mt_logo

సీఎంగా కాదు.. కో వర్కర్‌గా చూడండి- సీఎం కేసీఆర్

సీఎంగా కాదు.. కో వర్కర్‌గా చూడండి- సీఎం కేసీఆర్
సోమవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ మెట్టుగూడలోని క్యాంప్ ఆఫీసులో సికింద్రాబాద్ ఏరియా స్వఛ్చ హైదరాబాద్ యూనిట్ అధికారులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తనను సీఎంగా కాకుండా కో వర్కర్‌గా.. మీలో ఒకడిగా చూడాలని అధికారులను కోరారు. స్వఛ్చ హైదరాబాద్ కేవలం వారంరోజుల కార్యక్రమం కాదని, ఇది నాలుగేళ్ళపాటు నిరంతరంగా కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఐఏఎస్, ఐపీఎస్, అధికారులు, ఉద్యోగులు అందరూ కో వర్కర్‌లేనని పేర్కొన్నారు. బస్తీల్లో పర్యటించే అధికారులు అక్కడి ప్రజలను ఒప్పించి రహదారులు, నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు.

నగరంలో రోజూ 8వేల టన్నుల చెత్త తయారవుతుందని, దాన్ని తొలగించేందుకు 2వేల ఆటో ట్రాలీలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఆ చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నామని, హైదరాబాద్‌లో రెండు లక్షల మంది పేదలకు ఇళ్ళు కట్టించి తీరుతామని, పేదలకు ఇళ్ళ కిరాయి బాధలు తొలగిపోవాలని, ఇందుకోసం అందుబాటులో ఉన్న స్థలాలన్నీ తీసుకుంటామని సీఎం ప్రకటించారు. ఉస్మానియాలో 11 ఎకరాలు, ఉప్పల్ చౌరస్తా దగ్గర 70 నుండి 80 ఎకరాల్లో ఆరు అంతస్థుల్లో పేదవారికోసం ఇళ్ళు కడతామని స్పష్టం చేశారు. అనంతరం సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని హమాలీ బస్తీ, ముషీరాబాద్ ప్రాంతంలోని కృష్ణా నగర్‌లో పర్యటించి అక్కడి ప్రజలతో సీఎం సమావేశమై వారితో ముచ్చటించారు.

నిజాంల హయాంలో లష్కర్‌గా, వ్యాపారకేంద్రంగా ఎంతో ప్రఖ్యాతి పొందిన సికింద్రాబాద్ సమైక్య పాలనలో దరిద్రంగా మారిపోయిందని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. పాలకులకు ముందుచూపు లేకపోవడంతో ఇరుకిరుకుగా మారిపోయిందని, గతంలోని పాత నిర్మాణాలు ప్రస్తుతం పెరిగిన జనాభాకు సరిపోవడంలేదని అన్నారు. అగ్గిపెట్టెలాంటి ఇళ్ళు విచ్చలవిడిగా కట్టడంతో దారులు ఇరుకిరుకుగా మారాయని, ఎక్కడా కనీసం ఖాళీ జాగ లేకుండా దరిద్రంగా తయారైందని అన్నారు. ఇక్కడి నాలాలు భయంకరంగా ఉండి పిల్లలు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని, ఒకటిన్నర కిలోమీటర్ల మేర నాలామీదనే అంబర్‌నగర్‌లో ఇళ్ళు కట్టారన్నారు. నాలాలవెంట దుర్వాసనతో ప్రజలు నరకయాతన పడుతున్నారని, మరోవైపు ట్యాప్ వాటర్, డ్రైనేజీ వాటర్ కలిసిపోయి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, ఈ పరిస్థితిని మార్చాలని అధికారులను సీఎం అదేశించారు. బస్తీ ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలని, తాను స్వయంగా కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో మాట్లాడానని, వారుకూడా ఇందుకు అంగీకరించారని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *