mt_logo

‘సకల జనభేరి’ మోగిద్దాం

-పిట్టల రవీందర్
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

సమైక్యత పేరుమీద సీమాంధ్రలో ముఖ్యమంత్రి పరోక్ష నాయకత్వంలో యాభయి రోజులుగా జరుగుతున్న ‘తమాషా’ ఉద్యమం వెనక స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడంతో, దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా ఈ ప్రాయోజిత ఉద్యమం అనేక విపరిణామాలకు దారితీసే ప్రమాదం కనిపిస్తున్నది. కనీసం ఆలోచించడానికి అర్హత కలిగిన ఒక్క డిమాండు లేదు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు డిమాండు రాజ్యంగబద్ధమైనది, న్యాయసమ్మతమైనది. అందువల్లనే సర్వజనామోదం పొందగలిగింది. సబ్బండవర్ణాలను ఉద్యమంలో సంలీనం చేయగలిగింది. కానీ సమైక్యత అనేది రాజ్యాంగ విరుద్ధమైనది, ప్రజాస్వామిక స్ఫూర్తికి వ్యతిరేకమైనది. సహజన్యాయ సూత్రాలకు విలోమమైనది. అందువల్లనే ఈ ఉద్యమంలో బాహ్యప్రపంచం ప్రేక్షకపాత్రకు పరిమితమైపోయింది.

తెలంగాణ వనరులను దోచుకుంటున్న పెట్టుబడిదారీశక్తులు, ఆధిపత్య రాజకీయాలు నిర్వహిస్తున్న పాలకవర్గాలు తమ దోపిడీ పద్ధతులను కొనసాగించుకోవడం, తమ ఆధిపత్య రాజకీయాలను శాశ్వతంగా నడిపించుకోవడం కోసం, హైదరాబాద్‌లో అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తులను నిలబెట్టుకోవడంకోసం, నగరం చుట్టూ ఆక్రమించుకున్న వేలాది ఎకరాల భూములను కాపాడుకోవడం కోసం మాత్రమే కొంతమంది స్వార్థపరశక్తుల నాయకత్వంలో ఈ సమైక్య ఉద్య మం కొనసాగుతున్న విషయం సీమాంధ్ర ప్రజలకు అర్థమైపోయింది. అందుకే సమైక్య ఉద్యమాన్ని సీమాంధ్రలోని మేధావులు, ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాలు, దళితబహుజనవర్గాలు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నాయి.

‘సేవ్ హైదరాబాద్’ పేరుమీద ఏపీఎన్జీవోస్ నిర్వహించిన సభ తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య మానసికమైన విభజనరేఖను మరింత విశాలం చేసింది. హైదరాబాద్ నడిబొడ్డులో సీమాంధ్ర ఉద్యోగులు సభ నిర్వహించడం తెలంగాణ ఉద్యమకారుల్లో చాలామందికి పుండుమీద కారం చల్లినట్లు, గుండెగాయాన్ని గెలికినట్లు బాధ కలిగించింది. నిరంతర పోరాటంతో, సుమారు వెయ్యిమంది యువతీయువకుల ఆత్మబలిదానంతో తాము సాధించుకున్న స్వరాష్ర్ట హక్కుపై దాడి జరిగినట్లుగా, హైదరాబాద్ దురాక్రమణసభగా తెలంగాణ ప్రజలు భావించారు.

అధికారుల అండతో, పోలీసుల సహకారంతో, ఉద్యమం పేరుమీద జరిగే ఆరాటాలు ఎంత పేలవంగా ఉంటాయో …పోలీసుల అణచివేతలమధ్య, ప్రభుత్వ దమనకాండ నడుమ జరిగే ప్రజల పోరాటాలు ఎంతటి సజీవంగా నిలుస్తాయో కూడా ప్రజలు అర్థం చేసుకోవడానికి ఈ సందర్భం ఉపయోగపడుతున్నది. సీమాంధ్రలో ప్రస్తుతం జరుగుతున్న ప్రాయోజిత ఉద్యమం తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమష్రేణులకు ఇరువూపాంతాల ఉద్యమ తీరుతెన్నులను పోల్చుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తే, సీమాంధ్ర ప్రజలకు దీర్ఘకాలికంగా అనేక రకాలైన కష్టనష్టాలను మూటగట్టుతున్నది.

సమైక్యాంధ్ర పేరుమీద సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాల అసలు రూపాన్ని ఈ సభ బహిర్గతం చేస్తే, ముఖ్యమంత్రి అనుసరిస్తున్న ప్రాంతీయ వివక్షను, దురభిమానాన్ని సమైక్య ఉద్యమం నిగ్గుతేలుస్తున్నది. తెలంగాణ ప్రజల పట్ల రాష్ర్ట పోలీసు బాసు అనుసరిస్తున్న దురహంకారాన్ని, దుర్మార్గాన్ని ఈ సమా ‘వేశం’ బట్టబయలు చేస్తే, సీమాంధ్ర ఆధిపత్య మీడియా ఇంతకాలంగా తెలంగాణ ఉద్యమంపట్ల అనుసరిస్తున్న పక్షపాతధోరణులకు అక్కడి ఉద్యమం అద్దం పడుతున్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతప్రజల శాంతికాముకత్వాన్ని, సహనశీలతను, సౌభ్రాతృత్వాన్ని, ఔదార్యాన్ని, సాటి మనిషిని మనిషిగా గౌరవించే ఔన్యత్వాన్ని ..పపంచానికి ఈ సీమాంధ్ర ఆధిపత్య దురాక్రమణ సభ చాటిచెప్పితే, భౌతికదాడులతో, వేధింపులతో తెలంగాణప్రాన్తానికి చెందిన ఉద్యోగులను సీమాంధ్రలో హింసిస్తున్న సంఘటనలు అక్కడి పరిస్థితులను ఈ ఉద్యమ సందర్భం బహిర్గతం చేస్తున్నది. ఇరుప్రాన్తాలలో ప్రస్తుతం నెలకొనిఉన్న పరిస్థితులకు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న నాన్చివేత ధోరణులే కారణమవుతున్నవి. కాంగ్రెస్ పార్టీ వెనువెంటనే రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం వాంఛనీయం కాదు.

మరోవైపు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేష్టలుడిగిపోయినట్లు ప్రవర్తించడం కూడా తెలంగాణ ప్రజల ఆందోళనకు కారణమవుతున్న్దది. సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలు, రాష్ర్ట మంత్రులు, నాయకులందరూ ఢిల్లీలో తెలంగాణకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తూ, రాష్ర్ట ఏర్పాటును అడ్డుకుంటున్నట్లుగా మీడియాలో దుష్ర్పచారం జోరుగా సాగిస్తున్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు మరింత గందరగోళానికి గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వెలువరించినప్పటికీ, తెలంగాణలో యువతీయువకులు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ వెంటనే క్యాబినెట్ నోట్‌ను ఆమోదించే విధంగా, ఆ తర్వాత పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఆమోదింపజేసే రీతిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నాయకత్వం అవసరమైన చొరవను ప్రదర్శించాలి. సుదీర్ఘ పోరాట ఫలితంగా, అమరుల ఆశయాలను సాధించుకునే సందర్భంలో ప్రకటన అమలు కోసం కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకు, తెలంగాణ ఉద్యమ ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టేందుకు సెప్టెంబర్ 29వ తేదీన హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న “సకల జనభేరి” బహిరంగ సదస్సుకు వేలాదిగా తరలిరావాల్సిందిగా కోరుతున్నాము.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *