By: కట్టా శేఖర్ రెడ్డి
తెలంగాణ బిల్లుపై ముందుకు వెళితే కేంద్ర ప్రభుత్వం కూలుతుందని, ముందస్తు ఎన్నికలు వస్తాయని ఒక ప్రచారం మొదలైంది. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు 19 మంది రాజీనామా చేస్తే ఈ ప్రభుత్వం కుప్పకూలుతుందని టీడీపీ నాయకులు వాదిస్తున్నారు. ఆ విధంగా తెలంగాణ బిల్లును ఆపొచ్చని సలహా ఇస్తున్నారు. ఇది నిజమేనా? ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఉన్నాయా? ఆహారభద్రత బిల్లు విషయంలోనూ, దేశంలోకి విదేశీ పెట్టుబడులు అనుమతించే విషయంలోనూ ఇలాగే బెదిరింపులు, హెచ్చరికలు చేస్తూ వచ్చారు. విదేశీ పెట్టుబడుల విషయంలో తృణమూల్ కాంగ్రెస్ యూపీఏ నుంచే వైదొలగింది. అయినా ఆ బిల్లు సభకు హాజరయిన 471 మందిలో 252 మంది సభ్యుల మద్దతుతో ఆమోదం పొందింది. ఆహారభద్రత బిల్లు విషయంలో కూడా ఇలాగే బెదిరింపులు కొనసాగాయి. కానీ 252 ఓట్లతో పార్లమెంటులో ఆ బిల్లు ఆమోదం పొందింది. 254 ఓట్లు లోక్‌సభలో సాధారణ మెజారిటీ మార్కుకంటే 1 ఓట్లు తక్కువ. అయినా సభకు 399 మంది మాత్రమే హాజరు కాగా, 254 మంది ఆ బిల్లుకు ఓటేశారు. ప్రభుత్వం నెగ్గించదల్చుకుంటే ఇటువంటి బెదిరింపులు, హెచ్చరికలు ఏవీ పనిచేయవని ఆయా సందర్భాల్లో రుజువయింది. ఒకసారి లోక్‌సభలో సభ్యుల బలాబలాల లెక్కలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
లోక్‌సభలో బలాబలాలు
యథాతథంగా యూపీఏ-2కు ఇప్పుడు లోక్‌సభలో ఉన్న బలం: 283
ఇందులో యూపీఏ భాగస్వామ్య పక్షాలు: కాంగ్రెస్-206, ఎన్‌సిపి-9, ఆర్‌ఎల్‌డి-5, ఎన్‌సి-3, జెఎంఎం-2, ఐయూఎంఎల్-2, విసికె-1, కేరళ కాంగ్రెస్-1= 229
యూపీఏకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న పక్షాలు: బిఎస్‌పి-21, ఎస్‌పి-22, ఆర్‌జెడి-4, జెడిఎస్-1, అస్సాంయూడిఎఫ్-1, నాగాపీపుల్స్‌ఫ్రంట్-1, బోడో పీపుల్స్ ఫ్రంట్-1, స్వాభిమాన పక్ష-1, బహుజన వికాస్ అగాది-1, సిక్కిం డెమాక్రటిక్ ఫ్రంట్-1= 54
సీమాంధ్ర సభ్యులు రాజీనామా చేస్తే?
ఒక వేళ సీమాంధ్రలోని 19 మంది సభ్యులు రాజీనామా చేస్తే యూపీఏ బలం 264కు పడిపోతుంది. అయితే కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి జేడీయూ-20, టీఆర్‌ఎస్-2, ఎంఐఎం-1, డిఎంకె-1 వంటి పార్టీలు ముందుకు రావచ్చు. జేడీయూ ఇప్పటికే కాంగ్రెస్‌తో చేయి కలుపడానికి సంకేతాలు పంపింది. డిఎంకే మొన్నటిదాకా కాంగ్రెస్ కలిసి పనిచేసిన పార్టీయే. ఈ పార్టీల బలం=41. ఏరకంగా చూసిన ప్రభుత్వం పడిపోయే అవకాశం లేదు.
బిజెపి మద్దతు ఇవ్వదా?
తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని బిజెపీతో సహ ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు ఇంతకు ముందే ప్రకటించాయి. లోక్‌సభలో ఆ పార్టీల బలం= 130. ఆహారభద్రత బిల్లు విషయంలోనూ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లు విషయంలోనూ బిజెపి, ఎస్‌పి, డిఎంకే అనేక అభ్యంతరాలు, విమర్శలు చేశాయి. కానీ చివరకు బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడానికే దోహదం చేశాయి. అందువల్ల తెలంగాణ బిల్లుకు కూడా ఎదురయ్యే సమస్యలేవీ ఉండవు.