హైదరాబాద్‌లో విత్తన ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వ సీడ్స్ విభాగం జాయింట్ సెక్రటరీ నాదెండ్ల విజయలక్ష్మి పేర్కొన్నారు. విత్తనాభివృద్ధికి, విత్తనోత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి బాగుందని ప్రశంసించారు. మంగళవారం ఆమె హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విత్తనోత్పత్తి సంస్థల అధికారులతో విత్తనాభివృద్ధి, ఎగుమతులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విత్తనోత్పత్తికి తెలంగాణలో అత్యంత అనుకూలమైన వాతావరణం ఉన్నదని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ విత్తన ధ్రువీకరణ ద్వారా దేశంలోనే తొలిసారిగా విత్తన ఎగుమతులు చేసిన రాష్ట్రం తెలంగాణ అని అభినందించారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ బలోపేతానికి సహకరిస్తామని, విత్తన పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించడంలో చేసిన కృషిని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కే కేశవులు వివరించారు. ప్రైవేట్ కంపెనీలకు దీటుగా విత్తనోత్పత్తి సామర్థ్యాన్ని 6 లక్షల క్వింటాళ్లకు పెంచినట్టు వివరించారు. అనంతరం విత్తన ధ్రువీకరణ సంస్థ రాజేంద్రనగర్‌లో నిర్మించిన అత్యాధునిక అంతర్జాతీయ స్థాయి విత్తన పరీక్షల ల్యాబ్‌ను ఆమె సందర్శించారు. సమావేశంలో టీఎస్‌ఎస్డీసీ చైర్మన్, తదితరులు పాల్గొన్నారు.