mt_logo

సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్ వరాలజల్లు..

సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరాల జల్లు కురిపించారు. కార్మికులకు బోనస్ గా కోల్ ఇండియా ద్వారా రూ. 240 కోట్ల ప్యాకేజీని అందిస్తామని, సంస్థ లాభాల్లో 20 శాతం అంటే ప్రతి కార్మికుడికి సగటున రూ. 40 వేల చొప్పున రానుంది. సోమవారం సాయంత్రం సచివాలయంలో సీఎం కేసీఆర్ కోల్ బెల్ట్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి దసరా పండుగ జరుపుకోనున్న సందర్భంగా ఎప్పుడూ లేనివిధంగా కార్మికులకు 20 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

అదేవిధంగా కార్మికులు ఎప్పటినుండో కోరుతున్న డిపెండింగ్ ఉద్యోగాల సమస్యలను కూడా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీపావళి కానుకగా దాదాపు 3,100 డిపెండింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, దివాకర్ రావు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. సంస్థ లాభాల్లో 20 శాతం వాటా ఇవ్వాలని సీఎం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని, గత ప్రభుత్వాలు కార్మికులను ఇబ్బంది పెడితే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వరాల జల్లు కురిపించారని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ప్రశంసించారు.

ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు ఏటా లాభాల్లో ఒకశాతం మాత్రమే కార్మికులకు బోనస్ గా ఇచ్చేవారని, అందుకు పూర్తి భిన్నంగా సీఎం కేసీఆర్ ఒకేసారి 20 శాతం బోనస్ ప్రకటించి కార్మికులపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. దసరా, దీపావళి పండుగలు రానున్నందున సెప్టెంబర్ నెల జీతాన్ని కూడా ఈనెల చివరిలోగా ఇప్పిస్తామని హామీ ఇచ్చారని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, దివాకర్ రావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *