mt_logo

ప్రతిపక్షమా? పరాయిపక్షమా?

By: కట్టా శేఖర్‌రెడ్డి

శ్రీరాంసాగర్ వరద కాలువ వల్ల కరీంనగర్‌కు మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఏ ప్రాజెక్టు నుంచయినా మొదటవచ్చే ప్రాంతాలకు నీరివ్వకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం సాధ్యమయ్యే పనేనా? పైగా ఇన్ని ప్రాజెక్టుల పనులు ఒక్కసారిగా జిల్లాలో ప్రారంభిస్తే జిల్లా నుంచి జనం వలసపోవలసిన అవసరం ఉంటుందా? కొంచెం విచక్షణతో ఎందుకు ఆలోచించడం లేదు? ప్రతిపక్షం నోరుమూసుకోవాలని కాదు. ప్రతిపక్షం మాటకు విలువ ఉండాలి.

రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ ఆగమైపోతుంది. కంపెనీలు తరలిపోతాయి. వ్యాపారాలు ఆగిపోతాయి. అభివృద్ధి ఆగిపోతుంది. రియల్ ఎస్టేటు కుంగిపోతుంది. వసూళ్లు దందాలు పెరిగిపోతాయి. అంతా అస్థవ్యస్థమవుతుంది.. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి, కేసీఆర్ నాయకత్వంలోని ఉద్యమాన్ని బద్నాం చేయడానికి ఆంధ్ర ఆధిపత్యశక్తులు, మీడియా చేసిన ప్రచారాలు ఇవన్నీ. కానీ ఏం జరిగింది? ఆరు మాసాలు తిరగకుండానే అదంతా ఒక బూటకపు ప్రచారమని తేలిపోయింది. వారు కల్పించిన భయాలు, ఆందోళనలు, అయోమయాలనుంచి హైదరాబాద్‌ను అత్యంత విజయవంతంగా విముక్తి చేశారు కేసీఆర్. హైదరాబాద్ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసేందుకు, హైదరాబాద్‌పై మసకబారిన విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు.

అయినా హైదరాబాద్ అన్యాక్రాంతం అవుతుంటే ప్రత్యక్షసాక్షులుగా ఉన్నవాళ్లు, హైదరాబాద్‌లో ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మినవాళ్లు, పోటీలు పడి ప్రభుత్వ భూములు, గురుకుల ట్రస్టు భూములు, భూదాన భూములు, అసైనుమెంటు భూములను ఎకరాలకు ఎకరాలు కబ్జాలు చేసినవాళ్లు, గత ముప్పైయ్యేళ్లుగా హైదరాబాద్‌లో జరిగిన సకల పాపాలకు బాధ్యత వహించవలసిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు… కేసీఆర్ ఇప్పుడేదో అమ్మేస్తున్నారని మాట్లాడుతుంటే వెగటు పుడుతున్నది.

ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో భూముల పరిశీలనకు వెళితే, ఆకాశంలో తిరుగుడు కాదు, నేలపైకి దిగి చూడు అన్నారు. మురికివాడలకు వెళ్లి గల్లీ గల్లీ, ఇల్లిల్లు తిరిగి ప్రజల గోస చూస్తుంటే, నువ్వేమైనా కార్పొరేటరువా అక్కడేం పని అని వాగారు కొందరు టీడీపీ నాయకులు. సమైక్య రాష్ట్రంలో నెలకు 69 కోట్లు ఇచ్చిన పించన్ల మొత్తాన్ని 317 కోట్లకు పెంచి ఇస్తుంటే, పేదల ఉసురుపోసుకుంటున్నారంటాడు పొన్నాల లక్ష్మయ్య. కాంగ్రెస్ ఏలుబడిలో పేదలకు రేషను దుకాణాల ద్వారా నెలకు 90 కోట్ల సబ్సిడీతో కేవలం లక్షా 39 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తే, ఇప్పుడు 235 కోట్ల సబ్సిడీని భరిస్తూ లక్షా 83 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంటే కార్డులు తగ్గించారని కాకిగోల చేస్తున్నారు మరికొందరు నాయకులు.

హైదరాబాద్ గురించి మాట్లాడితే పల్లెలను వదిలేస్తారా అని మాట్లాడతారొకాయన. ప్రాజెక్టుల గురించి మాట్లాడితే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అని రాగాలు తీస్తారొకరు. కేసీఆర్‌కు కూత పడిపోయిందని చెబుతాడు ఈ రాష్ట్ర ప్రతిపక్షనాయకుడు. అసలు వీళ్లకు ఏం కావాలో, ఏం చేయాలో పాలుపోతున్నట్టు లేదు. తెలంగాణ ఏర్పడి, మన ప్రభుత్వం మనకు వచ్చి, ఇంకా ఇల్లు సర్దుకునే పరిస్థితుల్లోనే ఉన్నా అనతికాలంలోనే అనేక రంగాల్లో అసంఖ్యాక మౌలిక మార్పులకు శ్రీకారం చుట్టినా, ప్రతిపక్ష నాయకులు ఇంతగా ఎందుకు బేజారవుతున్నారో, ఇంత నేలబారుగా ఎందుకు కూతపెడుతున్నారో జనానికి అర్థం కాకపోదు.

ఇప్పుడేమీ ఎన్నికలు లేవు, ఇంతగా దుమ్మెత్తిపోసుకోవడానికి. తెలంగాణ స్వరాష్ట్రంగా విజయం సాధించడం కంటే విఫలం కావాలని కోరుకుంటున్నట్టుగా ఉంటున్నాయి వీరి మాటలు, వీరి ప్రవర్తన. చెప్పులోన రాయి, చెవిలో జోరీగ లాగా ఉంది వీరి పరిస్థితి. బాధ్యతాయుతమైన, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షపాత్రను పోషించడానికి బదులు, అక్కసు, అసహనం, విద్వేషం, దిక్కుతోచని మనస్తత్వంతో విధ్వంసకర వివాదాలకు దిగుతున్నారు. కిరాయినేతల పరాయి భజన అని తెలంగాణ తెలుగుదేశం నాయకుల గురించి ఒక విశ్లేషకుడు చేసిన వర్ణన అక్షరాలా నిజమనిపిస్తున్నది.

అదే విశ్లేషకుడు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ వంటి కాంగ్రెస్ నాయకుల గురించి చెల్లని కాసుల చిల్లర గోల అని దెప్పిపొడిచారు. బయటివాళ్లు అనడం కాదు వాళ్లలో వాళ్లు కూడా అనుకునే దుస్థితి ఇంకా పోలేదు. పొన్నాలను ఒకాయన కాఫీల ఉద్యమకారుడు అంటే మర్రి శశిధర్‌రెడ్డిని ఏకంగా ఒక డిజాస్టర్ అని అన్నారు మరో నాయకుడు. రాష్ట్రం వచ్చిన ఏడెనిమిది మాసాల్లోనే ఇంతలా అనిపించుకోవల్సిన అవసరం ఉందా? ప్రతిపక్ష పార్టీలు కొంతకాలమయినా హుందాగా వ్యవహరించలేవా?

చేతలు మొదలయిన తర్వాత కూతలతో పనిలేదు. నిజంగానే కేసీఆర్ కూత పడిపోయిందా? ప్రతిపక్షనాయకుడు జానారెడ్డికి వినిపించడం, కనిపించడంలో ఏమైనా సమస్యలున్నాయా? ఏమిటి సమస్య? సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశానని అడిగినా అడగకపోయినా పదేపదే చెప్పుకునే జానారెడ్డి, నల్లగొండ జిల్లాకు తెచ్చిన గొప్ప ప్రభుత్వ ప్రాజెక్టు ఒక్కటి చెప్పగలరా? తెలంగాణ ఉద్యమాన్ని వెన్నుపోటు పొడవడానికి మీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 11 మంది టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు కూడా మీరు పెద్ద మంత్రి పదవిలోనే ఉన్నారన్న విషయం మరచిపోయారా? అత్యంత విలువైన గాంధీ వైద్య కళాశాల స్థలాన్ని ఎవడో తలకుమాసిన వ్యాపారికి కట్టబెడుతుంటే తమరు మంత్రివర్గంలోనే ఉన్నారు కదా?

కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఎన్ని బాణాలు వేసినా అవన్నీ తిరిగి వచ్చి వారికే తగులుతాయని ఇంకా ఎందుకు అర్థంకావడం లేదు? ఏడెనిమిది నెలల్లో అద్భుతాలు జరుగవు. కానీ కేసీఆర్ ఊహించిన దానికంటే వేగంగా అడుగులు వేస్తున్నారు. అద్భుతాల ఆవిష్కరణకు అవసరమైన పునాదులు వేస్తున్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ అత్యంత ప్రాధాన్యాలుగా ఎంచుకుని ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. సాగునీరు ప్రాజెక్టులను పూర్తిచేయడం, చెరువుల పునరుద్ధరణ ఏకకాలంలో జరుగడానికి అవసరమైన బడ్జెటు కేటాయింపులు చేసి పనులు ప్రారంభించారు. కొత్త సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు.

పల్లెలన్నింటికీ గ్యారంటీగా తాగునీరు అందేవిధంగా జలహారం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి పనులు ప్రారంభించారు. మరో మూడేళ్లల్లో ఇరవై నాలుగు గంటలు విద్యుత్, ఇంటింటికీ తాగునీరు అందించలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగను అని చెప్పిన నాయకుడు చరిత్రలో మరొకరు ఉన్నారా? అంత దమ్ము ధైర్యం ఏ నాయకుడైనా ప్రదర్శించారా? రాబోయే కాలంలో విద్యుత్ అవసరం ఎంత?

విద్యుత్ ఉత్పత్తికి ఏయే రంగంలో ఎన్ని ప్రాజెక్టులు నిర్మించాలి? డిమాండుకు, సరఫరాకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చి కొరతలు లేని దేదీప్య తెలంగాణ సాధించడం ఎట్లా? కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ ఐదు దశాబ్దాల్లో చేసిన విద్యుత్ ఉత్పత్తిని ఈ మూడేళ్లలోనే అదనంగా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. పొన్నాలా, జానారెడ్డి, ఎర్రబెల్లి, మోత్కుపల్లి, షబ్బీరలీ.. నాయకులారా? మీరెప్పుడయినా మీ నియోజకవర్గాల పరిధిని దాటి ఆలోచించారా? థర్టీ ఇయర్స్ ఇన్ పాలిటిక్స్ అని తొడలు కొడితే ఏం ప్రయోజనం? ఎవరిని ఉద్ధరించారు? తెలంగాణ రాష్ట్రంకోసం మీకంటూ ఒక విజన్ ఉందా? ఒక ప్రణాళిక ఉందా? ఎందుకు మీ తెలివితేటలను బజారులో వేసుకుంటారు? తెలంగాణను అర్థం చేసుకోవడానికి, ఆకళింపు చేసుకోవడానికి, ఏదైనా కొత్త ఆలోచనలు, గొప్ప ఆలోచనలు వస్తే ప్రజల ముందుకు రావడానికి మీకు ఐదేళ్లు విశ్రాంతి ఇచ్చారు. ఇంతలోనే ఈ విరగబాటు ఎందుకు?

ప్రస్తుత సచివాలయానికి వాస్తు దోషం ఉందా లేదా అన్నది అనవసరం. ముఖ్యమంత్రి అభిప్రాయంతో అందరూ ఏకీభవించకపోవచ్చు. కానీ అది అష్టవంకరలు తిరిగి ఇప్పుడొక దొడ్డిలాగా మారిపోయిందన్నది వాస్తవం. రెండు రాష్ట్రాలకు వాటాలు వేయడం వల్ల కిటకిటలాడిపోవడమూ చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ అంతర్జాతీయ వాణిజ్య నగరంగా వేగంగా వృద్ధి చెందుతున్నది. ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలు హైదరాబాద్‌ను తమ వాణిజ్య కార్యకలాపాల విస్తరణకు మేలైన గమ్యంగా ఎంచుకుంటున్నాయి. నిర్మాణ రంగంలో వచ్చిన విప్లవం అద్భుతమైన సౌధాలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఎంతో దూరం ఎందుకు? హైదరాబాద్‌లో ఉన్న ఐఎస్‌బి క్యాంపస్‌ను, మన జేఎన్‌టీయూ క్యాంపస్‌ను పోల్చి చూడండి. ఫైనాన్సియల్ డిస్ట్రిక్టులో ఉన్న ఏ భవనాన్నయినా మన సచివాలయంతో పోల్చి చూడండి.

బేగంపేట విమానాశ్రయాన్ని, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పోల్చి ఊహించండి? అపోలో వైద్యశాలను చూసి ఉస్మానియా వైద్యశాలను చూస్తే హృదయం శల్యమవుతుంది. రాష్ట్ర సచివాలయం ఎందుకు అంత దీనంగా ఉండాలి? విశ్వనగరానికి తగినట్టుగా ఒక అధునాతన, సమగ్ర సచివాలయం నిర్మించుకుంటే నేరమా? గాంధీ కళాశాల స్థలాన్ని పరాయిపరం చేస్తుంటే నాడు మర్రి శశిధర్‌రెడ్డి ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు? నాయకులు చరిత్రను మరచిపోవచ్చు. కానీ చరిత్ర నాయకులను మరచిపోదు. వెంటాడుతూ ఉంటుంది. మరొక విచిత్రమైన పంచాయతీని మహబూబ్‌నగర్ కాంగ్రెస్, టీడీపీ నాయకులు ముందుకు తెచ్చారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అని ఒకరు, జూరాల-పాకాల వద్దని మరొకరు. వారూ అంతే.

గతం అంతా మరచిపోయినట్టున్నారు. మహబూబ్‌నగర్ ఎడారిగా మారింది ఆ రెండు పార్టీల ఏలుబడిలోనే. మహబూబ్‌నగర్‌ను దత్తత తీసుకున్నట్టు మొదట ఎన్టీర్ ప్రకటించారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రకటించారు. కానీ ఒక్కటంటే ఒక్క పని ఆ జిల్లాకు చేయలేదు. ఓట్ల పంట పండించుకోవడం తప్ప, మహబూబ్‌నగర్ పొలాలను పండించింది లేదు. జూరాల కాలువల సామర్థ్యం చూస్తేనే అక్కడి నాయకులు ఆ జిల్లాకు ఏమి చేశారో తెలుస్తుంది. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులను మొదలు పెట్టి కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు దండుకుని ఇప్పటికీ లక్ష్యాల మేరకు నీళ్లందివ్వని పాపం ఎవరిది? తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి వెంటపడుతున్నది.

నిధులు విడుదుల చేస్తున్నది. కొత్తగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు ప్రణాళికలు రూపొందించింది. దీంతోపాటు వరద జలాలకోసం జూరాల-పాకాల ప్రాజెక్టును కూడా ఆలోచన చేస్తున్నది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే మహబూబ్‌నగర్‌కు నీరు రాకుండానే ఇతర జిల్లాలకు తరలిపోతాయా? శ్రీరాంసాగర్ వరద కాలువ వల్ల కరీంనగర్‌కు మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఏ ప్రాజెక్టు నుంచయినా మొదటవచ్చే ప్రాంతాలకు నీరివ్వకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం సాధ్యమయ్యే పనేనా? పైగా ఇన్ని ప్రాజెక్టుల పనులు ఒక్కసారిగా జిల్లాలో ప్రారంభిస్తే జిల్లా నుంచి జనం వలసపోవలసిన అవసరం ఉంటుందా? కొంచెం విచక్షణతో ఎందుకు ఆలోచించడం లేదు? ప్రతిపక్షం నోరుమూసుకోవాలని కాదు. ప్రతిపక్షం మాటకు విలువ ఉండాలి. నిజమే కదా… బాగా చెప్పారనిపించుకోవాలి. అంతేతప్ప లెస్స చెప్పొచ్చారులే అని అనుకునే పరిస్థితి రాకూడదు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *