mt_logo

మహాజనాద్భుతం సాగరహారం

-ఎన్. వేణుగోపాల్

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది. తెలంగాణ బిడ్డ అయినందుకు సంపూర్ణంగా సంలీనం కావలసిన సన్నివేశం అది. తెలంగాణ బిడ్డ కాకపోయినా న్యాయం కోసం గళమెత్తుతున్న ఆ లక్షలాది గొంతులలో కలగలిసి ముక్తకంఠం కావలసిన వేళ అది.ఆదివారం సాయంకాలం హుస్సేన్ సాగరతీరంలో అనేక ఆంక్షలనూ, ఆటంకాలనూ, నయవంచనలనూ, హామీల ఉల్లంఘనలనూ అధిగమించి జరిగిన సాగరహారం జీవితంలో అత్యంత అరుదుగా అనుభవమయ్యే మహాద్భుత ఉద్వేగభరిత జన కావ్యం. నిజంగా అది ఒక మహాకావ్యానికి వస్తువు. అక్కడ ఎగసిన భావోద్వేగాలు ఒక రోమాంచకారి నవలా ఇతివృత్తం. మూడు నాలుగు ప్రత్యేకమైన అనుభవాలను మాత్రం పంచుకోవాలి.

అక్కడ రాజకీయపక్షాల జెండాలు కనబడి ఉండవచ్చు, రాజకీయవాదుల గళాలూ నినాదాలూ వినబడి ఉండవచ్చు. కాని రాజకీయాలంటే ఎన్నికల రాజకీయ పక్షాలనే అర్థంలో చూస్తే అది ప్రధానంగా రాజకీయ ప్రదర్శన కాదు. అది తెలంగాణ బిడ్డల స్వచ్ఛంద ప్రదర్శన. తెలంగాణ తల్లికి నీరాజనాలు సమర్పించడానికి, సగౌరవ హారతి ఎత్తి పట్టడానికి తమంతట తామే లక్షలాది తెలంగాణ బిడ్డలు కూడిన మహా సందోహం. ఒక జాతర. ఒక పండుగ. ఒక అంగడి. ఒక బతుకమ్మ. ఒక జమ్మి ఆకు యాత్ర. ఒక ఉత్సవం.

అది రాజకీయ పక్షాల సభ కాదంటే రాజకీయ పక్షాలు ప్రజలను తోలుకు వచ్చిన సభ కాదని. నిజానికి ఒక రాజకీయ పక్షం సాగరహారం పట్ల ఒకింత దూరాన్ని పాటించింది. అయినా జనం కదిలివచ్చారు. మూడు రాజకీయపక్షాలు అంతా తామేనన్నట్టు, ఒక మనిషి, రెండు జెండాలుగా హడావుడి చేశాయి. కాని వాటి లో ఒక రాజకీయపక్షం పదమూడేళ్ల కింద చేసిన మోసాన్ని ప్రజ లు ఇంకా మరచిపోలేదు. మరి రెండు రాజకీయపక్షాలు ఇప్పుడు కొత్తమురిపెంలో పొద్దెరగనట్టు ప్రవర్తిస్తున్నప్పటికీ నిన్నమొన్నటి దాకా అవి తెలంగాణ వద్దన్న సంగతి చరిత్ర ఇంకా గుర్తుంచుకున్నది. కనుక ఆ హడావుడి చేసిన రాజకీయపక్షాలు పిలిచాయని కూడ కాదు.

రాజకీయపక్షాల ఎన్నికల తతంగాలతో సంబంధం లేని ఐక్య కార్యాచరణ సమితి పిలుపు ఇచ్చిందని జనం వచ్చారు. రాజకీయపక్షాల వల్ల కాదు, రాజకీయపక్షాలు ఉన్నప్పటికీ తమ ఆకాంక్ష కోసం జనం తరలి వచ్చారు. తెలంగాణ సాధించడానికి అన్ని మార్గాలూ ప్రయత్నించాం, ఇంకా ఏం చేయాలి అని నిరాశతో, నిస్పృహతో కాదు, మరొకసారి ఆశను కూడగట్టుకునేందుకు వచ్చారు. ఎవరో తీసుకొస్తే కాదు, ఎవరో తోసుకొస్తే కాదు, ప్రతి వ్యక్తీ తనంతట తాను కదిలివచ్చారు. గుండె రవరవలాడితే తోసుకుని వచ్చారు. ఒక్కసారి ఆ నాలుగు లక్షల ముఖాల్లోకి చూస్తే ఎవరికయినా ఆ బలవత్తరమైన ఆకాంక్ష అర్థమయి ఉండేది. ఆ రెండు మూడు కిలోమీటర్లు అటు చివరి నుంచి ఇటు చివరి దాకా రెండు సార్లు తిరిగితే వేలాది మంది పరిచయస్తులూ మిత్రులూ కలిశారు. సొంత పూనిక మీద, సొంత ఖర్చుతో, అక్కడికి వెళ్లకపోతే గొప్ప అనుభవం ఒకటి పోగొట్టుకుంటామన్నంత ఆర్తితో తరలివచ్చిన వారు.

రాజకీయ గుర్తింపు కోసమో, లైవ్ టెలివిజన్‌లో కనిపించాలనే యావతోనో వేదిక మీదికి అవసరం లేనివాళ్లు కూడ ఎక్కడం, వారిని దిగమని చేసిన విజ్ఞప్తులే సగం సమయాన్ని ఆక్రమించడం, వేదిక మీదికి రావలసిన, మాట్లాడవలసిన రాజకీయ నాయకులు రాకపోవడం, వేదిక మీద కార్యక్రమాలు క్రమబద్ధంగా జరగకపోవడం వంటి లోపాలెన్ని ఉన్నా, వాటన్నిటినీ విస్మరించదగినంత గొప్ప స్ఫూర్తిని ఆ జనసందోహం అందించింది.

సాగరహారంలో హింస, విధ్వంసాల మీద ముందూ తర్వాతా చాల చర్చ, రచ్చ జరుగుతున్నది. కాని సాగరతీరంలో దృశ్యంవేరు. ఐదు-ఐదున్నర సమయంలో అప్పటికి గంట సేపటినుంచి వేదిక వెనుకవైపు నుంచి ఆకాశంలోకి ఎగస్తున్న పొగలు చూసి, ఉండీ ఉండీ వినిపిస్తున్న తుపాకి కాల్పుల శబ్దాలు విని అక్కడ ఏం జరుగుతున్నదో చూద్దామని వేదిక వెనుకవైపు వెళ్లాం. అక్కడ కనిపించినది ఒక అద్భుత దృశ్యం. 1969 జై తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకూ సి ఆర్ పి దళాలకూ జరిగిన పిచ్‌డ్ బ్యాటిల్స్ ఎదురుబొదురు యుద్ధాల గురించి చదివి మాత్రమే ఉన్నవారికి అది కళ్ల ముందర పునరావృతమైన అద్భుత సందర్భం. వేదికకు యాభైగజాల వెనుకనే పోలీసులు ముళ్లకంచెల అడ్డుకట్టలు కట్టి ఉన్నారు.

ఆ ముళ్లకంచెలను తొలగించి, అక్కడి పోలీసుల లాఠీచార్జిలనూ, టియర్ గ్యాస్ కాల్పులనూ ఎదిరిస్తూ రాళ్లతో జవాబు చెపుతూ ప్రజలు పోలీసులను అక్కడి నుంచి దాదాపు ఒక కిలోమీటర్ అవతలి దాకా వెనక్కి నెడుతూ వెళ్లారు. పోలీసులు ఆ కోల్పోయిన స్థలాన్ని తిరిగి ఆక్రమించడానికి లాఠీచార్జిలతో, టియర్‌గ్యాస్‌తో, హింసాకాండతో మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉండడం కళ్లారా చూశాను.

అక్కడ అప్పటికే తగలబడిపోయిన, తగలబడుతున్న వాహనాల దగ్గర వందలాది మంది మూగి వాటిని తమ సెల్ ఫోన్లలో చిత్రించుకుంటున్నారు. వాళ్లు వాటిని హింసాకాండ అనో, విధ్వంసమనో అనుకోవడం లేదు. ఏదో ఒక పవిత్ర తీర్థయాత్రా స్థలానికి వచ్చినట్టు వస్తున్నారు. ఆ జనం కళ్లలోని తృప్తినీ, సంతోషా న్నీ చూస్తే వారెవ్వరూ దాన్ని హింస అనుకోవడం లేదని, తెలంగాణ ధర్మాగ్రహ ప్రకటనకు ప్రతీక అని అనుకుంటున్నారని అర్థమయింది. అలాగే ముందుకు వెళుతుండగా అటునుంచి వందలాది మంది గుంపుగా పరుగెత్తుకువస్తూ వాటర్ క్యానన్ల సాయంతో పోలీసులు వస్తున్నారు పరుగెత్తండి అన్నారు. వారితోపాటు నేనూ గోడ దూకి రైలు కట్టమీదికి ఎక్కాను.

ఒక ఫర్లాంగు వెనక్కి వచ్చాక హుస్సేన్ సాగర్‌లోకి వచ్చే నాలా మీద వంతెన. పట్టాల మధ్య ఒక్క మనిషి మాత్రమే నడవగల దారి. వందలాది మంది ఒకరి ఒకరు క్రమశిక్షణతో చీమలదండులా ఆ వంతెన దాటి సభవైపు వచ్చారు. అప్పటికే రైలు వంతెనకు సమాంతరంగా ఉన్న రోడ్డు వంతెనమీది దాకా జనాన్ని తరుముతూ వచ్చిన వాటర్ కానన్లు రైలు కట్టమీదికి కూడ నీటి జల్లులు కొట్టాయి. కాని ఒక్క నిమిషంలో దృశ్యం మారిపోయింది. కొన్నివందల మంది జనం ఆ వాటర్ కానన్ల మీదికి రాళ్లు విసురుతూ వాటిని బెదిరిస్తున్నట్టుగా ముందుకు కదులుతుంటే ఆ మహారాక్షస యంత్రం వెనక్కి వెనక్కి పారిపోవడం మొదలుపెట్టింది.

అంతకన్న నయనానందకర సుందర ఉజ్వల దృశ్యం మరేముంటుంది?

తర్వాత సభకు తిరిగి వస్తే కొద్ది నిమిషాల్లోనే భోరున వాన. ఇటీవలి కాలంలో ఎప్పుడూ కురవనంత పెద్ద వాన. అది కూడ ఐదో పదో నిమిషాలు కురిసి ఆగిపోయిన వాన కాదు. అయినా జనం కదలలేదు. తెలంగాణ కోసం దేన్నయినా ఎదిరిస్తాం, దేనికయినా సిద్ధపడతాం అని జనం అక్షరాలా మనోవాక్కాయకర్మలా ప్రకటించిన అద్భుత సన్నివేశం అది. ఆ వర్షం నేలనంతా బురదమయం చేయకపోతే, రాజకీయ వాదవివాదాలు అడ్డురాకపోతే పివి ఘాట్ తెహ్రీర్ స్క్వేరో, జకోటి పార్కో అయి ఉండేదా? సాగరహారం మిలియన్ మార్చ్‌తోనో ఆక్యుపై వాల్ స్ట్రీట్‌తోనో భుజం కలిపి ఉండేదా? వారాలో నెలలో కాకపోయినా కనీసం కొన్ని రోజులయినా సాగి ఉండేదా? మహా ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ సర్కా రు తాను హోస్నీ ముబారక్ కన్న, బారక్ ఒబామా కన్న అనాగరికమైనదాన్నని రుజువు చేసుకుని ఉండేదా? ఆ జరగని పని ఎలా ఉన్నా జరిగిన పని అద్భుతమైనది. సకల అవరోధాల మధ్య ఆ పని సాధించిన తెలంగాణ మహాజనానికి జేజేలు.

[నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *