By: సవాల్‌రెడ్డి
కన్నేల పోయెనోయి కనకలింగమా అంటే చేసుకున్న కర్మమోయి శంభులింగమా అన్నాడట.. ఇవాళ రాధాకృష్ణది అదే పరిస్థితి. ఏదో ఒకటి రాయడం.. రివర్సై తల పట్టుకోవడం. తెలంగాణ మీద బురద చల్లాలనుకుంటాడు. కానీ అది ఆయన నెత్తినే పడుతుంది. మహర్జాతకుడు.. ఏది కాకూడదని రాస్తాడో సరిగ్గా అదే సాక్షాత్కారమవుతుంది. తెలంగాణ రాకుండా ఆపాలనుకున్నాడు. వచ్చింది. ఇక్కడన్నీ ఆంధ్రవాళ్ల పరిశ్రమలే.. ఇక వెళ్లి పోయినట్టే అన్నాడు. ఒక్కటీ కదల్లేదు. ఫార్మా పరిశ్రమలు కర్ణాటకకు తరలి పోతున్నాయోచ్ అని గంతులేశాడు. రివర్సయింది.
కరెంటు కోతలతో తెలంగాణ ఖతం అన్నాడు. కానీ కోతలే ఖతమైనయి. ఆసరా మీద.. రేషన్ కార్డుల మీద చివరికి నిన్నటి ఆర్టీసీ సమ్మె మీద కుడిచేత్తో ఎడం చేత్తో భవిష్యవాణి రాస్తూనే ఉన్నాడు. అన్నీ సుఖాంతమయ్యాయి. ఆకలి రుచి ఎరుగదు.. ఆర్తి సభ్యత ఎరుగదు. రాధాకృష్ణకు తాజాగా రవీంద్రభారతిలో రాధారెడ్డి, రాజారెడ్డి దంపతుల నాట్య ప్రదర్శన అంశం దొరికింది. కూచిపూడి నాట్యకళలో ప్రపంచఖ్యాతిగాంచిన రాధా రాజారెడ్డి దంపతులకు రవీంద్రభారతిలో ప్రదర్శనకు అవకాశం దొరకలేదు. సదరువైనం మీద ఆగమేఘాల మీద ఓ కథనం వండేశాడు. ఇటు పత్రికలోనూ అటు తన ఆస్తమా చానెల్‌లోనూ మోత మోగించాడు.
ఎంటయ్యా అంటే కూచిపూడి ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాట్యకళ కాబట్టి ఆ కళతో తెలంగాణతో సంబంధం లేదనే కారణంగా ఈ ప్రదర్శనకు ప్రభుత్వం నిరాకరించిందట. సత్యప్రమాణంగా ఈ విషయాన్ని రవీంద్ర భారతి వర్గాలే రాధాకృష్ణకు చెప్పాయట. ఇంకేముంది? కేవలం ఆంధ్రప్రాంత కళ ప్రదర్శించిన కారణంగా తెలంగాణ బిడ్డలకే తెలంగాణ గడ్డమీద అవమానాలు జరిగుతున్నాయనేది ఆరోపణ. ఇంతటితో ఆగకుండా 2014 ఎన్నికల్లో కేసీఆర్ వారికి టికెట్ ఇచ్చి పార్టీ ప్రయోజనాలకోసం వాడుకోజూశారని తాలింపు కూడా వేశాడు. ఆ రోజు రాజకీయ ప్రయోజనంకోసం వెంపర్లాడి ఇవాళ ఏరు దాటాక విస్మరించారని బురద చల్లేశాడు. ఇది ఇక్కడితో ఆగలేదు. ఇలా ఈ ప్రదర్శన తిరస్కరించడం వారిని అవమానించడమేనని తెలంగాణ కళాకారులు కూడా విమర్శించారట.
విశ్వజనీనమైన కళల మీద ఇలా వివక్ష చూపడం ఏమిటని కళాకారులు రాధాకృష్ణకు చెప్పి బాధపడ్డారట. అదేంటో ఎక్కడ ఎవరికి బాధ కలిగినా రాధాకృష్ణ దగ్గరికి వచ్చి బాధపడుతుంటారు. అక్కడెక్కడో దేశంలో కరువు తీరా ఏడ్చేందుకు ఓ హోటల్ కట్టారట. మరి ఆంధ్రజ్యోతిలో కూడా అలా శోకితులకు ఓ చాంబర్ ఏమైనా కట్టారేమో తెలియదు. ఇక రోజంతా ఈ ప్రచారం మోత మోగించిన రాధాకృష్ణకు రాధారెడ్డి రాజారెడ్డి దంపతులు దిమ్మదిరిగే సమాధానమిచ్చారు. నేరుగా టీవీ లైవ్ చర్చలోకి వచ్చి అసలు మాకు అవమానం జరిగిందని మీకు చెప్పామా? అంటూ నేరుగా ప్రశ్నించారు.
ఇలాంటి వార్తలు రాసేముందు కనీసం మా వివరణ కూడా అక్కర్లేదా! అని కడిగేశారు. అన్నింటినీ మించి రవీంద్రభారతిలో ప్రదర్శనకు అవకాశం రాకపోవడం ఇది మొదటిసారేం కాదు. ఇంతకు ముందు కూడా అనేకసార్లు జరిగింది.. ఇది మామూలుగా జరిగేదేనని చెప్పారు. మేం అడిగిన డేట్‌లో హాలును ముందుగానే మరొకరు బుక్ చేసుకోవడం వల్ల ఇలా జరిగిందని కూడా చెప్పారు. ఇక గత ఎన్నికలో కేసీఆర్ తమకు టికెట్ ఇవ్వచూపారన్నది అవాస్తమని కూడా వారు స్పష్టంగా చెప్పారు.
అక్కడితో ఆగకుండా కూచిపూడి కేవలం సీమాంధ్రప్రాంత కళ కాదని గడ్డిపెట్టారు. ఎప్పుడో ఒకటో శతాబ్దంలోనే యక్షగానంతో పాటు ఈ నాట్యరీతులు పుట్టాయని కాకతీయ రాజుల ఆదరణతో కూచిపూడి నృత్యం గొప్పగా వెలుగొందిందని చెప్పారు. సార్వజనీనమైన కళ విషయంలో ఇంత కురచ ఆలోచనలేమిటని కడిగిపారేశారు. రాసింది రాధాకృష్ణ అయితే తిట్లుతినడం చర్చను నిర్వహించిన ప్రయోక్త వంతైంది. మింగాలేక కక్కాలేక.. మీరు గొప్ప కళాకారులు.. క్యూబా..అలీనదేశాలు.. అవార్డులు.. ప్రశంసలు…అంటూ నీళ్లు నమలాల్సి వచ్చింది. మొత్తానికి రాధాకృష్ణకు తలంటు స్నానం పూర్తయింది. మొగులు మీద మన్ను పోస్తె మొకం మీదనే పడతదని తెలంగాణలో సామెత ఉంది. బహుశా రాధాకృష్ణకు తెలిసిఉండక పోవచ్చు!