mt_logo

మేకతోకకు మేక..!

By: సవాల్ రెడ్డి..

పాయింట్ బ్లాంక్

మేకతోకకు మేక… తోకమేకకు తోక… మేకతోకా మేక.. తోకమేకా మేక తోకకుమేక… తోకమేకకు తోక.. మేకతోకా మేక… మేకతోకా వెనకటికి రాయలవారి ఆస్థానంలో జరిగిన పాండిత్యపరీక్షలో తెనాలి రామకృష్ణుడు ఈ పద్యం చాంతాడంత పెద్దగా ఆరునొక్కరాగంలో అందుకునే సరికి ఇందులో ఏదో పెద్ద గూఢార్థమే ఉందనుకుని సభలోని పండితులంతా తలలూపేశారట. దర్బారు ముగిశాక రాయలవారు నాకూ అర్థం కాలేదు.. ఇంతకూ ఇందులో అర్థమేమిటి అని అడిగితే ఏముంది ప్రభూ! మేక.. మేకకు తోక. మెమ్మెమ్మే అని నవ్వేశాడట రామకృష్ణుడు. సరిగ్గా సెక్షన్ 8 మీద అటార్నీ జనరల్ లేఖ మీద పరిస్థితీ ఇంతే అయ్యింది. అదేదో బ్రహ్మపదార్థమని భ్రమించి రాధాకృష్ణ వారం రోజులపాటు నానా హంగామా చేశాడు. అయిపోయింది.. ఇక హైదరాబాద్‌లో గవర్నర్ పాలనే అని గంతులేశాడు.

ఏపీ పోలీసులకు జ్యురిస్‌డిక్షన్ ఇచ్చేసినట్టు, వారి పోలీస్‌స్టేషన్లు కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట దాకా పెట్టేసినట్టు కలలుగన్నాడు. గవర్నర్‌ను పోకిరీ ఇన్‌స్పెక్టర్‌ను చేస్తూ ఫోటోలు, మార్ఫింగులు అవీ చేసి మురిసిపోయాడు. కేసీఆర్ ఎత్తుకు చంద్రబాబు పైఎత్తు వేశాడని సర్టిఫికెట్లు ఇచ్చేశాడు. ఢిల్లీనుంచి గవర్నర్‌కు పిలుపురాగానే డాండడ డాండ డాండ నినదంబుల జాండము నిండ అని తలపించేలా ఇటు పత్రికను, అటు చానెల్‌ను హోరెత్తించాడు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి విభజన చట్టం పుస్తకాలతో సమావేశానికి వెళ్లాడోచ్ అంటూ ఉరకలేశాడు. గవర్నర్ వెళ్లనూ వెళ్లారు.. రానూ వచ్చారు. అప్పటిదాకా హోరెత్తిన బాబుగ్యాంగ్ మీడియా హఠాత్తుగా సైలెంటైపోయింది. సెక్షన్ 8 ఎటు పోయిందో.. అటార్నీ లేఖ ఏమైందో ఎవరికీ తెలియదు. మొత్తానికి వ్యవహారం రామకృష్ణుడి మేకతోకకు తోక పద్యంలాగా అయిపోయింది. మెకము అనుకుంటే మేకతోక వెక్కిరించింది.

అన్నట్టు మేకను ఉర్దూలో బక్రా అని పిలుస్తారనుకుంటా! ఆఖరుకు కాళ్లబేరం..సరే.. జాతకంలో మేషయోగాసన ప్రాప్తం ఉంటే ఎవరుమాత్రం ఏం చేస్తారు గానీ.. ఎట్టకేలకు రాధాకృష్ణకు సెక్షన్ 8 మీద ప్రాప్తకాలజ్ఞత ఆవహించడం మాత్రం విశేషమే. అందుకే కొత్తపలుకులో కొత్త మాటలు చెప్పాడు. మూడు నెలల సాము చేసి మూలనున్న ముసలమ్మను పొడిచాడన్నట్టు.. సెక్షన్ 8మీద అంత హంగామా చేసి ఆఖరుకు అసలు ఒక రాష్ట్ర భూభాగంలో మరో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలనుకోవడమే తప్పు అని ఒప్పేసుకున్నాడు. హైదరాబాద్ తెలంగాణ రాజధాని అయినప్పుడు సెక్షన్ 8 పెట్టడమూ తప్పేనని అంగీకరించాడు. అంతేకాదు ఈ సెక్షన్ 8 న్యాయపరీక్షకు కూడా నిలబడదని బల్లగుద్ది మరీ చెప్పాడు. తప్పంతా యూపీఏ ప్రభుత్వం మీద తోసిపారేశారు. అయితే ఈ చట్టం అమలుకు సహకరించాలని కాళ్లబేరానికి వచ్చారు.

వద్దనే అనుకుంటే చట్టం చేసినపుడే తెలంగాణవారు అభ్యంతరం చెప్పాల్సిందని నిష్టురపడ్డారు. చట్టం చేశాక అందులో కొన్ని భాగాలు చెల్లవని చెప్పడమేమిటని అడిగారు. అయితే చట్టం చిత్తుప్రతి దశలోనే 2014 డిసెంబర్‌లోనే కేసీఆర్ రాష్ట్రపతికి చట్టంలోని ఐదు అంశాలపై తన అభ్యంతరాలు తెలుపుతూ లేఖ రాశారు. అసెంబ్లీ చర్చల్లో టీఆర్‌ఎస్ సభ్యులు వీటిని ఎత్తిచూపారు. ఎటొచ్చీ పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీల పెప్పర్‌స్ప్రేల వంటి దారుణ చర్యల కారణంగా చర్చకు అవకాశం లేకుండా పోయింది. రాజ్యసభకు వచ్చేసరికి తిట్టనుపోరా.. అన్నట్టుగా ఎదురైన వెంకయ్యనాయుడు విపరీత ప్రవర్తన దానికి తోడై గండం గడిస్తే చాలు అనుకునే పరిస్థితి వచ్చింది. తప్పేమైనా ఉంటే అది సీమాంధ్రులదే తప్ప తెలంగాణది కాదు. అయినా విభజన చట్టాన్ని అంత భగవద్గీతగా పరిగణించేట్టే అయితే రాష్ట్రం ఏర్పడకముందే చట్టానికి భిన్నంగా పోలవరం మండలాలు కలుపుకున్నట్టు ఈ బుద్ధి ఏమైంది?

భరోసాను భగ్నం చేస్తున్నదెవరు?..
ఆ విషయాలు అలా పెడితే హైదరాబాద్ సీమాంధ్రుల్లో ఏదో అభద్రతాభావం ఉన్నట్టు రాధాకృష్ణ రాసుకొచ్చాడు. గడిచిన ఏడాది కాలంగా నగరంలో చిన్న సంఘటన జరగక పోయినా ప్రభుత్వం వారిలో భరోసా కల్పించడం లేదని బురద చల్లాడు. అపోహలు పెరిగాయని, అభద్రతాభావం పెరిగిందని ఆకుకు పోకకు అందని పోలికలతో వాదనకు దిగాడు. చివరికి న్యాయవ్యవస్థలో కూడా ప్రాంతాలు చూస్తున్నారని వాపోయాడు. అదేనోటితో పోలీస్‌స్టేషన్లలో సీమాంధ్రులను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించాడు. రాధాకృష్ణ చెప్పదలుచుకున్నదేమిటి? చంద్రబాబు అక్రమ నిర్మాణాన్ని ఆపితే సీమాంధ్రుల మనసు గాయపడుతుంది. అక్రమంగా ఇక్కడ చేరిన ఉద్యోగులను వెళ్లిపొమ్మంటే అదీ పక్కనే ఉన్న ఆంధ్ర ఆఫీసుల్లోకి వెళ్లమన్నా బాధపడతారు. కాబట్టి చెవుల్లో పూలు పెట్టుకుని అన్ని అక్రమాలు భరించాలి.

పైరవీలు చేసి వచ్చిన హెచ్‌వోడీలను వద్దని అనకూడదు. అలాగే భరిస్తూ ఉండాలి. అపుడు ఎవరి మనసులు గాయపడవు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. రాధాకృష్ణ సీమాంధ్ర మనసులు చదువుతాడు.. గుర్తిస్తాడు తప్ప..తెలంగాణ వారికి మనసులుంటాయని అవి కూడా గాయపడతాయని మాత్రం గుర్తించడు. న్యాయంగా తమకు రావల్సిన ప్రమోషన్లను కొట్టేసివాడు కండ్లముందు ఇంకా ఉంటే… అధికారం చెలాయిస్తుంటే తెలంగాణవాడికి కడుపుమండదు.. అంతకు ముందెప్పుడో కూడా రాశాడు..

సీమాంధ్రకు చెందినవాళ్లు తెగభయపడి పోతున్నారని, ఓ సీమాంధ్రుడి ఇంటిని ఆక్రమించుకుంటానని ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న తెలంగాణ వ్యక్తి బెదిరిస్తున్నాడంటూ తనవద్ద వాపోయాడని.. ఇపుడా ఇంటిని తెలంగాణవాడు ఆక్రమించుకున్నాడా? లేదా? సదరు సీమాంధ్రుడు మళ్లీ రాధాకృష్ణ దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడా లేదా అనేది రాధాకృష్ణ రాయలేదు కాబట్టి మనకు తెలియదు. కానీ అప్పుడు ఇప్పుడూ ఈ రాతలతో.. ఇలాంటి అనేక రాతలతో వారిలో భయాందోళనలు రేకెత్తించిన మాట మాత్రం అక్షరసత్యం.

ఎవరు ఎవర్ని మోశారు?
ఆఖరుకు రాధాకృష్ణ ఇచ్చే తీర్పు ఏమంటే ప్రతిదానికి ఆంధ్రా మీడియా అనడం వల్ల అపార్థాలు వస్తున్నాయట. పుష్కరకాలం క్రితం కేసీఆర్‌కు సొంత మీడియా లేనపుడు ఆంధ్రామీడియానే తెలంగాణ ఉద్యమాన్ని చెమటలు కక్కతూ మోసిందట. అపుడు మెచ్చుకున్నారట. ఇపుడు తిడుతున్నారట. మేమే కవరేజ్ ఇవ్వకపోతే ఉద్యమం ఎక్కడుండేది? అని రాధాకృష్ణ అనేక సందర్భాల్లో అన్నాడు కూడా. కాసేపు ఒప్పుకుందాం. మరి 1969 జై తెలంగాణ ఉద్యమం తర్వాత నుంచి 2001 దాకా తెలంగాణ వార్తలు తొక్కిపెట్టింది ఎవరు? ఇంద్రారెడ్డి ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని సమావేశాలు నిర్వహించుకున్నా ఒక్క ముక్కకూడా వేయకుండా నిర్దాక్షిణ్యంగా పక్కకు పెట్టేసింది ఏ మీడియా రాధాకృష్ణా? 1996-97 చంద్రబాబు హయాంలో తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీలు బాగారెడ్డి నేతృత్వంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం పెట్టి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఢిల్లీకి వెళ్తున్నామని గంటపాటు ప్రసంగాలు చేశారు.

తెల్లవారి ఏ ఒక్క పత్రికా ఒక్క ముక్కా ప్రచురించిన పాపాన పోలేదు. ఇవాళ మేం మద్దతు ఇచ్చాం.. మేం నిలబెట్టాం అంటున్న రాధాకృష్ణ తదతర ఆంధ్రా మీడియా తెలంగాణను ఉద్ధరించడానికి ఆ వార్తలు ఇచ్చాయా? మలిదశ ఉద్యమం ప్రారంభించిన నాడు ఉద్యమ వార్తలను ప్రజలకు అందించింది వార్త దినపత్రిక. జలదృశ్యం వార్తలను అప్పటి అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ఆంధ్రపత్రికలేవీ ప్రచురించలేదు. ఎప్పటిలాగే తొక్కేయాలని భావించాయి. అయితే వార్త అన్ని వార్తలను ప్రముఖంగా వేసింది. కరీంనగర్ సింహగర్జనలో ప్రజలంతా ఆంధ్రా పత్రికల బహిష్కరణను నినాదాలు చేయడం.. నిజామాబాద్ జిల్లాలో ఆంధ్రపత్రికలను తగులబెట్టడంతో చలనం వచ్చింది. తెలంగాణ వార్తలతో వార్త సర్క్యులేషన్ పెరిగిపోవడం, సీమాంధ్ర పత్రికలకు ఛీత్కారాలు ఎదురుకావడంతో తప్పనిసరై మనుగడకోసం వార్తల ప్రచురణ ప్రారంభించారు.

ఆనాడు టాప్‌లో ఉన్న ఈ టీవీ రేటింగులను దెబ్బ తీసేందుకు మిగిలిన చానెళ్లు తెలంగాణ చర్చలకు తెర తీశాయి. కొత్తగా పున:ప్రారంభమైన ఆంధ్రజ్యోతి అదే దారి తొక్కాల్సి వచ్చింది. పత్రికలో ఉన్న తెలంగాణవాదులు దానికి ఊతమిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో మీడియాకు సంబంధించి చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే అది వార్త దినపత్రికను. ఒత్తిడులన్నీ ఎదుర్కుని మద్దతు ఇచ్చిన సీమాంధ్రేతరుడైన గిరీష్ సంఘీని. ఆ ఒక్క పత్రిక ఆనాడు మద్దతు ఇవ్వకుండా ఉండిఉంటే సీమాంధ్ర పత్రికలన్నీ కలిసి ఉద్యమాన్ని శిశువుగా ఉన్నపుడే ఉసురు తీసేవి. మా కృషికి శ్రీకృష్ణ కమిటీ సర్టిఫికెట్ ఇచ్చిందని కూడా రాధాకృష్ణ చెప్పుకున్నారు. అయితే కమిటీ చెప్పింది ఎడిటర్ గురించి.. రాధాకృష్ణ గురించి కాదు. మీ మనుగడ కోసం మీ ఆదాయం కోసం వార్తలు వేసి మేమే నిలబెట్టామని చెప్పడం బండి కింద నడిచే శునకం తానే బండిని లాగుతున్నానని చెప్పుకోవడమే!

కొసమెరుపు..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడికి ఒక చిత్రమైన సందేహం వచ్చింది. టీ న్యూస్‌కు నోటీసులిస్తే గగ్గోలు పెడుతున్నవారు గతంలో ఏబీఎన్‌పై నిషేధం విధిస్తే ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు ఓ సభలో. వంధిమాగధులు చప్పట్లు చరిచారు. టీవీ 9, ఏబీఎన్‌మీద బహిష్కరణకు కారణం తెలంగాణ ఎమ్మెల్యేలను అవమాన పరచడం. తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక వైఖరి. అందువల్ల దాన్ని సమర్థించారు. టీన్యూస్‌కు నోటీసుకు నిరసనకు కారణం దొంగతనం బయటపెట్టడం. రెంటికీ సాపత్యం లేదు. అక్కడా ఇక్కడా తెలంగాణ కోసమే రెండు వైఖరులు తీసుకున్నారు. సరే.. ఎన్నడూ తెలంగాణ అనని వారికి ఇవి అర్థం కావడం కష్టమే. ఇక్కడ గమనార్హమైన విషయం ఏమంటే.. రెండు టీవీ చానెళ్లపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ తీర్మానించిన రోజున సదరు ఉత్తమ్‌కుమార్ సతీసమేతంగా అసెంబ్లీలో ఉండి మద్దతు పలికారు. పాపం అది మరిచిపోయినట్టున్నారు!

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *