mt_logo

తెలంగాణవాదులపై సీమాంధ్ర దాదాగిరీ!!

ఢిల్లీలోని ఏపీ భవన్ సాక్షిగా తెలంగాణ వాదులపై ఆంధ్రా నేతలు జులుం ప్రదర్శించారు. ఆంధ్రాభవన్ గా ప్రసిద్ధికెక్కిన ఏపీ భవన్ సిబ్బంది, ఢిల్లీ పోలీసులూ తెలంగాణ మంత్రులపై నిర్దాక్షిణ్యంగా దాడులు చేశారు. తెలంగాణ ఆంధ్రా కలిసి ఉండలేవనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం లేదని దీన్ని బట్టి తెలుస్తుంది. తెలంగాణపై కొనసాగుతున్న దాష్టీకానికి నిలువెత్తు నిదర్శనం నిన్న జరిగిన ఏపీ భవన్ సంఘటన. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసేందుకు వెళ్తున్న సీఎం కిరణ్ ను అడ్డుకున్న తెలంగాణ వాదులపై దాడి చేసిన సంఘటన యావత్ తెలంగాణ ప్రజలను నిశ్చేష్టులను చేసింది. కనీసం మహిళా మంత్రులని కూడా చూడకుండా వారిపై సిబ్బంది దాడులు చేస్తుంటే బస్సులోనుండి చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటున్న సీఎం కిరణ్, బొత్స, సీమాంధ్ర నేతలపై తెలంగాణ వాదులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బస్సులో నుండి కిందికి వచ్చి వారికి నచ్చచెప్పే ప్రయత్నం కూడా చేయకుండా బస్సులోనే ఉండి చూస్తున్న సీఎం కిరణ్ సీమాంధ్ర ముఖ్యమంత్రే కానీ, తెలంగాణ సీఎం కాదని తెలంగాణ మంత్రులు విమర్శించారు. సాయంత్రం కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి గీతారెడ్డి కన్నీళ్ళ పర్యంతమయ్యారు. తన 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎవరూ ఇలా ప్రవర్తించలేదని, సీఎం కన్నా 20 ఏళ్ళు సీనియర్ అయిన తనను లెక్కచేయకుండా పోలీసుల ద్వారా జులుం ప్రదర్శించడాన్ని ఆమె తప్పుపట్టారు. కనీసం మహిళలనే గౌరవం లేకుండా కిందకు పడదోశారని, మిగతా మహిళా మంత్రులతో కలిసి సీఎం ను కలవడానికి వెళ్తే సీఎం, బొత్స చూసీ చూడనట్లు వ్యవహరించారని కంటతడి పెట్టారు. రెండుసార్లు కిరణ్ ప్రభుత్వాన్ని అవిశ్వాసం నుండి తప్పించామని, కలిసిఉండాలని కోరుకునేవారు ఇలా చేయరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి కూడా సీఎం తీరుపట్ల మండిపడుతూ అవకాశవాది అయిన కిరణ్ చర్యలను చూస్తూ ఊరుకోమని, పదవికి రాజీనామా చేసి సమైక్యవాదం వినిపించాలని డిమాండ్ చేశారు. ఏపీ భవన్ వద్ద గాయపడిన షబ్బీర్ అలీ సీఎం కిరణ్ పై పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దాడులు చేస్తుంటే బస్సులో కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుతున్నారని, ఇంకా ఎన్నిరోజులో ఈ ఆటలు సాగవని సీఎం కిరణ్ ని హెచ్చరించారు. ఇలాంటి నీతిమాలిన అరాచకాలు చేస్తూ ఇంకా కలిసుంటామనడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. ఈ సంఘటనపై పలువురు తెలంగాణ నేతలు, తెలంగాణ వాదులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ సీఎం నిరంకుశత్వానికి ఇది నిదర్శనమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *