mt_logo

ఇంటర్ ఉత్తీర్ణతపై సీమాంధ్ర మీడియా విషప్రచారం

సీమాంధ్ర నాయకులు, వ్యాపారులు, మీడియా కలిసి తెలంగాణ ప్రాంతంపై, రాష్ట్రసాధన ఉద్యమంపై అబద్ధాల, అర్థ సత్యాల విషప్రచారానికి దిగడం ఇది మొదటిసారి కాదు, చివరిసారీ కాబోదు. ఇదివరకైతే వారు ఆడింది ఆట, పాడింది పాటగా చలామణి అయ్యేది కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వారి ప్రతి అబద్దాన్ని తుత్తునియలు చేసేందుకు తెలంగాణ ఉద్యమకారులు సదా సిద్ధంగా ఉన్నారు.

తాజాగా సకల జనుల సమ్మె వల్ల తెలంగాణ ప్రాంతంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత తగ్గిందనే దొంగ ప్రచారం మొదలు పెట్టింది సీమాంధ్ర మీడియా. కళ్ళ ముందే ఉన్న నిజాలను తిరగేసి, కట్టు కథలు అల్లి దుష్ప్రచారానికి దిగే తన నైజం మరోసారి ప్రదర్శించింది.

ఈ ప్రచారం సహజంగానే కొందరు తెలంగాణ ప్రజలను కలవరపరచింది.

అసలు నిజాలేమిటి?, ఈ ప్రచారంఎక్కడినుండి మొదలైంది? అని ఆరా తీస్తే విస్మయపరిచే వాస్తవాలు బయటపడ్డాయి. ఒకసారి చదవండి సీమాంధ్ర మీడియా, వ్యాపార సంస్థలు కలిసి పన్నిన కుట్రలు ఎట్లా ఉంటాయో.

20 ఏప్రిల్ నాడు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సర ఫలితాలు వెలువడ్డాయి. ఆరోజు ఫలితాల వెల్లడి కన్నా ముందే ఒక భారీ కుట్రకు పధక రచన జరిగిపోయింది. ముందుగా అనుకున్నట్టుగానే ఫలితాలు వెల్లడిస్తూ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ సెక్రటరి సుబ్రహ్మణ్యం ఈసారి ఫలితాల్లో తెలంగాణ జిల్లాలు వెనకబడ్డాయని, అందుకు కారణం సకల జనుల సమ్మెనే అని ఒక అబద్ధపు కూత కూశాడు. ఇంటర్ బోర్డులోని జిల్లా స్థాయి అధికారులు కూడా ఎవరో ఆదేశించినట్టుగా వివిధ తెలంగాణ జిల్లాల్లో ప్రెస్ కాన్ ఫరెన్సులు పెట్టి మరీ ఇదే అబద్ధాన్ని వల్లెవేశారు.

అక్కడే ఉన్న సీమాంధ్ర మీడియా దాని ఉన్నఫళంగా అందిపుచ్చుకుని బ్రేకింగ్ న్యూస్ అంటూ మొదలుపెట్టి ఒక రోజంతా వార్తలు, విశ్లేషణలతో ఊదరగొట్టింది. మరునాడు సీమాంధ్ర జ్యోతులు ఇదే అబద్ధాన్ని అచ్చోసి వదిలి, తెలంగాణపై తమ కసిని తీర్చుకున్నాయి.

ఇంతకూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నిజంగానే తెలంగాణ ప్రాంతం ఉత్తీర్ణత తగ్గిందా? దానికి కారణం సకల జనుల సమ్మెనేనా?

కానే కాదు! ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ జిల్లాల్లో ఉత్తీర్ణత తగ్గలేదు సరికదా పెరిగింది. అసలు సకల జనుల సమ్మె ప్రభావం ఫలితాల మీద లేదని మనకు ఇట్టే అర్థం అవుతుంది. ఒక సారి ఈ కింది గణాంకాలు చూడండి.

(ఎరుపు రంగులో ఉన్న జిల్లాలు గత యేడాది కన్నా ఉత్తీర్ణత తగ్గినవి. ఆకుపచ్చ రంగులో ఉన్న జిల్లాలు గత యేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత పెరిగినవి)

గత యేడాదితో పోలిస్తే ఆరు తెలంగాణ జిల్లాల్లో (రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీం నగర్) ఉత్తీర్ణత శాతం పెరిగింది. కేవలం నాలుగు జిల్లాల్లోనే (అదిలాబాద్, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్) ఉత్తీర్ణత తగ్గింది.

ప్రతి యేడాది వివిధ జిల్లాల్లో ఉత్తీర్ణత శాతాలు పెరగడం, తగ్గడం చాలా సాధారణంగా జరిగే పరిణామమే. అది పదో తరగతి కావచ్చు , ఇంటర్ కావచ్చు వివిధ జిల్లాల్లో గత కొన్నేళ్ల ఫలితాలు పరిశీలించి చూస్తే ఇలాంటి హెచ్చుతగ్గులు తరచూ జరిగేదే అని బుర్ర ఉన్నవాడెవడికైనా అర్థం అవుతుంది.

ఉదాహరణకు ఈసారి ఉత్తీర్ణత తగ్గిన మెదక్ జిల్లాను తీసుకుంటే 2008లో 43.2% ఫలితాలు సాధించిన ఆ జిల్లా 2009 నాటికి 35.4% కు పడిపోయింది. అప్పుడు ఏ సకల జనుల సమ్మె జరిగిందని అంత ఉత్తీర్ణత పడిపోయింది? ఇక ఇదే జిల్లాలో 2010లో 42.8% కి ఉత్తీర్ణత పెరిగి, 2011 నాటికి అది 43.1% కి చేరుకుంది. ఈ సంవత్సరం స్వల్పంగా తగ్గి 41% వచ్చింది. దీనికి విపరీతార్ధాలు తీయడం తగునా?

ఇటువంటి హెచ్చు తగ్గులు ఒక్క తెలంగాణలోనే కాదు సీమాంధ్రలో కూడా తరచూ జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకు 2008లో విశాఖపట్నం జిల్లాలో 61% ఉన్న ఉత్తీర్ణత శాతం 2009కి వచ్చే సరికి 51%కి పడిపోయింది. అలాగే 2008లో కృష్ణా జిల్లాలో 67% ఉన్న ఉత్తీర్ణత 2009కి వచ్చేసరికి 63% కి పడిపోయింది. రాయలసీమలోని కర్నూల్లో 2008లో దాదాపు 51% ఉత్తీర్ణత ఉండగా అది 2010కి వచ్చేసరికి 41% కి తగ్గింది. మరి అప్పుడు ఏ సమ్మెలు, ఉద్యమాలకు ఆ తగ్గుదలను అంటగట్టారు?

తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డగా అందరూ చెప్పుకునే వరంగల్ జిల్లాలో 2009లో 40% ఉన్న ఉత్తీర్ణత, 2010లో 42%కు, 2011లో 43%కు పెరిగి ఈ యేడాది మరింత పెరిగి 45%కు చేరుకుంది. సమ్మె వల్లనే ఉత్తీర్ణత తగ్గిందనే సొల్లు వాదన నిజమైతే వరంగల్లో ఇట్లాంటి ఫలితాలు వచ్చేవా?

ఉద్యమం బలంగా ఉన్న మరో జిల్లా నల్లగొండలో గత యేడాదితో పోలిస్తే 10% ఉత్తీర్ణత పెరిగింది. వొకేషనల్ ఇంటర్ ఫలితాలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది ఈ జిల్లా.

నిజాలు ఇలా ఉంటే సీమాంధ్ర మీడియా ఎందుకు బరితెగించి అబద్ధపు ప్రచారానికి దిగుతోంది?.

కారణాలు సుస్పష్టం. ఈ రకపు దుష్ప్రచారం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదువుతున్న పిల్లలున్న తెలంగాణ ప్రాంత తల్లితండ్రుల్లో ఉద్యమం పట్ల ఒక భయాందోళన రేకెత్తించడం. మళ్లీ ఉద్యమం ఊపందుకుంటున్న ఈ దశలో తెలంగాణ ప్రజలలో కనీసం కొందరినైనా ఉద్యమానికి వ్యతిరేకంగా తయారుచేయడం.

ఇవి రెండే కాక ఈ దుష్ప్రచారం వెనుక ఇంకో ప్రమాదకరమైన కోణం ఉన్నది. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఇంటర్మీడియట్ కాలేజీలను నాశనం చేసిన శ్రీ చైతన్య, నారాయణ వంటి సీమాంధ్ర కార్పొరేట్ కాలేజీలకు ఇంకొంచెం మార్కెట్ పెంచడం – ఇదీ ఈ దుష్ప్రచారం వెనుకున్న ప్రధాన లక్ష్యం.

తెలంగాణ ఉద్యమకారులు సదా అప్రమత్తంగా ఉండాలని ఈ ఉదంతం మరోసారి గుర్తుచేస్తోంది.

ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలపై మౌనం వహిస్తున్న సీమాంధ్ర మీడియాకు మా సూటి ప్రశ్న ఇక్కడ చదవండి: ఇప్పుడు తలకాయలెక్కడ పెట్టుకుంటారు సీమాంధ్ర గోబెల్సూ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *