By: సవాల్‌రెడ్డి
-ఊర్జితం సజ్జనం దృష్ట్యా.. ద్వేష్టి నీచ: పున: పున:
-అంటే సజ్జనుడి వృద్ధిని చూసి దుష్టుడు మరీ మరీ ద్వేషిస్తాడు.
మీకు తెలుసా? తెలంగాణ సీఎం కేసీఆర్ రాధాకృష్ణను చూసి భయపడుతున్నారు. (తనను మరీ తక్కువ చేసినందుకు చంద్రబాబు క్షమించాలి).. కేసీఆర్ బాబును కాదు.. రాధాకృష్ణనే తన ప్రత్యర్థిగా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పనిచేసే, పనిచేయని అధ్యక్షులు ఇద్దరు కూడా క్షమించాలి. వాళ్లను కేసీఆర్ లెక్కలోకే తీసుకోవడం లేదు. అస్సలు ఈ భూమ్మీద ఆర్కే ఒక్కడే తనకు సమఉజ్జీ అని డిసైడై పోయారు. ఎంత భయం అంటే ఆర్కేమీద కేసీఆర్ విషప్రచారం అదీ చేస్తుంటారు. లేకపోతే తెల్లారి ఆయన సీఎం పోస్టుకు ఈయన పోటీ అయిపోడూ?! చిటికేస్తే లక్షల జనాన్ని తరలించగల మహామహా మేధావులతో ఆయన ప్రత్యామ్నాయ వేదికలు అవీ సృష్టించేయడూ? అందుకే ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్‌గల ఆస్తమా చానెల్‌ను నిషేధించారు. అయినా సరే ప్రజలు ఈయన గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఈయన పత్రికను ఎగబడి కొనేసి దేశంలో అత్యధిక సర్క్యులేషన్ గల పత్రికగా మార్చేశారు.
విజ్ఞాన విపంచి..
ఏమైనా తెలుగుభాష వచ్చిన వాళ్లు అపుడపుడూ రాధాకృష్ణుల వారి కొత్త పలుకు చదువుతూ ఉండాలి. గ్రూప్ వన్, టూ అవీ రాబోతున్నాయి. దానికి అటెండయ్యే వాళ్లు కూడా గూగుల్ అవీ వెతకడానికి బదులు ఓసారి కొత్తపలుకు చదివితే సమస్త విజ్ఞానం వచ్చేసినట్టే. తాజా కొత్త పలుకే చూడండి. ఎంతగొప్ప సమాచారం? మనమంతా కేసీఆర్ టీఆర్‌ఎస్ పెట్టిన తర్వాత నరేంద్ర టీఎస్‌ఎస్ తెలంగాణ సాధన సమితి ప్రారంభించారని భ్రమపడుతుంటాం. కానీ అది నిజం కాదుట. నరేంద్ర టీఎస్‌ఎస్ పెట్టాకే కేసీఆర్ టీఆర్‌ఎస్ ప్రారంభించారుట. అర్జంటుగా చరిత్రకారులు తమ పుస్తకాల్లో ఈ మేరకు మార్పులు చేసుకోవాలి.
దురాశ..దుఖ్ఖమూ!
అపృష్టోపి శుభం బ్రూయా దపృష్టోపి హితం వదేత్ అన్నారు పెద్దలు. అంటే అడగకపోయిన మంగళవాక్యాలు, హితవచనాలు పలకాలి. అమంగళం పలుకరాదు. తెలుగు వాళ్లు, తెలుగు జాతి అని నిన్నటిదాకా గొంతులు జీరపోయేలా నినాదాలు చేసిన వాళ్లు ఇవాళ ఏం చేస్తున్నారు. ఆరు దశాబ్దాల కుట్రలతో ఎండిపోయిన తెలంగాణలోని పాలమూరుకు భారీ నీటి పథకం శంకుస్థాపనకు వెళుతున్న రోజున కళ్లు మూసుకుపోయిన ఓ ఏపీ మంత్రి ఏం వ్యాఖ్యలు చేస్తున్నాడు? ఏ శుభం పలుకుతున్నాడు? మొత్తిన అమ్మ మంచిదే గానీ మొత్తుకున్నమ్మదే తప్పు అన్నట్టు.. ఏపీ మంత్రి పొగరుగా చేసిన వ్యాఖ్య రాధాకృష్ణకు బాగుంది కానీ.. కడుపుమండి కేసీఆర్ మాట్లాడిన భాష మాత్రం అభ్యంతరకరంగా కనిపించింది. వాస్తవానికి సదరు పథకం రూపకల్పన చాలా రోజులుగా జరుగుతున్నది.
అనేక ప్రతిపాదనలు పరిశీలించడం సమీక్షించడం మార్చడం జరుగుతూ వస్తున్నది…మధ్యలో సదరు మంత్రి ఏనాడూ మాట్లాడినట్టు లేదు. కానీ శుభమా అని శంకుస్థాపనకు వెళ్తున్న రోజే ఎందుకు మాట్లాడాలి? ఎందుకంటే శంకుస్థాపన రోజే ప్రజల్లో అనుమాన బీజం నాటాలి. ఏపీ అభ్యంతరం చెప్పింది కాబట్టి ఈ పథకం నిర్మాణమవుతుందా? అనే శంక ప్రజల్లో కలగాలి. తద్వారా పాలమూరు పథకం ద్వారా ప్రభుత్వానికి, కేసీఆర్‌కు రావల్సిన క్రెడిట్ రాకుండా అడ్డుకోవాలి. ఇదీ పచ్చగ్యాంగ్ ఆలోచన. అయితే కేసీఆర్ ఈ చిల్లర ఎత్తుగడలకు పడిపోయేవాడు కాదు.
అందుకే అనుమానాలకు ఆవగింజంత అవకాశం కూడా ఇవ్వలేనంత తీవ్రంగా స్పందించారు. పాలమూరే కాదు.. నక్కలగండి, ఆర్డీఎస్‌తో పాటు సోమసముద్రం కూడా కడతాను దిక్కున్నచోట చెప్పుకోమన్నారు. తెలంగాణ ప్రజలకు ఏ భాషలో.. ఏ స్థాయిలో.. భరోసా ఇవ్వాలో ఆ భాషలో ఆ స్వరంతో ఇచ్చారు. వారి అనుమానాలు పటాపంచలు చేశారు. దుష్ట ఆలోచనతో చేసే పని దుఖ్ఖంతో అంతమవుతుందనేది పెద్దల మాట. ఇవాళ అదే జరిగింది. పచ్చగ్యాంగు కుట్ర ఎదురుతన్నింది. టీటీడీపీ నేతలు మింగాలేక కక్కాలేక సతమతమవుతున్నారు.
వివేక భ్రష్టత్వం…
అత్యున్నత పదారూఢ: పూజ్యాన్నై వాపమానయేత్.. అన్నారు. అంటే ఎంత ఉన్నత పీఠం ఎక్కినా సరే. పెద్దలు ఎపుడూ పూజ్యనీయులే.. వారిని తిరస్కరించరాదు. ఇది ఈ దేశ సంస్కారం. ఇవాళ సూరత్ నుంచి వచ్చినా..ముంబై నుంచి వచ్చినా.. గల్ఫ్‌నుంచి ఆగమేఘాల మీద వచ్చి టాక్సీలో ఇంటి ముందు దిగినా కొడుకులు ముందు తల్లి దండ్రులకు పాదాభివందనం చేస్తారు. దసరా పండుగ రోజున జమ్మిఆకుతో వెళ్లి పెద్దలు, గురువులు, పురోహితులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇది తెలంగాణ సంప్రదాయం. కానీ రాధాకృష్ణకు కేసీఆర్ పాదాభివందనాల్లో ఎత్తుగడలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని ఆంధ్ర పారాల్లో పెరిగిన ఈ సీమాంధ్రుడు దొరలు బ్రాహ్మణులకే పాదాభివందనాలు చేస్తాడని చెప్తున్నాడు. పెద్దలను గౌరవించడం కేసీఆర్‌కు కొత్తగా వచ్చిందేమీ కాదు.
అలాగే ఆయన కేవలం బ్రాహ్మణులకే పరిమితమూ కాలేదు. ప్రొఫెసర్ జయశంకర్ నుంచి బీజేపీ సన్యాసిని ఉమాభారతి దాకా అన్ని కులాల వారికి వారివారి ఔన్నత్యాన్ని బట్టి గౌరవం ఇస్తూనే ఉన్నారు. అయినా రాధాకృష్ణకు ఒక్క బ్రాహ్మణులే కనిపించారు. సహజమే.. పచ్చమూకల బ్రాహ్మణ వ్యతిరేకత ఇవాళ కొత్త కాదు. పత్రికలకు రాత నేర్పింది బ్రాహ్మణులు. పద్యాలు ఆలపించే వీధినాటకాలనుంచి సినిమాల దాకా నటన నేర్పింది బ్రాహ్మణులు. ఉద్యోగాలు, వృత్తులు వదులుకుని స్వతంత్ర పోరాట రాజకీయాల్లో కాంగ్రెస్ జెండా ఎత్తుకున్నది బ్రాహ్మణులే. ఆ మూడు రంగాలు ఆక్రమించి వారిని తరిమివేసిన పచ్చమూక ఎన్టీఆర్ హయాంలో ఉన్నతోద్యోగాలనుంచి కూడా తప్పించింది.
అంతటితో ఆగకుండా కరణాల రూపంలో తమకు నలుసుగా ఉన్నారని గ్రామాధికారుల వ్యవస్థను రద్దు చేసింది. తమ పత్రికల ద్వారా, సినిమాల ద్వారా ఇవాల్టికీ వారిని వెంటాడుతూ అవమానపరుస్తూనే వస్తున్నది. దాని కొనసాగింపే ఇవాళ రాధాకృష్ణ వక్రభాష్యాల్లో ప్రతిఫలించింది. ఒకనాడు పచ్చపార్టీ స్థాపకుడు కుచ్చిళ్లు ఎత్తిపట్టుకుని మరీ పాదాభివందనాలు చేయించుకుని.. చేసిన వారికే అవకాశాలు ఇచ్చి ఉండవచ్చుగాక.. అంతా అలాగే ఉంటారంటే భ్రమే. పాదాభివందనాలకే పడిపోవడానికి నరసింహన్ మామూలు బ్రాహ్మణుడు కాదు..మాజీ పోలీసు అధికారి కూడా.
ఎన్నికలకు దమ్ముందా?
కొత్తపలుకులో రాధాకృష్ణ గొప్ప జోకేశాడు. తాజా వివాదాల వల్ల ఏపీలో చంద్రబాబు బలపడ్డాడట. ప్రజల మధ్య మాత్రం అంతరం ఏర్పడిందట. కేసీఆర్ ఏసీబీ ట్రాప్‌వేస్తే చంద్రబాబు పైఎత్తు వేసి ఏపీ ప్రజల్లో సెంటిమెంటు రగిల్చాడట. మోకాలికి బొడిగుండుకు ముడి పెట్టడం అంటే ఇదే. పట్టపగలు దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయి ఢిల్లీలో పొర్లుదండాలు పెడుతున్న బాబును ఇంకా గడకొయ్యలు పెట్టి ఎత్తిపట్టేందుకు పాపం రాధాకృష్ణ చెమటలు కక్కుతూనే ఉన్నాడు. ఏపీ ప్రజల్లో తెలంగాణ వ్యతిరేకత ఉండవచ్చు గాక. దానికి ఈ దొంగల ముఠా బాగోతానికి ఏం సంబంధం? వారెందుకు సమర్థిస్తారు? ఇప్పటికే చంద్రబాబు ప్రతిష్ట అక్కడ పాతాళానికి దిగజారిందని, బాస్ చేసిన ఘనకార్యానికి ప్రజలకు జవాబు చెప్పుకోలేక పచ్చపార్టీ నేతలు ఇండ్లు వదిలి రావడం లేదని పుంఖానుపుంఖాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
అయినా అన్నింటిని కప్పిపెట్టాలనే సీమాంధ్ర మీడియా ట్యాపింగ్ అంటూ ఏడుపు లంకించుకుంటున్నది. ఢిల్లీలో రాజ్‌దీప్ చేసిన ఇంటర్వ్యూలో నా ఫోన్ కాదు.. మా అధికారుల ఫోన్లు ట్యాప్ చేశారు అంటూ బాబు మాట మార్చడం ట్యాపింగ్ వాదనల్లో ఉన్న బలమెంతో బయటపెట్టాయి. పోనీ రాధాకృష్ణ వాదన ప్రకారం ఏపీలో సెంటిమెంటు పొంగిపొర్లి ఉంటే… కేసీఆర్ ఈ క్షణాన ఎన్నికలకు పోయినా తిరిగి అధికారంలోకి రాగల ధీమా ఉంది. ఆ సాహసం చంద్రబాబుకు ఉందా?
బాస్‌లకే దిక్కు లేదు..ఎస్ బాస్‌ల లెక్కెంత?
మూల విగ్రహాలు ముష్టెత్తుకుంటుంటే వుత్సవ విగ్రహాలు దధ్యోదనం అడిగాయట.. ఓ వైపు నోటుకు ఓటు కేసులో ఇరుక్కుని ఢిల్లీకి హైదరాబాద్‌కు బాబులు పొర్లుదండాలు పెడుతుంటే ఎపుడు బొక్కలో తోస్తారోనని వణికి ఛస్తుంటే.. బాస్‌లే భవిష్యత్తు తెలియక జుట్టు పీక్కుంటుంటే ఈ ఎస్‌బాస్ ఎగిరిపడుతున్నాడు. ప్రజల మద్దతు అని చెప్పుకునే ఈ ఎస్‌బాస్‌గారికి తన స్థాయి ఏమిటో తెలిసినట్టు లేదు. ప్రజల మనోభిప్రాయాలకు పత్రికలే కాదు.. సోషల్ మీడియా కూడా అద్దం వంటిదే. ఇవాళ సదరు సోషల్ మీడియాలో రాధాకృష్ణ రాతలమీద కనిపించిన నాలుగు వాక్యాలివి.
నీ పుట్టుక మొత్తం మాకు ఎర్కే.. సహాయం తీసుకుని తొక్కేసిన వాళ్ల జాబితా..అప్పులు తీసుకుని ఎగనామం పెట్టిన వాళ్ల జాబితా.. పెట్టుబడులు పెట్టించుకుని గెంటేసిన వాళ్ల జాబితా.. ఆడేసుకుని వాడేసుకుని వదిలేసిన వాళ్ల జాబితా..రాసుకుంటూ పోతే పత్రిక సరిపోదు!
ఇదీ ప్రజాభిప్రాయం.. చాలా..!!