92.7 బిగ్ ఎఫ్ఎం మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ షో ‘సలాం తెలంగాణ – ఇది పొడుస్తున్న పొద్దు’ లోగోను ఐటీ మంత్రి కేటీఆర్ సోమవారం హోటల్ మారియట్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సలాం తెలంగాణ దక్కనీ సంస్కృతికి చిహ్నమని, ఈ కార్యక్రమం సామాజిక సమస్యలపై పోరాడుతూ ప్రజలకు చేరువ కావాలని అన్నారు. ఇప్పుడున్న సమాజంలో అన్ని వయసుల వారికి సమాచారంతో పాటు వినోదాన్ని అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయని కేటీఆర్ పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ, రేడియో ప్రచారం కారణంగానే గత సంవత్సరం 1,023 కోట్ల రూపాయల పన్నులు వసూలు చేశామని అన్నారు. సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, చరిత్ర, జీవన సంవిధానాన్ని ఏకం చేసిన సీఎం కేసీఆర్ ఉపన్యాసాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిగ్ ఎఫ్ఎం హెడ్ కమలాకర్, ఆర్జేలు స్వప్న, శేఖర్ బాషా, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా తదితరులు పాల్గొన్నారు.