mt_logo

పోలవరం నిండా అక్రమాలే!

తెలంగాణ రాష్ట్రంలోని పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌కు అప్పజెప్పేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎక్కడ లేని తొందర పడుతున్నది. దీనికి గాను రాజ్యాంగ నియమాలను, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్నది. దీనిలో భాగంగా గతంలో ఆర్డినెన్స్‌ను తెచ్చిన మోడీ ప్రభుత్వం మంగళవారం తీవ్ర నిరసనల మధ్య పార్లమెంటులో ప్రవేశ పెట్టింది. తెలంగాణ ఎంపీలకు తోడు ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎంపీలు తీవ్ర నిరసన తెలుపుతున్నా పోలవరం ముంపు మండలాల బదలాయింపునకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2014ను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీంతో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2వ భాగంలోని 3వ సెక్షన్‌కు సవరణ చేస్తున్నారు.

నిజానికి కేంద్రం చేస్తున్న ఈ తతంగమంతా రాజ్యాంగ అతిక్రమణ. ప్రజావ్యతిరేకం. చట్టవిరుద్ధం. ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన సరిహద్దును మార్చాలంటే సంబంధిత రాష్ట్ర అనుమతితోనే జరగాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 చెబుతున్నది. సరిహద్దు సవరణ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం రాజ్యాంగం నిర్దేశించిన పద్ధతులు, పరిమితులకు లోబడి చేయాలి. కానీ పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందడానికి కేంద్ర ప్రభుత్వం హడావుడి పడుతున్నది. ఇలాంటి ప్రక్రియ జరగాలంటే ముందుగా ఇరు రాష్ట్రాల అసెంబ్లీల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరగాలి.

దానిపై ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి. అంతకన్నా ముఖ్యంగా అది షెడ్యూల్డ్ ప్రాంతం అయినప్పుడు స్థానిక ప్రజల అభిప్రాయం, గ్రామసభల అంగీకారం తప్పనిసరి. కానీ ఇదేమీ చేయకుండా కేంద్రం ఏక పక్షంగా తెలంగాణ రాష్ట్రంలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేయడానికి ఆతృత పడుతున్నది. దీంతో తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న మూడులక్షల మంది ఆదివాసులు పరాయి పాలనలోకి పోవాల్సి వస్తుంది. అంతకన్నా ఆందోళన కలిగించే విషయం ఏమంటే.. తమదైన ప్రత్యేక సాంస్కృతిక జీవన విధానంతో ఉన్న లక్షలాది మంది గిరిజనులు జీవనోపాధితో పాటు సాంస్కృతిక జీవనాన్ని కోల్పోతారు. పోలవరం నిర్మాణంతో 276 గ్రామాలు నీట మనుగుతాయి. ఇంతే గాకుండా పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రం సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్నది.

సరిగ్గా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నియాంగిరి బాక్సైట్ తవ్వకాల విషయలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఒడిషా రాష్ట్రంలోని నియాంగిరి కొండల్లో వేదాంత కంపెనీ బాక్సైట్ తవ్వకాలను ప్రారంభించింది. దీంతో నియాంగిరి కొండ ప్రాంతం గల రాయగఢ, కలహండీ జిల్లాల్లోని ఆదివాసీలు వేదాంత కంపెనీ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. గనుల తవ్వకాలతో తామంతా విస్తాపనకు గురై తీవ్రంగా నష్టపోతామని సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం స్థానిక ఆదివాసుల అనుమతిలేనిదే గనుల తవ్వకాలు జరపరాదని వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా విస్పష్టంగా తీర్పు చెప్పింది. అంతే గాకుండా అక్కడ ఎలాంటి తవ్వకాలు జరపాలన్నా స్థానిక ఆదివాసీ గ్రామసభల ఒప్పుకోలు తీర్మానాల తర్వాతనే జరగాలని ప్రకటించింది.

అదే సందర్భంగా.. తమదైన ప్రత్యేక సంస్కృతి, జీవన విధానాలతో జీవిస్తున్న ఆదివాసుల జీవన విధానాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికున్నదని తెలిపింది. గ్రామసభల తీర్మానాలు లేకుండా బాక్సైట్ తవ్వకాలు జరపడానికి వీలులేదని వేదాంత కంపెనీకి తేల్చి చెప్పింది.

ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలోనూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్ర రాష్ట్రప్రభుత్వాలు అనుసరించాలి. నియాంగిరి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా పోలవరం కట్టడం కోర్టు ధిక్కరణే. అలాగే ముంపు ప్రాంతాలను ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేయడం కూడా రాజ్యాంగ అతిక్రమణ. ఇలా పోలవరం ప్రాజెక్టు కట్టడం విషయంలోనూ, ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం విషయంలోనూ ఆదివాసుల హక్కులను హరించి వేయడం రాజ్యాంగ విరుద్ధం. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో అధికారం చేపట్టిన మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరును ఇది చెప్పకనే చెబుతున్నది.

పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా పూర్తి గా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తలపెట్టిన ప్రతిపాదిత స్థలం ఏమాత్రం ప్రాజెక్టు కట్టడానికి అనువైన చోటు కాదని నిపుణులు చెబుతున్నా కోస్టల్ కారిడార్‌లోని బడా పారిశ్రామికవేత్తల కోసం పోలవరాన్ని నిర్మిస్తూ ప్రజల ప్రయోజనాల కోసమని నమ్మబలుకుతున్నారు. మరోవైపు కోస్తా ప్రజలు ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నెత్తిన పోలవరం ప్రాజెక్టు నీటి బాంబులాంటిదని నిపుణులు చెబుతున్నా చంద్రబాబు వినిపించుకోవడం లేదు. ఏ కోణంలో చూసినా పోలవరం ప్రాజెక్టు నిలువెల్లా అక్రమాలతో నిండి ఉన్నది. ప్రజావ్యతిరేకమైనది. ప్రజలను నిలువెల్లా ముంచేది.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *