దశాబ్దాలుగా దొడ్డుబియ్యం, ముక్కిపోయిన బియ్యంతో రుచీపచీలేని అన్నం తిన్న విద్యార్థులకు ఇకపై తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేసే మహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని గురువారం ప్రారంభించింది. సమైక్య రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో ఉడికీ ఉడకని అన్నం తిన్న విద్యార్థులకు ఇది ఎంతో ఆనందం కలిగించే విషయం.
రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 1500 సంక్షేమ హాస్టళ్లు ఉండగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఆశ్రమ పాఠశాలలు మొత్తం 230 దాకా ఉన్నాయి. నాలుగు లక్షలకు పైగా విద్యార్థులు వీటిలో విద్యను అభ్యసిస్తున్నారు. జనవరి 1 నుండి వీటన్నింటికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఒక్కో విద్యార్థికి రోజుకు 550 గ్రాముల బియ్యం చొప్పున సుమారు 15-18 కిలోల బియ్యం అందించాలని నిర్ణయం తీసుకుని టీఆర్ఎస్ సర్కారు మాటనిలబెట్టుకుంది.
మార్కెట్లో రూ.40-50 ఉన్న సన్నబియ్యాన్ని కేవలం రూ.1 కే సరఫరా చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలోకూడా హాస్టళ్లకు బియ్యం రూ.1 కే ఇచ్చినా, అవి బహిరంగ మార్కెట్లో రూ.10-15 కే లభించేవి. ఇప్పుడు వాటి స్థానంలో కిలో 40-50 ఉన్నా కొనుగోలు చేసి విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల విద్యార్ధి సంఘాల నాయకులు, విద్యావేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా విద్యార్థులకు సన్నబియ్యం ఇవ్వాలని కోరుతూ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలు చేసినా విద్యార్థుల సంక్షేమం ఏమాత్రం పట్టించుకోకుండా సమైక్య పాలకులు వారిని పోలీసులతో కొట్టించడం తెలిసిందే!