మెదక్ జిల్లా సిద్దిపేటలో బంగారు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం ఉదయమే మంత్రి హరీష్ రావు ఇంటికి చేరుకొని అక్కడ ఆయన సతీమణి శ్రీనితతో కలిసి బతుకమ్మ పేర్చారు. అనంతరరం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు ఇంట్లో కూడా బతుకమ్మను పేర్చి సాయంత్రం 5 గంటలకు సిద్ధిపేట వేంకటేశ్వరాలయం వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి కోమటిచెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
మంత్రి హరీష్ రావు, ఎంపీ కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి బతుకమ్మ ఆడే ప్రాంగణానికి చేరుకోగానే డప్పు చప్పుళ్ళు, కళాకారుల ఆటపాటలు, పిల్లల నృత్యాలతో సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ, కోటి బతుకమ్మలు ఎత్తి తెలంగాణ సాధించుకున్నామని, ఇప్పుడు బంగారు బతుకమ్మను ఎత్తి బంగారు తెలంగాణ సాధించుకుందామని అన్నారు.
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఇన్నాళ్ళూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను వలస పాలకులు అణగదొక్కారని, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పండుగలకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తెస్తున్నారన్నారు. సిద్దిపేటలో జరుగుతున్న ఈ బతుకమ్మ సద్దుల బతుకమ్మను తలపిస్తున్నదని, తెలంగాణ ఉద్యమం కులమతాల మధ్య గొప్ప ఐక్యతను చాటిందని హరీష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాబూమోహన్, చింత ప్రభాకర్, రామలింగారెడ్డి, కలెక్టర్ రాహుల్ బొజ్జ తదితరులు పాల్గొన్నారు.