ఫొటో: సమైక్యాంధ్ర “ఉద్యమం”లో భాగంగా కడపలో ఒక పెట్రోల్ బంకును ధ్వంసం చేస్తున్న టిడీపీ గూండాలు
—
By: విశ్వరూప్
ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం:
1952లో ఆంధ్రాలో జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టుల దెబ్బకు ఆంధ్రాలో బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, టంగుటూరి ప్రకాశంలాంటి వారు ఓడిపోయి రాజకీయ నిరుద్యోగులయిపోయారు. టంగుటూరి ప్రకాశంగారు ముఖ్యమంత్రి పదవి కోసం కష్టపడ్డా అది తమిళుడు రాజాజీకే దక్కింది. దీంతో వీళ్లన్దరికీ తెలుగువారి ఆత్మగౌరవం గుర్తుకు వచ్చింది. అంతకుముందు మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభజన ఊసెత్తని ప్రకాశం, ఎప్పుడో ముప్పైల్లో వచ్చిన ప్రతిపాదనకు మోకాలడ్డిన నీలం ఆంధ్రులకు స్వరాష్ట్రం కావాలన్నారు. తప్పులేదు..వాళ్ల వాళ్ళ సొంత అజెండాలు మనకనవసరం..ఉద్యమం మంచి చెడ్డలు తప్ప.
రాజాజీ అప్పటి ప్రతిపాదిత నందికొండ (ఇప్పటి నాగార్జునసాగర్) నుండి కొంత నీటిని మద్రాసుపట్టణానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. ఇది కృష్ణా, గుంటూరులో ఉన్న భూస్వామ్యవర్గాలకు నచ్చలేదు. ఇదే అదను అనుకొని రాజకీయంగా దెబ్బతిన్న బెజవాడ, నీలం, ప్రకాశం లాంటి నాయకులు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఉద్యమం మొదలు పెట్టారు. ఇక్కడ ఆంధ్రా నాయకుల, కృష్ణా, గుంటూరు భూస్వాముల ప్రయోజనాలే ఈ ఉద్యమానికి కీలకమయ్యాయన్నది గమనించాల్సిన విషయం.
అంతకుముందు గుంటూరులో కొన్ని గుమస్తా ఉద్యోగాలు తమిళులకు ఇచ్చారంటూ చిన్న గొడవ కూడా బయల్దేరింది. తమిళులు తమ అవకాశాలను దోచుకుంటున్నారనేది ఉద్యమంలో ముఖ్యంగా ప్రచారం అయింది. అంటే ఇప్పటి తెలంగాణ ఉద్యమం లాగానే అప్పుడు కూడా ఉద్యోగాలు, నీళ్ళు ప్రధానాంశాలు కాగా తరువాత అది తెలుగువారి ఆత్మగౌరవంగా మారిపోయింది.
ఆంధ్ర రాష్ట్ర విభజనను పరిశీలించడానికి వేసిన జేవీపీ కమిటీ మద్రాసు నగరం లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంది. అయితే అప్పటి ఉద్యమంలో ఎవరికీ పక్కన తెలంగాణలో ఉన్న తెలుగు వారు గుర్తుకు రాలేదు. మద్రాసు లేకపోతే సరే తెలంగాణలో ఉన్న తెలుగువారిని కూడా కలపాలి అని ఎవరూ ప్రతిపాదించలేదు, ఉద్యమించలేదు. కానీ తమకి రాని, తమిళులు అధికమయిన మద్రాసు కోసం మాత్రం పోరాడారు, అమాయకుడు పొట్టి శ్రీరాములును పొట్టనబెట్టుకున్నారు.
జై ఆంధ్రా ఉద్యమం:
1969 తెలంగాణ ఉద్యమం తరువాత ముల్కీ నిబంధనల అంశం సుప్రీం కోర్టుకు చేరింది. చివరికి సుప్రీం కోర్టు తమ తీర్పులో ముల్కీ నిబంధనలు న్యాయమయినవే అని తేల్చింది. దీనికి కొద్దినెలలు ముందుగానే అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు సీమాంధ్రలో భూసంస్కరణలను అమలు చెయ్యడానికి ప్రయత్నిస్తుంటే అప్పటి ఆంధ్రా మంత్రులు, ఇతర నాయకులకు ఇది నచ్చడంలేదు. పీవీపై ఈవిషయంపై ఆంధ్రా నాయకులు కోపంతో రగులుతున్నారు.
ముల్కీ నిబంధనల విషయంలో సుప్రీం కోర్టు తీర్పుతో వీరికి చక్కగా అదును చిక్కింది. ఇంకేం ఒక్కసారిగా ఆరుగురు మంత్రులు రాజీనామా చేసి జై-ఆంధ్ర ఉద్యమం లేవనెత్తారు. ఇక్కడ కూడా ఉద్యమం కొందరు భూస్వామ్య వర్గాల ప్రయోజనాలకోసమేనని తెలుస్తుంది.
అయితే ముల్కీ రూల్స్ ఏ పక్షపాత నేతనో బలవంతంగా వీరిపై రుద్దలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రులు వీరికి అన్యాయం చేయలేదు. కేవలం సుప్రీం కోర్టు ఇది న్యాయమేనని ధృవీకరించింది. అయినా దేశంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పును కూడా గౌరవించకుండా వీరు ఉద్యమాన్ని లేపారు. కొన్ని నెలలు అల్లకల్లోలం సృష్టించారు.
ఎలాగయితేనేం ఈ ఉద్యమం ద్వారా వీరు తాము కోరుకున్న ఫలితాన్ని రాబట్టగలిగారు. ముల్కీ రూల్స్ రద్దయ్యాయి, పీవీ ముఖ్యమంత్రి పదవినుండి దిగిపోయాడు, భూసంస్కరణలు ఆగిపోయాయి. ఒక్కసారిగా ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ కూడా ఆగిపోయింది. ఈ ఉద్యమం మొదలవడం, ఆగిపోవడం అంతా కూడా తెలంగాణకు న్యాయం జరుగుతుంటే అడ్డుకోవడానికే తప్ప నిజంగా విడిపోవడానికి కాదనీ, కలిసి ఉండడంలో విపరీతంగా లాభపడుతున్న వీరికి విడిపోవాలని లేదనీ తెలుస్తుంది.
సమైక్యాంధ్ర ఉద్యమం:
2009 డిసెంబరు తొమ్మిదిన చిదంబరం తెలంగాణ ప్రకటించగానే సీమాంధ్రలో రాత్రికి రాత్రే సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయింది. అంతకుముందు పదేళ్ళుగా తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఏనాడూ అడ్డుచెప్పనివారు, పైగా తెలంగాణ వస్తే రాజధాని గుంటూరు దగ్గరొస్తుందని భూముల ధరలు పెంచిన వారు, అన్నిపార్టీలూ తెలంగాణ అంశాన్ని మానిఫెస్టోల్లో చేర్చినప్పుడు, మద్దతు ప్రకటించినపుడు అడ్డుచెప్పక వారినే గెలిపించినవారు, కనీసం బిల్లు పెట్టండి మేం మద్దతు ఇవ్వకపోతే అడగండి అని రెండ్రోజులముందు చంద్రబాబు అన్నా అడ్డు చెప్పనివారికి ఒక్కసారి సమైక్యతలోని సద్భావన గుర్తొచ్చింది. ఇంకేముంది వెంటనే తెలంగాణ ప్రజలను “మీరు మాతో కలిసుండాల్సిందే” అంటూ సమైక్యాంధ్ర ఉద్యమం చేశారు.
ఎవరైనా తమ హక్కులకోసం ఉద్యమం చేస్తారు. మీరు మాతో కలిసి ఉండాల్సిందే అంటూ ఎదుటివారి హక్కులకు అడ్డుపడడానికి చేసిన ఉద్యమం చరిత్రలో ఇదే మొట్టమొదటిది.
ఈ ఉద్యమం కూడా మిగతా రెండు ఉద్యమాల లాగే సమైక్య రాష్ట్రంలో అమితంగా లాభపడుతున్న కొద్దిమంది ధనిక, భూస్వామ్య, పెట్టుబడిదారులకోసమే అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈ ఉద్యమానికి దళితులెవరూ మద్దతివ్వకపోగా వారు విభజనే కావాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ విధంగా సీమాంధ్రలో జరిగిన మూడు ప్రధాన ఉద్యమాలు ధనిక భూస్వామ్య వర్గాలు, కొందరు నేతల ప్రయోజనం కోసం చేసినవి కాగా ఈ మూడు ఉద్యమాల్లో మూడు రకాలుగా ఉద్యమాలు చేశారు. ఒకసారి ఇప్పుడు తెలంగాణలో ఏ అంశాలమీద ఉద్యమం జరుగుతుందో దదాపు అదే అంశాలమీద జరిగిన ఉద్యమం. అప్పుడు అలాంటి కారణాల మీద విడిపోవడం వీరికి ఒప్పుగా తోచగా ఇప్పుడది తప్పుగా తోస్తుంది. మరో ఉద్యమంలో ఇప్పటి వాదనకు పూర్తి భిన్నంగా ఇప్పుడు కలిసి ఉందామన్న వారు అప్పుడు విడిపోదామన్నారు. అదికూడా కనీసం దేశంలో అత్యంత ఉన్నతమయిన న్యాయపీఠం ఒక తీర్పునిస్తే దాన్ని గౌరవించకుండా!
అంటే అక్కడ ఉద్యమాలకు ఒక సిద్ధాంతం, గట్రా ఉండవు. అక్కడి భూస్వామ్య, ధనిక వర్గాల ప్రయోజనాలు కాపాడేందుకు వీళ్లు ఏదయినా వాదించగలరు అని తెలుస్తోంది. రేప్పొద్దున కేంద్రప్రభుత్వం సమైక్య రాష్ట్రాన్ని అలాగే ఉంచి తెలంగాణకు న్యాయం జరిగేలా ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే మళ్లీ ఈ నాయకులే తమ స్వరం మార్చి రాష్ట్రాన్ని విడగొట్టాలనే డిమాండ్ చేయగలరు.
నిజమైన ప్రజా ఉద్యమాలు:
మరి సీమాంధ్రలో నిజమయిన ప్రజా ఉద్యమాలు జరగలేదా అంటే జరిగాయి. మొన్న కాకరాపల్లిలో థ్ర్మల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమం, కారంచేడు దళితుల ఊచకోతకు వ్యతిరేకంగా చేసిన ఉద్యం, ఇలాంటివే మరికొన్ని. వీటికి ఇక్కడి ఏ పెద్దనాయకుడు తమ మద్దతునివ్వడు, గట్టిగా పోరాడడు. ఏదో మొక్కుబడి ఖండనలు తప్ప. పేదోల్లకి న్యాయంజరిగేలా చేసే ఉద్యమాలకు ఇక్కడ కనీసం చదువుకుని పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా మద్దతివ్వరు, ఎందుకంటే వీరిలో అత్యధికులు సీమాంధ్ర ధనిక భూస్వామ్య వర్గాలవారే కాబట్టి.