mt_logo

సీమాంధ్ర ఆందోళనల్లో తారాస్థాయికి చేరిన విభేధాలు

 

ఒక లక్ష్యంగానీ, సరైన నాయకత్వం గానీ లేకుండా సీమాంధ్ర ప్రాంతంలో నడుస్తున్న తెలంగాణ వ్యతిరేక ఆందోళనల్లో రోజురోజుకూ గొడవలు ముదురుతున్నాయి. సీమాంధ్ర ప్రజల్లో లేని భయాలను సృష్టించి వారిని రోడ్డెక్కించిన వివిధ పార్టీల, వర్గాల నాయకులు ఈ ఉద్యమంలో తమదే పైచేయి అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుండటంలో వారి మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి.

ఆందోళనల్లో రాజకీయ పార్టీల స్వార్ధం ఎట్లా ఉందో నిన్న విజయవాడ కేంద్రంగా తెదేపా, కాంగ్రెస్ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణ కళ్లకు కట్టింది. నిన్న విజయవాడలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెలంపల్లి, తెదేపా నేత కేశినేని నాని వర్గీయులు బాహాబాహీకి దిగి ఒకరిమీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. ర్యాలీకి హాజరైన సామన్య ప్రజలు ఈ రెండు పార్టీ నేతల వైఖరి చూసి ముక్కున వేలేసుకున్నారు.

ఫొటో: కదిరిలో వైకాపా కార్యకర్తల ఘర్షణ

శుక్రవారం నాడు  అనంతపురం జిల్లా కదిరిలో వైకాపా నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షా శిబిరంలో మండల కన్వీనర్ లోకేశ్వర రెడ్డి, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు రాజశేఖర రెడ్డి తన్నుకున్నారు. రెండు వర్గాలూ ఒకరినొకరు చొక్కాలు చిరిగేటట్టు కొట్టుకున్నారు.

గతవారం విజయనగరంలో సోనియా దిష్టి బొమను దగ్ధం చేయడానికి కొంతమంది ప్రయత్నించగా వారిని అడ్డుకున్న బొత్స సత్యనారాయణ వర్గీయులు వారిపై దాడికి దిగారు

కోస్తాలోని అనేక జిల్లాల్లో చిరంజీవికి వ్యతిరేకంగా కొంతమంది ఫ్లెక్సీలు వేస్తుండటం చిరంజీవి అభిమానుల సంఘాల వారు ఆ ఫ్లెక్సీలను చించివేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనల వల్ల పవన్ కల్యాణ్ సినిమా విడుదల ఆలస్యం అవుతుండటంతో కూడా ఆ హీరో అభిమాన సంఘాల వాళ్లు గుర్రుగా ఉన్నారు.

ఇక ఉద్యమంలో కులాల కుంపట్లు కూడా రగులుతున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఉప్పు-నిప్పుల్లా ఉండే రెండు ప్రధాన సామాజికవర్గాల మధ్య ఉన్న విభేధాలు ఈ ఆందోళనల్లో స్పష్టంగా కనపడుతున్నాయి.

ఇక 12 నుండి జరగనున్న ఉద్యోగుల సమ్మెలో పాల్గొనడానికి ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ అయిన ఎంప్లాయీస్ యూనియన్ (ఈయు) నాయకులు అనేక సీమాంధ్ర జిల్లాల్లో విముఖత ప్రదర్శిస్తున్నారు.

ఇక ప్రభుత్వ ఉద్యగస్తుల్లో అతిపెద్ద వర్గం అయిన ఉపాధ్యాయ సంఘాలు కూడా సమ్మెలో పాల్గొనడానికి వ్యతిరేకంగా ఉన్నారు.

సీమాంధ్రలోని మొత్తం పదమూడు జిల్లాల్లో కేవలం నాలుగు జిల్లాల్లోనే ఈ ఆందోళనలు కొంచెం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండగా అక్కడకూడా తెదేపా, కాంగ్రెస్, వైకాపాలు తమతమ వ్యక్తిగత ఎజెండాతో ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు కారణం మీ నాయకుడంటే, కాదు మీ నాయకుడే నంటూ ఒకరిమీద ఒకరు ఆరోపణలు గుప్పించుకోవడంలో నేతలు మునిగిపోవడంతో  ప్రజలు క్రమంగా ఈ ఆందోళనకు దూరం అవుతున్నారు. ఈ నాయకులు, పార్టీల లక్ష్యం సమైక్యాంధ్ర కాదని, ఆ పేరుతో వచ్చే ఎన్నికల్లో తమ పదవులు నిలబెట్టుకోవడం కొరకే ఈ డ్రామా అని సీమాంధ్రలో ప్రజలు బాహాటంగానే వ్యాఖ్యానించుకోవడం కొసమెరుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *