-విశ్వరూప్
మల్లీ తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాల పర్వం మొదలయింది. రెండున్నరేళ్ళ క్రితం కేసీఆర్ నిరాహారదీక్ష సమయంలో శ్రీకాంతాచారి ఎల్బీనగర్లో ఒంటిమీద కిరోసిన్ పోసుకుని చనిపోవడంతో మొదలయిన బలిదానాలపర్వం కొద్దిరోజులుగా బలిదానాలు తగ్గిపోయాయని ప్రజలు కాస్త ఊరటపడుతున్న సమయంలో చీఫ్‌విప్ గండ్ర తెలంగాణవాదం తగ్గిపోయిందని మాట్లాడి మరోసారి బలిదానాలకు తెరదించారు.
అసలింతకూ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఉద్యమంలో ఆత్మబలిదానాల అవసరం ఏముంది? ఉద్యమకారులు ప్రభుత్వంపై నిరశన తెలపాటానికి ఇంకా అనేకమార్గాలు ఉండగా ఈ విపరీత విధానాన్నే ఆయుధంగా ఎందుకు ఎన్నుకుంటున్నారు? దీనికి సమాధానం తెలుపును తెలుపుగా, నలుపును నలుపుగా చూపించాల్సిన మీడియా బాధ్యత మరచి వ్యవహరించి మిగతా నిరశన మార్గాలకు గొళ్ళెం పెట్టడం వల్లేనని చెప్పొచ్చు.
తెలుగు మీడియా డిసెంబరు 9, 2009 తరువాత తెలంగాణపై కక్షగట్టినట్టు వ్యవహరించి ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తుండగా నేషనల్ మీడియా శ్రీక్రిష్ణ కమిటీ ఏడో అధ్యాయం వల్లనేమో అసలు తెలంగాణ అనే ప్రాంతమే ఈ భూమి మీద లేదన్నట్టు వ్యవహరిస్తోంది. మీడియా అనుసరిస్తున్న ఈ పక్షపాత వైఖరి వల్ల సామాన్య, పేద యువకులకు ఈ ప్రభుత్వం వైఖరిపై నిరశన వ్యక్తం చెయ్యడానికి మరే మార్గం లేకుండా పోయింది.
ఇక్కడ ఉస్మానియాలో వెయ్యిమంది విద్యార్థులు ఒక్కసారి సామూహిక నిరాహారదీక్షలకు పాల్గొంటే మీడియా ఆఖరు పేజీలోకూడా ఆ ఊసే ఉండదు. ఇక్కడ విద్యార్థుల శాంతియుత ర్యాలీలను పోలీసులు అన్యాయంగా అడ్డుకుని విచక్షణారహితంగా ఉస్మానియాలోనూ, నిజాం కాలేజీలోనూ కొడితే ఆ సంఘటనలు మీడియా పచ్చకామెర్ల కళ్ళకు అందవు.ఇక్కడ సబ్బండవర్గాలు కలిసికట్టుగా సకలజనులసమ్మె చేస్తే అసలేమీ జరగట్లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు ఉప-ఎన్నికల్లో అన్నిస్థానాల్లో తెలంగాణ అనుకూల పార్టీలు దిగ్విజయం చెందినా మసిపూసి మారేడుగాయజేసి వోట్లశాతం తగ్గింది, తెలంగాణవాదం తగ్గింది అంటూ ప్రచారం మొదలు పెడతారు.
ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వానికి అందజేయాల్సిన బాధ్యతను మీడియా నిర్వర్తించడం మరిచినందువల్ల ఇక సామాన్యుడికి తన గొంతును వినిపించే అవకాశం పోయింది. తామేం చేసినా, ఎంత ఉధృతంగా సమ్మెచేసినా కనీసం ఆ వార్త ప్రపంచానికి చేరకపోతే ఇంకా తాము శాంతియుత మార్గాల ద్వారా నిరశన తెలిపి లాభంలేదనే నిరాశ యువకుల్లో వ్యాప్తించింది. స్వతహాగా శాంతికాముకులూ, ఫాక్షన్, రౌడీ రాజకీయాలకు దూరమైన తెలంగాణ ప్రజలు తమ ఆగ్రహాన్ని హింసారహితంగా ఎలా వ్యక్తం చేయాలో తెలియని అనిశ్చిత స్థితిలోకి వెల్లారు. paryavasaanam -, తమ నిరశన తెలపటానికి ఆత్మబలిదానాలద్వారా తమను తామే హింసించుకుంటున్నారు.
తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న ఆత్మబలిదానాలకు పూటకో మాట మార్చి వచ్చిన తెలంగాణను అడ్డుకున్న మోసపునేతలు ఎంత బాధ్యులో తమ బాధ్యత మరిచి పక్షపాతబుద్దితో వ్యవహరిస్తూ వృత్తిద్రోహం చేస్తున్న మీడియా కూడా అంత బాధ్యులు. తెలంగాణా ఈ మీడియాకు అక్కరలేకపోతే మనకూ ఈ పక్షపాత మీడియా అవసరం లేదు. ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీమాంధ్ర మీడియానూ, తెలంగాణ అసలు లేనట్లు వ్యవహరిస్తున్న జాతీయ మీడియానూ తెలంగాణాలో బహిష్కరిద్దాం.