mt_logo

రేవంత్‌కు మరోసారి మొట్టికాయలు వేసిన సుప్రీం కోర్టు!

తన నోటి దురుసు కారణంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యే సుప్రీం కోర్టు చేతిలో చీవాట్లు తిన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కొన్ని రోజుల క్రితం తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కామెంట్స్‌పై సుప్రీం కోర్టు జడ్జీలు ఈ స్థాయిలో వ్యాఖ్యానించడం గతంలో ఎన్నడూ జరగలేదు.

అయితే.. సుప్రీం కోర్టు కామెంట్స్‌కు ఖంగుతిన్న రేవంత్.. కవిత బెయిల్ గురించి తాను చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పారు. రేవంత్ క్షమాపణను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు ఏవైనా వ్యాఖ్యలు, విమర్శలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని చురకలు అంటించింది.

లెజిస్లేచర్, ఎగ్జిక్యూటీవ్, న్యాయ వ్యవస్థ తమ తమ పరిధిలో రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాలని కోరింది. అనవసరమైన వ్యాఖ్యలు రాద్దాంతాలకు దారితీస్తాయి అని పేర్కొంది.

ఒక బాధ్యతగల పదవిలో ఉండి సుప్రీం తీరుపై చౌకబారు వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఒక సీఎం ఇలా దిగజారి మాట్లాడటం ఏంటని పలువురు విస్మయం వ్యక్తం చేశారు.

కవిత బెయిల్‌పై తెలంగాణ కాంగ్రెస్ అధికారిక వాట్సాప్ ఛానల్‌లో చేసిన దుష్ప్రచారానికి కూడా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి, బాధ్యత లేకుండా మాజీ సీఎం, మాజీ మంత్రులను రేవంత్ రెడ్డి దుర్భాషలాడుతున్న తీరు ప్రజలు గమనిస్తున్న నేపథ్యంలో.. సుప్రీం కోర్టు వేసిన అక్షింతల వల్ల రేవంత్ పరువు మరోసారి మూసీలో కలిసింది.