mt_logo

సమైక్యవాదులెవరు? వేర్పాటువాదులెవరు?

By – మాడభూషి శ్రీధర్

ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరు అని ఈ తరంలో చాలా మందికి అటు ఆంధ్రప్రాన్తంలో ఇటు తెలంగాణలో తెలియదు. చాలామందికి తెలంగాణ వారు ఇదివరకున్న రాష్ట్రం అడుగుతున్నారని తెలియదు. రాష్ట్రాన్ని చీల్చి, సగానికి కోసి ఇమ్మంటున్నట్టు కొందరు ప్రచారాలు చేస్తున్నారు. విలీనం కాకముందున్న ప్రాంతాన్ని రాష్ట్రంగా ప్రకటించమని మాత్రమే అడుగుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని వేర్పాటు ఉద్యమంగా చిత్రించడం తప్పు. ఇది కావాలని కొందరు చేస్తున్న దుష్ప్రచారం. దేశం నుంచి విడిపోతామనే ఉద్యమాన్ని మాత్రమే వేర్పాటు ఉద్యమం అనవలసి ఉంటుంది. ఇది తెలంగాణ ఏర్పాటు కోసం సాగుతున్న ఉద్యమమే కాని వేర్పాటు ఉద్యమం కాదని తెలుసుకోవాలి. విశాలాంధ్ర ఏర్పాటుకన్న ముందు ఆంధ్రరాష్ట్ర వేర్పాటు కోసం సాగిన చారిత్రాత్మక పరిణామాలు తెలుసుకోవడం మరింత ముఖ్యం.

1949 డిసెంబర్ నాటికే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుచేయడానికి పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తరువాత ప్రధాని నెహ్రూ అధ్యక్షతన ఉన్న విభజన కమిటీ రాష్ట్ర ఏర్పాటును మరింత ధృవీకరించింది. తరువాత ఎందుకు ఆలస్యమైంది? పొట్టి శ్రీరాములు ఎందుకు దీక్ష చేయవలసి వచ్చింది.

అమరజీవి అడిగింది తమిళుల నుంచి వేర్పాటే కాని సమైక్య రాష్ట్రం కాదు. తెలుగు వారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయెను అమరజీవి అని ఒక సినీ కవి తన గేయంలో పేర్కొన్నారు. ఇది కవితకు ‘యతిప్రాస’ కోసం సరిపోతే సరిపోవచ్చు కానీ, అది చారిత్రక అసత్యం. ఒక దుష్ర్పచారానికి నాంది. ఆ కవి ఉద్దేశం పొట్టి శ్రీరాములు మద్రాసులో ఉన్న తెలుగువారి కోసం మద్రాసుతో సహా ఒక రాష్ట్రం కోరుతూ ప్రాణత్యాగం చేసినాడే గానీ, దేశంలో ఉన్న తెలుగువారందరూ ఒక రాష్ట్రంలో ఉండాలని కోరలేదు.

1956లో ఏర్పడిన విశాలాంధ్ర కోసం అంతకుముందు ఆయన దీక్ష చేయలేదని తెలుసుకోవాలి. నిజానికి ఆయన ఉద్యమం అంతా మద్రాసును ఆంధ్రవారికి సొంతం చేయాలన్న తపనతో సాగిందే. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు అప్పడికే నిర్ణయమైపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. తమిళ ప్రజలు కూడా తెలుగువారు పోదలచుకుంటే పోనీయండి అన్న ధోరణిలోనే ఉన్నారు. మద్రాసు వంటి వివాదాస్పద ప్రాంతాల విషయంలో నిర్ణయం వల్లనే రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమైంది. అప్పటి ఆంధ్ర నాయకుల మధ్య విభేదాలు, నమ్మకాలు లేకపోవడం అసలు కారణాలు. కేంద్రం, రాష్ట్రం రెండూ ఆమోదించినా ఆంధ్ర రాష్ట్రం రావడంలో ఆలస్యానికు కారణం నానారకాల పార్టీలు నానా రకాలుగా ఆలోచించడం, ఒకరిపైన మరొకరు పైచేయి సాధించాలనుకునే స్వార్థం, అహంకారం, వగైరా.. కారణాలు.

1910 నుంచి మద్రాసు నుంచి ఆంధ్రను వేరుచేయాలనే డిమాండ్ ఉన్నది. మరొక వాస్తవమేమంటే కొంతకాలం పాటు మద్రాసు నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ఉద్యమించారు. మళ్లీ ఇప్పుడు కూడా వారిది అటువంటి డిమాండే. అప్పుడు మద్రాస్ కోసం ఇప్పుడు హైదరాబాద్ కోసం రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. నాడు కోస్తా, రాయలసీమ ప్రాంతాల ప్రజలు మద్రాసు నగరం కావాలని పట్టు పట్టలేదు. కాని కొందరు నాయకులు మాత్రమే మద్రాసును కనీసం కేంద్రపాలిత ప్రాంతం చేయాలని పట్టుబట్టారు. ఇప్పుడు కూడా హైదరాబాద్‌లో వారి వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం కాని దేశ ప్రజల అవసరాలు, కోట్లాది జనం భావాలు, అభివృద్ధి వీరికి పట్టదు. ఈ కుతంత్రాల వల్లనే అందరూ ఆమోదించిన తరువాత, వెంటనే రావలసిన రాష్ట్రం సాధించడం కోసం పొట్టి శ్రీరాములు బలి కావలసి వచ్చింది.

హైదరాబాద్ రాష్ట్రం నుంచి మరాఠా ప్రాంతాలను వేరు చేసిన తరువాత మిగిలిన తెలుగు భాషా జిల్లాలను హైదరాబాద్ రాష్ట్రంగానే పిలిచారు. ఒక రాష్ట్రం నుంచి వేరుపడాలని కోరడమే వేర్పాటువాదమైతే అందుకు ఆద్యులు కోస్తా, రాయలసీమ వారే కాని తెలంగాణ వారు కాదు. మరాఠా జిల్లాల నుంచి వేరుపడాలని తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాలు జరగలేదు. అప్పుడు వేరేరాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ ను స్వతంత్ర భారతంలో విలీనం చేయాలని ఉద్యమాలు చేసిన వారు నాటి తెలంగాణ జిల్లాల వారు. ఆ విషయాలను పరిగణిస్తే తెలంగాణ వారు సమైక్యవాదులు, విలీనవాదులే కాని వేర్పాటువాదులు కాదు.

కశ్మీర్ వలె , ఖలిస్తాన్ వలె, కొందరు తమిళుల వలెవేరే దేశాలు కావాలని కోరని తెలంగాణ జాతీయవాదాన్ని కించపరుస్తూ వేర్పాటు వాదులనడం ఒక దుష్ర్పచారం, దుర్మార్గం. 1956కు ముందున్న హైదరాబాద్ రాష్ట్రం కోరడం వేర్పాటువాదమైతే, 1956 నాటి నుంచి సమైక్యం కాని రాష్ట్రంలో తెలంగాణను దోచుకునే దుర్మార్గ ప్రభుత్వ విధానాలు, కొనసాగాలనుకోవడం దోపిడీవాదం అవుతుందే కాని సమైక్యవాదం ఎన్నటికీ కాదు. కొందరు సంపన్నులు సమైక్యం పేరుతో పెంచి పోషిస్తున్నఉద్యమం దోపిడీని కొనసాగింపచేసేందుకు సాగించే తెలంగాణ వ్యతిరేక ఉద్యమమే తప్ప నిజమైన సమైక్య ఉద్యమం కాదు. శతాబ్దాల నుంచి తమిళులతో ఉన్నా వారితో కలిసి ఉండలేని తెలుగుసోదరులు, తెలుగువారంతా అన్నదమ్ముల వలె కలిసి ఉండాలనే పెదాల పైపొరలు దాటని శ్రీరంగ నీతుల విలువ ఏపాటిదో అర్థం చేసుకోవాలి. నిజానికి తెలుగు వారు తమిళ జిల్లాల నుంచి విడిపోవాలనడంతోనే అసలు “వేర్పాటువాద” సమస్యలు మొదలైనాయి.
భాష ప్రాతిపదికన ప్రజలను విభజించాలనే ఆలోచన, జాతి శాశ్వత ప్రయోజనాలకు దేశ సమైక్యతకు అనుకూలం కాదని కమిషన్లు, పెద్దలు, రాజకీయ వేత్తలు వివరించారు.

కేవలం తెలంగాణ వనరులమీద, భూభాగాల మీద కన్నువేసిన సంపన్నులు, రాజధాని కోసం తెలంగాణను కలుపుకుని మిగిలిన జిల్లాలను పాడుబెడదామన్న దురుద్దేశంతో సాగించిన సామ్రాజ్యవాద కుటిలతంత్రం భాషారాష్ట్ర లాబీయింగ్. దార్ కమిషన్, ఫజల్ ఆలీ కమిషన్, జవహర్‌లాల్ నెహ్రూ సహా ఎందరో పెద్దలు భాష పేరుతో ప్రజలను ఇతర ప్రాంతాలనుంచి చీల్చి వేయడం ఏ మాత్రం న్యాయం కాదన్నారు. మద్రాసు నుంచి తెలుగు వారిని చీల్చిన వేర్పాటువాదులు, కర్నాటక ప్రాంతంలో కన్నడ భాష మాట్లాడే వారి జతనుంచి తెలుగువారిని చీల్చిన వేర్పాటువాదులు, తెలంగాణాను కలుపుకోవడం కోసం చేసిన కొంగజపం సమైక్యవాదం. ఇప్పటికీ ఇదే కొంగ జపం చేస్తున్నారనే విషయం తెలుసుకోవడం ప్రస్త్తుత కర్తవ్యం.
2009లో గ్రూప్ -1 పరీక్షలలో మొదటి భాషాప్రయుక్త రాష్ట్రం ఏమిటి అని ప్రశ్నిస్తే, చాలామంది 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం అనీ, 1956లో ఏర్పాటయిన ఆంధ్ర ప్రదేశ్ అని కొందరు జవాబులు రాసినారు. పరీక్ష పాస్ కావడానికి అవసరమైనంత వరకు మాత్రమే జవాబులు బట్టీ పట్టి, చరిత్రను అవగాహన చేసుకోవాలన్న తపన ఏమాత్రం లేని మేధావులు తరువాత పాలనాధికారులు కావడం కూడా ఒకరకంగా దేశానికి శాపమే.

ఒకసారి పాసైన తరువాత చరిత్రతోనే కాదు విజ్ఞానంతో కూడా పనిలేదనే భావ పేదరికంలో మన ఐఎఎస్, ఐపిఎస్ పెద్దలు ఉండడం విచారకరం.

నిజానికి బ్రిటిష్ పాలనలో ఒరియా భాష మాట్లాడే వారు మొదటి భాషాప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడారు. ఝుంపా ముఖర్జీ రాసిన ఒరిస్సా రాష్ట్ర చరిత్రలో ఈ వాస్తవాలు బయటపడతాయి. ఒరిస్సా కమిషనర్‌గా ఉన్న జాన్ బీమ్స్‌కు ఒరియా మాట్లాడే వారిలోని అన్ని వర్గాల వారూ కలిసి వినతిపత్రాలు సమర్పించారు. బెంగాల్‌ను విభజించాలనే ఆలోచన చేస్తున్నప్పుడు లార్డ్ కర్జన్ 1903లో ఒరియా జిల్లాలను ఏకం చేయడం పై దృష్టి సారించారు. బీహార్ ఒరిస్సా ప్రాంతాలు ఒకరికొకరి మధ్య ఉన్న కృత్రిమ సంబంధాలకు, సహజ సంబంధాల కొరతకు ఉదాహరణలని సైమన్ కమిషన్ పేర్కొన్నది. 1936 ఏప్రిల్ 1న ఒరిస్సా రూపొందింది. ఇక్కడి ప్రత్యేక పరిస్థితులు ఒరియా భాష ఆధారంగా ఒకే రకం సంస్కృతిని ఒకే చోట కేంద్రీకృతం చేయడానికి అనుకూలంగాఉంది. ఒరిస్సా ఏర్పాటు వేర్పాటు కాదు. అది ఏర్పాటు.అందువల్ల ఏ నష్టమూ జరగలేదు.

తెలంగాణ విషయం పూర్తిగా వేరు. ఈ ప్రాంత భాషను, నేలను, సంస్కృతిని వనరులను ఆక్రమించుకుని వారిని అణచివేయడానికి, వారి అవిద్య, అమాయకత్వం ఆసరా చేసుకుని మోసాలు చేయడానికి భూములు కొనడానికి ఉపయోగపడిందే తప్ప సమైక్యం అన్న మాటేలేదు. ఇందాకా దోచుకుంది చాలు, ఇకనైనా నన్ను అభివృద్ధి చెందనీ అంటే ఇష్టం కావడం లేదు. ఆంధ్ర రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, వారే ప్రజాప్రతినిధులుగా రూపాంతరం చెందిన విస్తరణ శక్తులు- నల్లడబ్బు బలంతో, కులబలంతో ఢిల్లీలోనే నిరంతరం పాగా వేసి, నిర్ణేతలకు కావలసినవన్నీ ఏర్పాటుచేసి తెలంగాణను నిరోధిస్తున్నారని అర్థం చేసుకోవలసి ఉంది.

1910లో ప్రారంభమైన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఉద్యమం, రాష్టం ఏర్పాటు కోసం 1949లోనే అందరి ఆమోదం పొందినా ఒకే తాటి మీద లేని నాయకులు, స్వార్థ ప్రయోజనాలతో మద్రాసును పూర్తిగా తీసేసుకుందామని మొదట, కనీసం కేంద్రపాలిత ప్రాంతం చేద్దామని ఆతరువాత ప్రయత్నించి మూడేళ్లు ఆలస్యం చేసుకున్నారు. 2009లో ఇస్తానన్న తెలంగాణను ఇవ్వకుండా హైదరాబాద్ కోసం అడ్డుకున్నారు. తమ రాష్ట్రం కోసం సమైక్యం కాని నేతలు, తెలంగాణను నిరాకరించడానికి మాత్రం సమైక్యంగా ఉన్నారు. కనుక వారు ఈ అర్థంలో సమైక్యవాదులే. ఇక కొందరు తెలంగాణవాదులు మాత్రం తమ అనైక్యతను చాటుకుంటున్నారు.

కాంగ్రెస్‌లో తెలంగాణ వారు అటు ఢిల్లీ సుల్తానులకు ఎదురు చెప్పలేక ఇటు కోస్తా డబ్బుతంత్రంతో ఎదురీదలేక, పైకి తెలంగాణ పేరుజపిస్తూ సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. తెలుగుదేశంలో ఉన్న తెలంగాణ నాయకులు బతుకు శూన్యమై, భవిష్యత్తు అంధకారమైనా మరింత అయోమయంలో తమ నాయకుడు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాడనే భ్రమలో మనశ్శాంతిని వెతుక్కుంటున్నారు.

కొత్తగా వచ్చిన వైఎస్సార్ పార్టీ కూడా కాంగ్రెస్ కన్న తెలుగుదేశాన్ని నానారకాలుగా దుమ్మెత్తిపోస్తున్నా, తెలంగాణ విషయంలో చంద్రబాబు విధానాన్నే అనుసరించడం విచిత్రమని వారికి బోధపడడంలేదు. లేదా పదవుల స్వార్థం ఉండొచ్చు. అందులో చేరే తెలంగాణ నాయకులది మరో దారి. తెలంగాణ విరోధులు సమైక్యమైనా తాము వేరుగా ఉన్నారు కనుక ఈ తెలంగాణ వారు ఒకరకంగా వేర్పాటువాదులే. బాధాకరమైన విషయం ఏమంటే సీమాంధ్రులతో పాటు తెలంగాణను తెలంగాణవారూ మోసం చేస్తున్నారు. చరిత్రతోపాటు జనం ఈ మోసాలను కూడా తెలుసుకోవడం అవసరం.

(‘మిషన్ తెలంగాణ’ వెబ్‌సైట్‌లో కొణతం దిలీప్, సంగిశెట్టి శ్రీనివాస్ గార్లు సమకూర్చిన విషయాల ఆధారంగా, వారికి ధన్యవాదాలతో)
రచయిత నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు, మాధ్యమ న్యాయ శాస్త్ర పరిశోధనా కేంద్రం సమన్వయకర్త.

(నమస్తే తెలంగాణ సౌజన్యంతో) 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *