ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్ నగరంలో పటిష్ఠ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. బుధవారం పోలీస్ ఉన్నతాధికారులు, జీఎంఆర్ ప్రతినిధులతో సమావేశమై తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా రూపొందించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి, ప్రపంచంలోని వివిధ నగరాల్లో అమలులో ఉన్న భద్రత వ్యవస్థ గురించి చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా జీఎంఆర్ ప్రతినిధులు సేఫ్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి లండన్ తరహా వ్యవస్థపై సీఎం కేసీఆర్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ తరహా విధానం వల్ల నేరం జరిగిన వెంటనే క్షణాల్లో సమాచారం తెలుసుకోవడం, ఆ తర్వాత వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని స్పందించే తీరును అభివృద్ధి చేయడం గురించి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నగరంలో భద్రత, నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు తాము పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో సీసీ కెమెరాలు, అలారం సిస్టం, కమ్యూనికేషన్ నెట్ వర్క్ తదితర అంశాలపై సీఎం అధికారులతో చర్చించారు. ప్రపంచంలో ది బెస్ట్ సిటీల్లో అమలులో ఉన్న వ్యవస్థను అధ్యయనం చేసి హైదరాబాద్ కు అవసరమైన భద్రత ఏర్పాట్లను రూపొందించాలని ఆదేశించారు. నగరం మొత్తం ప్రతీ క్షణం వీక్షించేలా నిఘా వ్యవస్థ ఉండాలని, సీసీ కెమెరాలతో నిఘాను ఆధునీకరించాలని సూచించారు. నగరం త్వరలో 4జీ కనెక్టివిటీ నగరంగా మారుతుందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం హామీ ఇచ్చారు.