mt_logo

సమైక్యాంధ్ర కల్పిత ఉద్యమ కబుర్లు…


By: ఘంటా చక్రపాణి  

నాకు దాదాపు మూడేళ్ళుగా విజయవాడ నుంచి రమేష్ అనే మిత్రుడు ఫోన్ చేస్తుండేవాడు. ఆయన ఎవరో ఎలా ఉంటాడో తెలియదుగానీ తెలంగాణా ఉద్యమం సాగినంత కాలం టివి లలో చూసిన ప్రతిసారీ మాట్లాడేవాడు. తెలంగాణ ప్రజల పోరాట పటిమకు ముగ్ధుడయ్యే వాడు. మన యువకుల ధైర్యాన్ని చూసి ఉప్పొంగే వాడు. విజయ వాడలో T NEWS ప్రసారాలు రాకపోతే కేబుల్ వాడితో గొడవపడి పెట్టిన్చుకున్నాడు. ఆయన తెలంగాణ వీరాభిమాని. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. విజయవాడను ఆనుకుని దాదాపు ముప్పై ఎకరాలకు పైగా పొలం సాగు చేస్తుంటాడు.

ఉన్నట్టుండి ఈ మధ్యకాలం లో అతని నుంచి ఫోన్ లేదు. సీమాంద్ర చానళ్ళ హడావిడి చూసి అక్కడి ఉద్యమం ఎలావుందో కనుక్కుందామని ఉదయం నేనే కాల్ చేసాను. మొబైల్ కలువలేదు. బహుశ ఉద్యమం ధాటికి సిగ్నల్స్ కూడా జామ్ అయ్యాయేమోనని లాండ్ లైన్ కు కాల్ చేసాను.. కుశల ప్రశ్నల తరువాత మా సంభాషణ ఇలా సాగింది….

– ఎక్కడున్నావు రమేష్ ?

పొలం దగ్గర సర్ , నారు మల్లతో బిజీ గా ఉన్నాను.

– అయ్యో అంత పెద్ద ఉద్యమం నడుస్తుంటే పొలం దగ్గర ఉన్నా అంటావేంటి?

సర్ పనీ పాటా ఉన్న ప్రతి ఒక్కడూ పొలాల్లోనే ఉన్నారు, ఈ కాలం పోతే మళ్ళీ రాదు కదా.. అయినా ఏ ఉద్యమం సర్?

– భలేవాడివయ్యా … ఆంద్ర ప్రాంతమంతా భగ్గుమంటుంటే ఏ ఉద్యమం అంటావేంటి?

ఏ చానల్లో సర్? నేను చానల్లు చూడడం మానేసి రెండు వారాలు అయ్యింది సర్. అయినా టీవీ లు నిజాలు తెలుసుకోవడానికి చూడాలి కాని అబద్ధాల కోసం కాదు కదా! నేను విజవాడలోకు పది కిలోమీటర్ల దూరంలో ఉంటాను. రోజూ నాలుగు విజయవాడ వెళ్తూ వస్తుంటాను. అక్కడొక గుంపు , అక్కడొక గుంపు నాలుగు కూడళ్ళ దగ్గర కూర్చుని టీవీ వాళ్ళు వచ్చేసమయానికి నినాదాలు చేసి షో చేస్తారు. లైవ్ వాహనాలు వెళ్ళిపోగానే వాళ్ళూ వెళ్ళిపోతారు.

ఉద్యోగులకు మాత్రం ఆట విడుపుగానే ఉంది. ఆఫీసులకు మధ్యాహ్నానికి చేరుకొని సాయంకాలం టీవీ లకోసం సిద్దపడుతుంటారు. అవి అయిపోగానే ఎవరి దారి వారిది. స్కూల్స్ అన్నీ నడుస్తున్నాయి. కాకపోతే రోడ్డుకు దగ్గరా ఉన్న స్కూల్స్ కి మాత్రం కొంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే టీవీ చానళ్ళ వాళ్ళు రోజుకొక స్కూల్ కు వెళ్లి విద్యార్థులను రోడ్డు మీదికి తెచ్చి పది నిముషాల పాటు నడిపించి స్లోగన్లు ఇప్పిస్తారు. అది లైవ్ లో వెళ్ళగానే ఎవరి క్లాసుకు వారు వెళ్ళిపోతారు. మీరు టీవీ చూడండి అందరూ స్కూల్ కనిపిస్తారు అంటే ప్రైవేటు స్కూల్స్ అవి. ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూల్స్ కు డోకా లేదు. అందరూ ఆఫీసులు ఎగ్గొడితే మేము మాత్రమే ఎందుకు పనిచేయాలని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

ఆర్ టి సి బస్సులు మాత్రం బయటకు రావట్లేదు. నగర తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీనివాస రావు ఉద్యమంలో చురుగ్గా ఉన్నాడు. ఆయన Kesineni Travels అధినేత . ఆయన బస్సులు మాత్రం రోజంతా నగరంలో రాత్రికి హైదరాబాద్ కు తిరుగుతూనే ఉన్నాయి.

VTPS లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కార్మికులు సమ్మెలో ఉన్నారు. కానీ lagadapati LANCO KONDAPALLI పవర్ ప్లాంట్ మాత్రం అరనిమిషం కూడా ఆగలేదు.ఎందుకంటె ఆయనే ఈ సమైఖ్యాంధ్రకు ఆద్యుడు. మా జిల్లాలో ఇప్పుడు ఆయనే ఆయువుపట్టు.

ఇక SHOPS , HOTELS , BAR SHOPS నిర్విరామంగా నడుస్తున్నాయి. కాకపోతే షాప్స్ ముందు ‘ జై సమైఖ్యాంధ్ర’ అనే బోర్డ్ విధిగా ఉంచాలి.

సర్ ఇది హైదరాబాద్ లో భూములు, ఆస్తులు, వ్యాపారాలు ఉన్న రాజకీయ నాయకులు, ఉద్యోగాలు ఇల్లు ఉన్న ఎన్జీవో నేతలు, చానల్లు- పత్రికలు ఉన్న పెట్టుబడిదారులు సృష్టించిన కల్పిత ఉద్యమం- జై సమైఖ్యాంద్ర. అన్నాడు రమేష్.

నన్ను కూడా ఆ చోద్యం చూడడానికి రమ్మన్నాడు! చూడాలి మరి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *