mt_logo

సింగరేణిలో 5,472 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు

సింగరేణి సంస్థలో ఒకేసారి 5,472 పోస్టులు భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. 2,164 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 10వ తేదీన తొలి నోటిఫికేషన్ జారీ కానుంది. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, మైనింగ్ విభాగాలకు సంబంధించిన 1,127 పోస్టులకు డిగ్రీ, డిప్లొమా విద్యార్హతలుగా నిర్ణయించారు. వీటితోపాటు మార్చి 3 వ తేదీన ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, జూనియర్ అసిస్టెంట్స్, మైన్ సర్వేయర్ తదితర విభాగాలకు సంబంధించి 771 పోస్టులకు రెండవ నోటిఫికేషన్ వెలువడనుంది. అంతేకాకుండా మార్చి 31న పారామెడికల్, ఇతర సాంకేతిక సిబ్బందికి సంబంధించి 266 పోస్టులకు మూడవ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

ఎన్నో పోరాటాల అనంతరం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సింగరేణి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. సీమాంధ్ర పాలనలో నిరాదరణకు గురైన సింగరేణి సంస్థను వ్యాపార, వాణిజ్య రంగాల్లో ముందు నిలిపేందుకు కొత్తగా మరో 17 గనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర తొలి సంవత్సర సంబురాలనాటికి సింగరేణిలో కొలువుల జాతర పూర్తి చేయాలన్న సంకల్పంలో సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ఉన్నారు.

ఇవే కాకుండా 2004 సంవత్సరం నుండి సింగరేణిలో డిపెండెంట్లు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై గతంలో సీఎం కేసీఆర్ సమీక్షలు జరిపి డిపెండెంట్లకు వెంటనే ఉద్యోగావకాశాలు కల్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2004 నుండి ఉన్న డిపెండెంట్ల జాబితాను సిద్ధం చేసి వీరిలో 753 మందికి ఇప్పటికే సింగరేణి యాజమాన్యం ఉద్యోగావకాశాలు కల్పించింది. మిగతా 1,991 మంది డిపెండెంట్లకు వచ్చే ఆగస్టు కల్లా ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతోపాటు ఇప్పటివరకు సింగరేణిలో పదోన్నతులకు నోచుకోని 564 మంది ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు కల్పించనున్నారు. వీరికి పదోన్నతులు కల్పించడం ద్వారా ఖాళీ అయిన పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయనున్నారని తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *