి ఇస్కుల్కాడ జమ్మిసెట్టుకు పూజ కాంగానె అందరు కాలిచ్చుకుంటుండె. అందరు మస్తు కుషి అయితుండె. ఇంటికి వచ్చినంక నాయన, అమ్మను అందరు కలవనీకి వస్తుండె. అమ్మ వాల్లకి గరిజలు, బజ్జీలు పెడుతుండె. మేము కూడ అందరి ఇంటికి కలవనీకి పోతుండె. అంత అయినంక ఇంటికొచ్చి దీపవళి గురించి ఆలోచిస్తూ పడుకొనెవాల్లం. దాంతో సెలవులు, బతుకమ్మ, దసరా సంగతి ఖతం.
తెలంగాణ అమ్మలకి, అక్కలకి, చెండ్లల్లకి బతుకమ్మ, సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.
అన్నలకి, తమ్ముండ్లకు దసరా శుభాకాంక్షలు