mt_logo

సెటిలర్ల గూండాగిరి

‘నా కొడుకుల్లారా…మా చంద్రబాబును అడ్డుకుంటామన్నారు కదరా! యాడ అడ్డుకున్నార్రా? ఇక మీ పని అయిపోయిందిరా… ఎవడడ్డం వస్తాడో చూస్తాం..(బూతులు)’ అంటూ రెచ్చిపోయిన ఆంధ్రా అల్లరిమూకలు తెలంగాణవాదులపై పథకం ప్రకారం దాడిచేశాయి. వెంట తీసుకువచ్చిన కర్రలు, రాళ్లతో గొడ్లను బాదినట్లు బాదారు. ఒక్కో తెలంగాణవాదిని పదిమంది సెటిలర్లు చితకబాదారు. సెటిలర్ల ఆధిపత్యం అధికంగా ఉన్న నిజామాబాద్ జిల్లా వర్నిలో ఆదివారం రాత్రి సాగిన దౌర్జన్యకాండ ఇది. చంద్రబాబు పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించి ఆదివారం ఐదో రోజు పూర్తిచేసుకుంది. పాదయాత్ర జిల్లాల్లో ప్రవేశానికి ముందు తెలంగాణవాదులు, పార్టీలు, సంఘాలు చంద్రబాబును నిలదీస్తామని ప్రకటించాయి. సెటిలర్లు లేని చోట్ల మూడు రోజులపాటు నిలదీతలు, నిరసనల మధ్య బాబు యాత్ర సాగింది. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్నిలో తెలంగాణ ప్రాంతవాసులతో సమానంగా సెటిలర్ల్లు ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం బలంగా ఉంది. చంద్రబాబును మిగతా ప్రాంతాల్లో నిలదీశారనే కసితో ఉన్న సెటిటర్లు వర్నిలో స్థానిక తెలంగాణవాదులపై పథకం ప్రకారం దాడి చేశారు.

బాధితుల కథనం ప్రకారం…ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్న టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్వీ, తెలంగాణ జాగృతి, మాదిగ దండోరా, జేఏసీ నేతలను ఆదివారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత లక్ష్యంగా చేసుకున్నారు. వర్నిలోని లాజర్ హోటల్‌లో ఎప్పటిలాగే తెలంగాణవాదులు చేరి చర్చలు జరుపుతున్నారు. స్థానిక కోటయ్యక్యాంపునకు చెందిన టీడీపీ కార్యకర్త సుబ్బారావు అక్కడ రెండు, మూడుసార్లు చక్కర్లు కొట్టారు. తర్వాత అర్ధగంటలో నూటా యాభైమంది సెటిలర్లు స్థానిక వడ్లవ్యాపారి మొలకల భాస్కర్, సుబ్బారావు నాయకత్వంలో హోటల్‌ను చుట్టుముట్టారు. రెండు షట్టర్లను మూసేసి కర్రలతో దాడిచేశారు.

రాయడానికి వీల్లేని బూతులు తిట్టారు. దాడిచేయడానికి వచ్చిన కిరాయిమూకలు డిచ్‌పల్లి, ధర్మారం, మాధవనగర్ తదితర ప్రాంతాలకు చెందిన వారని బాధితులు చెప్పారు. ఏ పార్టీ, సంస్థకు చెందినవాళ్లమే చెబుతూ భాస్కర్ కొట్టించాడని టీఆర్‌ఎస్ నేత ఎజాజ్ చెప్పా రు. దాడిలో మాదిగ దొండోరా నేతలు ప్రసాద్, సంజీవ్, టీఆర్‌ఎస్వీ నేతలు కృష్ణాడ్డి, చాంద్‌పాషా, జాగృతి నేత కృష్ణాగౌడ్ తీవ్రంగా గాయపడగా జాగృతి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సంతోష్ కులకర్ణి తృటిలో తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై హన్మంత్‌యాదవ్ సంఘటన స్థలానికి చేరుకోవడంతో తెలంగాణవాదులు ప్రాణాలతో బయటపడ్డారు. లేకుంటే ఒకరిద్దరిని హతమార్చే ప్లాన్ ఉందని బాధితులు తెలిపారు.

(నమస్తే తెలంగాణ సౌజన్యంతో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *