తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలతో సీఎం కేసీఆర్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో సుమారు ఆరుగంటలపాటు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పల్లె, పల్లెకూ, గడప, గడపకూ చేరేలా ప్రచారం చేయడానికి తెలంగాణ సాంస్కృతిక వారధిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సమావేశంలో ఈ పథకం గురించి వారికి వివరిస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణను ఒక మహోద్యమంలా చేపట్టాలని కళాకారులను కోరారు.
చెరువుల ప్రాముఖ్యం, వాటి పునరుద్ధరణపై ప్రజల్లో అవగాహన పెంచే విధంగా అద్భుతమైన పాటలు రాయాలని, తానుకూడా ఒక పాట రాస్తానని కేసీఆర్ అన్నారు. సాంస్కృతిక వారధిలో కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఉద్యమ సమయంలో రాత్రింబవళ్ళు శ్రమకోర్చి పనిచేసిన సుమారు 500 మంది కళాకారులను ఎంపికచేసి వారికి సముచిత గౌరవం కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ సాంస్కృతిక వారధి కార్యాలయాన్ని ఇందిరా పార్క్ సమీపంలోని 11 ఎకరాల్లో నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని, వివిధ జిల్లాలనుండి వచ్చే కళాకారులకు ఈ భవనంలో వసతి సదుపాయాలను కల్పించనున్నట్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కళాభవన్ నిర్మిస్తామని సీఎం వారికి తెలిపారు. ఈ సమావేశంలో నందిని సిద్ధారెడ్డి, గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్, వరంగల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.