ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు గత బడ్జెట్ లో కేటాయించిన నిధుల వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. మరో రెండు రోజుల్లో 2014-15 ఆర్ధికసంవత్సరం ముగిసిపోతుండటంతో, ఆయా సంస్థలకు విడుదల చేసిన నిధులు మురిగిపోకుండా జూన్ 30 వరకు ప్రభుత్వం గడువు పెంచింది. దీంతో దాదాపు 2.5 లక్షల మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీ రుణాల మంజూరుకు అవకాశం లభించినట్లయ్యింది.
ప్రభుత్వం గడువు పెంచడంతో లబ్ధిదారుల నుండి దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 15 వరకు గడువుగా నిర్ణయం తీసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను మే 15 లోగా పరిశీలించనున్నారు. అర్హులైన వారు స్వయంగా ఎంపీడీవోలకు దరఖాస్తు చేసుకోవాలని, అదే సమయంలో కుల, ఆదాయ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు ప్రతులను సమర్పించాలని అధికారులు సూచించారు.