తెలంగాణలో పనిచేస్తున్న సీమాంధ్ర అధికారుల్లో నిలువెల్లా విషం ఉంటుందనే విషయం మరోసారి నిరూపితమైంది. పదో తరగతి విద్యార్థుల్లో తెలంగాణ వ్యతిరేక భావాన్ని నింపేందుకు ప్రయత్నించిన ఓ ఉన్నతాధికారి వ్యవహారం వివాదాస్పదమైంది. కరీంనగర్ జిల్లాలో శనివారం జరిగిన ఎస్సెస్సీ ప్రీఫైనల్ పరీక్ష ఈ కుట్రకు వేదికైంది. దీనికి ఆంధ్రా డీఈఓనే కారణమనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలనే తెలంగాణవాదులు డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో శనివారం పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలు మొదలయ్యా యి. మధ్యాహ్నం పేపర్-2లో పార్ట్-బీ(ఆబ్జెక్టివ్ టైప్) ప్రశ్నపత్రంలో ఈ వాక్యాల్లో క్రియను మార్చి వ్యతిరేక వాక్యాలు రాయండి అని 11వ ప్రశ్న ఇచ్చారు. ‘కొద్ది రోజుల్లోనే తెలంగాణ వస్తుంది’ అనే వాక్యం ఇచ్చారు. క్రియను మార్చి వ్యతిరేక వాక్యం రాయాలి. అంటే ‘కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాదు’ అని రాస్తేనే ఒక మార్కు పడుతుంది. జిల్లాలో సుమారు 70 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు.
వీరందరిలో తెలంగాణ ఇప్పట్లో రాదనే భావన కల్పించాలనే కుట్రతోనే ఈ ప్రశ్నను పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు ఈ ప్రశ్నపత్రాలను రూపొందించింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా విద్యాశాఖ అధికారి జేవీపీ పూర్ణానందరావు కావాలనే ఈ ప్రశ్నను చేర్చారని జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్వీ ఆందోళనకు దిగింది. తెలంగాణ చౌక్‌లో విద్యార్థులు ప్రశ్నపపత్రాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. పలుచోట్ల తెలంగాణవాదులు ఆందోళన నిర్వహించారు. ప్రశ్నపత్ర రూపకల్పనపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. డీఈఓను తక్షణం తొలగించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. [నమస్తే తెలంగాణ నుండి]