mt_logo

తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం పోరాడిన నేత కొండా లక్ష్మణ్ బాపూజీ: కేసీఆర్

తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తన జీవితకాలం పోరాడిన తొలితరం నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.

తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన బాపూజీ స్ఫూర్తి తాను సాగించిన చివరిదశ రాష్ట్ర సాధన పోరాటంలో ఇమిడివున్నదన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు.

తెలంగాణ కోసం తాను బయలుదేరిననాడు నాటి ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వాల వత్తిడికి తలొగ్గకుండా బాపూజీ తన జలదృశ్యం నివాసాన్ని ఉద్యమ వేదికగా నిలపడం తన తెలంగాణ పోరాట ప్రస్థానంలో మరిచిపోలేనిదని కేసీఆర్ అన్నారు.

బాపూజీ ప్రదర్శించిన నిక్కచ్చితనం, నిరాడంబరత లక్ష్య సాధనకోసం తాను  కనబరిచిన పట్టుదల తననెంతో ప్రభావితం చేశాయని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.

న్యాయవాదిగా, రాజనీతిజ్ఞుడుగా స్వాతంత్రోద్యమకాలం నుంచి రాష్ట్ర సాధన చివరిదశ దాకా బాపూజీ చేసిన కృషిని రేపటి తరాలకు అందించే దిశగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి స్మారకార్థం పలు కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. 

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కొనసాగిన బీఆర్ఎస్ పదేండ్ల ప్రగతి పాలనలో కొండా లక్ష్మణ్ బాపూజీ అశయాలు ఇమిడివున్నాయని కేసీఆర్ తెలిపారు.